
పత్రీని సాయిబాబా స్వస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనకు నిరసనగా షీర్డీ సంస్థాన్ ట్రస్టు, గ్రామస్తులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు.
ఔరంగాబాద్ : షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాయిబాబా జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై షిర్డీ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. షిర్డీ సాయి జన్మస్థలం విషయమై రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేశారు. ఇక పత్రీని సాయిబాబా స్వస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనకు నిరసనగా షీర్డీ సంస్థాన్ ట్రస్టు, గ్రామస్తులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, షిర్డీని సందర్శించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని సాయి సంస్థాన్ ట్రస్టు సభ్యుడు బి.వాక్‌చౌర్ వెల్లడించారు. ‘షిర్డీ సాయి జన్మస్థలంపై వస్తున్న పుకార్లకు నిరసనగా.. ఆదివారం (జనవరి 19) నుంచి ఆలయాన్ని మూసివేసేందుకు నిర్ణయించాం’అన్నారు. ఇక ఇదే అంశంపై షిర్డీ ప్రజలతో శనివారం సాయంత్రం సమావేశమవుతామని పేర్కొన్నారు.