కాన్‌బెర్రా : టీమిండియాలో ప్రస్తుతం బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడి పేరు చెప్పమంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. నిజమే హార్దిక్ తన కెరీర్‌లోనే ఇప్పుడు అత్యున్నతమైన ఫామ్‌లో ఉన్నాడు. మైదానంలోకి దిగాడంటే సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తున్నాడు. సెప్టెంబర్ 2019లో వెన్నుముక గాయంతో దూరమైన హార్దిక్ ఆ తర్వాత టీమిండియా తరపున ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. ఇంతలో ప్రపంచాన్ని కరోనా కుదిపేయడం.. ఆపై దక్షిణాఫ్రికా సిరీస్ రద్దవడం జరిగింది. ఆ తర్వాత యూఏఈ వేదికగా సెప్టెంబర్ 2020లో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగిన హార్దిక్ అవకాశం వచ్చినప్పుడల్లా చెలరేగిపోయాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 281 పరుగులు సాధించాడు. (చదవండి : ఈ ఓటమి మాకు మంచి గుణపాఠం : కోహ్లి)
కాగా పాండ్యా ఆ ఫామ్‌ను ఇప్పుడు ఆసీస్ టూర్‌లోనూ కంటిన్యూ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిని పరీశీలిస్తే టీమిండియా నుంచి టాప్ స్కోరర్‌గా.. ఓవరాల్‌గా మూడో స్థానంలో హార్దిక్ నిలిచాడు. మొదటి రెండు స్థానాల్లో ఫించ్, స్మిత్‌లు ఉన్నారు. హార్దిక్ మూడు మ్యాచ్‌లు కలిపి 114 స్ట్రైక్ రేట్‌తో 210 పరుగులు సాధించాడు. ఇందులో 15 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో 375 పరుగులు భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నా.. ఒకవైపు వికెట్లు పడుతున్నా పాండ్యా మాత్రం ఏ మాత్రం బెదరలేదు. 76 బంతుల్లోనే 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 90 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. రెండో మ్యాచ్‌లో 28 పరుగులే చేసినా.. మూడో మ్యాచ్‌లో మళ్లీ విజృంభించాడు. (చదవండి : వైరలవుతున్న నటరాజన్ ఎమోషనల్ వీడియో)
ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 250 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో క్రీజులో ఉన్న పాండ్యా.. మరో ఆల్‌రౌండర్ జడేజాతో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన విధానం చూస్తే అతని ఆటతీరు ఏ విధంగా ఉందన్నది అర్థమవుతుంది. 76 బంతుల్లోనే 92 పరగులు చేసిన పాండ్యా ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక మున్ముందు హార్ధిక్ జోరు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
ఈ సందర్భంగా ఆసీస్‌తో మూడో వన్డేలో మ్యాచ్ గెలిచిన తర్వాత హార్దిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రెజంటేషన్ సందర్బంగా హార్దిక్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. 'ఈరోజు సాధించిన విజయం నిజంగా అద్భుతం. ఏం చేసినా దేశం కోసమే.. నేను ఈరోజు ఇలా ఆడుతున్నానంటే దాని వెనుక పడ్డ కఠోర శ్రమ ఎంతో దాగుంది. నేను చేసిన హార్డ్‌వర్క్ నేడు అద్భుతమైన ఫామ్‌లో ఉండేలా చేసింది. సిరీస్‌లో నా నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం చాలా ఆనందం కలిగించింది. ఆస్ట్రేలియాతో ఆడడం నాకు ఎప్పుడు సవాల్‌గానే అనిపిస్తుంది. ఒక బలమైన జట్టుపై ఇలాంటి ప్రదర్శన చేస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. (చదవండి : 21 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు)
ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించడం మాములు విషయం కాదు. ఇక ఈ సిరీస్ మాలాంటి యువ ఆటగాళ్లకు మంచి అవకాశమనే చెప్పొచ్చు. ఉదాహరణకు టి. నటరాజన్ తనకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. నటరాజన్‌ది ఒక డిఫెరెంట్ స్టోరీ.. జీవితంలో ఎన్నో కష్టాలకోర్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అంతర్జాతీ స్థాయి మ్యాచ్ వరకు చేరుకున్నాడు. నటరాజన్ స్టోరీ ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రానున్న టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటున్నాం.' అని పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా శుక్రవారం ఆసీస్, టీమిండియా జట్ల మధ్య కాన్‌బెర్రా వేదికగా శుక్రవారం(డిసెంబర్ 4) తొలి టీ 20 మ్యాచ్
జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment