
సాక్షి, ముంబై: పాథ్రీ గ్రామాన్ని సాయిబాబా జన్మస్థలంగా కాక, ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో బాబా జన్మస్థలంపై తలెత్తిన వివాదం సమసినట్లయింది. సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీ గ్రామాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో షిర్డీ వాసులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షిర్డీలోని దుకాణాలను మూసివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన సీఎం ఉద్ధవ్ సోమవారం షిర్డీ, పాథ్రీ గ్రామాల ప్రముఖులు, షిర్డీ ఆలయ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ పాథ్రీ గ్రామాన్ని సాయిబాబా జన్మస్థలంగా కాకుండా ఒక పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, పాథ్రీ సాయిబాబా జన్మస్ధలమంటూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకు పాథ్రీ, షిర్డీ వాసులు సమ్మతించారు. ‘బాబా జన్మస్థలం పాథ్రీ అవునో కాదో నాకు తెలియదు. నేనేమీ పరిశోధకుణ్ని కాదు. అందరూ అన్నట్టుగానే నేనూ అన్నా’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment