సాక్షి, ముంబై/షిర్డీ: షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీ్డలో జరుగుతున్న బంద్ ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి బంద్‌ను నిలిపివేస్తున్నట్లు శివసేనకు చెందిన స్థానిక ఎంపీ సదాశివ లోఖండే ప్రకటించారు. ఈ అంశంపై సంబంధిత వర్గాలతో సోమవారం సీఎం ఠాక్రే సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయన షిర్డీ్డలోని స్థానికులతో చర్చించారు. అంతకుముందు, బంద్‌కు ఎంపీ సదాశివ లోఖండే మద్దతు ప్రకటించారు.
ఠాక్రే వ్యాఖ్యలపై నిరసనగా ఆదివారం షిర్డీ్డలో బంద్ పాటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి షిర్డీతో పాటు చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల్లోనూ బంద్ జరిగింది. అయితే, షిర్డీ సాయి ఆలయం తెరిచే ఉంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సాయినాథుని దర్శించుకున్నారు. షిర్డీ్డలోని షాపులు, రెస్టారెంట్లు, ప్రైవేటు వాహనాల వారు బంద్ పాటించారు. ముందే బుక్ చేసుకున్నవారికి మాత్రం హోటళ్లలో వసతి కల్పించారు. సాయిబాబా దర్శనం కోసం వచ్చిన భక్తులకు స్థానికులు ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. భక్తులకు ఉపాహారం అందించే ప్రసాదాలయ, లడ్డూ కౌంటర్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి.
స్థానికులు, భక్తులు ఆదివారం ఉదయం ద్వారకామాయి ఆలయం నుంచి ప్రారంభించి సాయి ఆలయం చుట్టూరా భారీ ర్యాలీ నిర్వహించారు. పర్భని జిల్లాలోని పాథ్రీలో ఉన్న ‘సాయి జన్మస్థాన్’ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడంతో వివాదం ప్రారంభమైంది. పత్రిని అభివృద్ధి చేయడం పట్ల తమకు అభ్యంతరం లేదని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్‌ఎస్‌ఎస్‌టీ) మాజీ సభ్యుడు సచిన్ థాంబె తెలిపారు. సాయిబాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనడంపైనే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు. ‘పత్రి తన జన్మస్థలమని సాయిబాబా ఎన్నడూ చెప్పలేదు’ అని వివరించారు. బంద్ కారణంగా షిర్డీకి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిందని రాష్ట్ర మంత్రి చగన్ భుజ్‌బల్ పేర్కొన్నారు. సాధారణం కన్నా 10 వేల మంది తగ్గారన్నారు.
ఇరు గ్రామాల వారితో భేటీ
ఈ అంశంపై నేడు(సోమవారం) సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి షిర్డీ, çపత్రి గ్రామాల వాస్తవ్యులు, షిర్డీ ఎమ్మెల్యే విఖే పాటిల్, ఎంపీ లోఖండే హజరవుతారని ఎస్‌ఎస్‌ఎస్‌టీ సీఈఓ దీపక్ ముగ్లీకర్ తెలిపారు. పత్రిలో సాయిబాబా జన్మించాడని 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొనడంతో.. సాయిబాబా జన్మస్థలానికి సంబంధించిన వివాదం ప్రారంభమైంది. ‘2017లో రాష్ట్రపతి షిర్డీకి వచ్చినప్పుడు షిర్డీ సాయిబాబా కర్మభూమి.. పత్రి ఆయన జన్మభూమి అని వ్యాఖ్యానించారు. ఈ విషయమై రాష్ట్రపతిని నేను ఆ తరువాత కలిసి వివరణ ఇచ్చాను.
అధికారులు చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని అప్పుడు రాష్ట్రపతి అన్నారు’ అని లోఖండే వివరించారు. పత్రినే సాయి జన్మభూమి అని ఆ గ్రామస్తులు వాదిస్తున్నారు. సాయి జీవిత చరిత్ర ‘శ్రీ సాయిసశ్చరిత’లో కూడా çపత్రినే సాయి జన్మస్థలంగా పేర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. ‘పాథ్రీనే సాయిబాబా జన్మస్థలమని ఆయన శిష్యుడు దాసు గణు మహారాజ్ తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. షిర్డీ సంస్థాన్ కూడా çపత్రినే సాయిబాబా జన్మస్థలమని నిర్ధారిస్తూ కొన్ని పత్రాలు ప్రచురించింది’ అని పత్రిలోని ‘శ్రీ సాయి జన్మస్థాన్ టెంపుల్ ట్రస్ట్’ సభ్యుడు సంజయ్ భూసారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment