చెల్లికి ఫోన్‌ చేసి.. బావ‌ను చంపేసిన అన్న‌ | love affair claims one life in godavarikhani | Sakshi
Sakshi News home page

సద్దుల బతుకమ్మకు వస్తున్నా అని చెప్పి.. చెల్లి భర్తను హతమార్చిన అన్న

Published Fri, Oct 11 2024 4:32 PM | Last Updated on Fri, Oct 11 2024 4:37 PM

love affair claims one life in godavarikhani

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ప్రేమపెళ్లి వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. ‘నిన్ను చూడాలని ఉంది చెల్లీ.. సద్దుల బతుకమ్మకు మీ ఇంటికి వస్తున్నా’అని తన చెల్లికి ఫోన్‌ చేశాడు ఓ అన్న. నిజమేనని నమ్మిన ఆ చెల్లి.. తన భర్తను ఎదురు పంపించింది. అయితే అన్నతోపాటే, ఆమె మాజీ భర్త ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే చెల్లిని ఓ గదిలో బంధించిన అన్న.. బయట గడియపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో చెల్లి భర్తపై దాడిచేసి చంపేశాడు.

పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ కథనం ప్రకారం.. యైటింక్లయిన్‌కాలనీలోని హనుమాన్‌నగర్‌కు చెందిన వడ్డాది వినయ్‌కుమార్‌(25) గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నాడు. అదే ఏరియాకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకోగా, రెండు కుటుంబాలు అంగీకరించలేదు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ సాగుతుండగానే వినయ్‌ ఆ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌లో ఇంట్లో ఇద్దరూ అద్దెకు ఉంటున్నారు. అయితే తమ కొడుకు ఇష్టాన్ని కాదనలేక వినయ్‌ తల్లిదండ్రులు అద్దె ఉంటున్న ఇంటి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.

చ‌ద‌వండి: కట్టుకున్నోడే కాలయముడయ్యాడు

అయితే సద్దుల బతుకమ్మ వేడుకను సాకుగా తీసుకున్న ఆ వివాహిత సోదరుడు.. ఆమెకు ఫోన్‌చేసి చూడాలని ఉందన్నాడు. అడ్రస్‌ తెలియదని, వినయ్‌ను తన వద్దకు పంపించాలని కోరాడు. ఇది నిజమని నమ్మిన ఆమె వినయ్‌కు విషయం చెప్పి తన అన్నను తీసుకురమ్మని పురమాయించింది. వినయ్‌ వివాహిత అన్నను తీసుకొని ఇంటికొచ్చాడు. ఆయన వెంట మాజీ భర్త కూడా వచ్చాడు. ఇంటికి రాగానే వివాహిత అన్న, మాజీ భర్త వినయ్‌పై విచక్షణా రహితంగా దాడిచేశారు. కత్తితో పొడిచి హత్య చేశారు. ఏసీపీ రమేశ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ ప్రసాద్‌రావుతో కలిసి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  

మిన్నంటిన రోద‌న‌లు
కాగా కాలనీలో ఒక వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా మరో వైపు హత్య జరగడంతో సంచలనంగా మారింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఏకైక కుమారుడు హత్యకు గురికావడంతో ఆ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ప్రేమపెళ్లే తన కుమారున్ని పొట్టనబెట్టుకుందని మతుని తండ్రి కుమార్‌ రోధిస్తూ వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement