సమ్మర్‌లో చదివేద్దాం | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో చదివేద్దాం

Published Sat, May 18 2024 10:05 AM

సమ్మర

సద్వినియోగం చేసుకోవాలి

వేసవి సెలవుల్లో విద్యార్థులకు గ్రంథాలయాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని అదేశాలు వచ్చాయి. ఒకొక్క కేంద్రానికి రూ.10వేల బడ్జెట్‌ కేటాయించారు. గత ఏడాది విజయవంతంగా నిర్వహించాం. విద్యార్థులు అధికంగా సెల్‌ఫోన్‌లకే సమయం కేటాయించి చిన్న వయస్సులోనే కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు గ్రంథాలయాలకు వచ్చేలా తల్లిదండ్రులు ప్రొత్సహించాలి. విద్యార్థుల ఫోన్‌ నంబర్లు సేకరించి నిత్యం శిక్షణకు వచ్చేలా చూడాలని సిబ్బందిని అదేశించాం. ఆసక్తి గల ఉపాధ్యాయులు, చిత్రలేఖనం, వృత్తి శిక్షణ చేసిన వారు గ్రంథాలయాల్లో విద్యార్థులకు సమయం కేటాయించేందుకు ముందుకు రావాలి. ఉమ్మడి జిల్లాకు దాదాపు రూ.12 లక్షలు నిధులు కేటాయించారు.

–వి.ఎల్‌.ఎన్‌.ఎస్‌.వీ ప్రసాద్‌ ,

జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏటా వేసవి సెలవుల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేవారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020, 2021లో రెండేళ్లపాటు రద్దు చేశారు. 2022వ సంవత్సరం నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి గత నెల 29వ తేదీ నుంచి నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. అయితే పెరిగిన ఉష్టోగ్రతలు, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల సమయం వృథా కాకుండా వారిలో పఠనాశక్తిని కలిగించడం, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ప్రొత్సహించడం లక్ష్యాలుగా వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లా గ్రంథాలయ సంస్థ సమాయత్తమైంది. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను అకట్టుకునేలా వివిధ అంశాలపై 40 రోజులు శిక్షణ ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జూన్‌ 7వ తేదీ వరకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించనున్నారు. సమీప గ్రంథాలయాలకు వెళ్లి సంప్రదించాల్సి ఉంటుంది. వివిధ సంస్థలకు చెందిన నిపుణులు తరగతులు నిర్వహిస్తారు.

రెండు విభాగాల్లో నిర్వహణ

పఠనం, సరదా అనే రెండు విభాగాల్లో శిక్షణ ఉంటుంది. పుస్తక పఠనం, కథలు చెప్పించడం, ప్రముఖులతో అవగాహన సదస్సులు, ఆటలపై ఆసక్తి ఉన్నవారికి చెస్‌, క్యారమ్స్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. విజేతల పుస్తకాలతో పాటు కవులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలు, వివిధ దినపత్రికలు, చిన్నారులకు ఉపయోగపడే పుస్తకాలు గ్రంథాలయాల్లో ఏర్పాటు చేశారు. నృత్యం, పప్పెట్ల తయారీ వంటి వాటిపై శిక్షణ ఇవ్వవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

సేవలకు అవకాశం

పేద విద్యార్థులకు స్వచ్ఛంద సేవ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. స్పోకెన్‌ ఇంగ్లిష్‌, చెస్‌, డ్రాయింగ్‌, తెలుగులో మంచి ప్రతిభ ఉన్నవారు ఈ గ్రంథాలయాల ద్వారా స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు గ్రంథాలయ సంస్థ అవకాశం కల్పిస్తోంది. వేసవిలో ఇలాంటి సేవ ద్వారా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఆస్కారం ఉంటుంది.

జిల్లాలో ఇలా..

జిల్లా కేంద్ర గ్రంథాలయం 01, ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు 05, ద్వితీయ శ్రేణి 10, తృతీయ శ్రేణి 86, పుస్తక నిక్షిప్త కేంద్రాలు 165.

వేసవి విజ్ఙాన శిబిరాలకు

గ్రంథాలయాలు సిద్ధం

జూన్‌ 7 వరకూ నిర్వహణ

సద్వినియోగం

చేసుకోవాలంటున్న అధికారులు

సమ్మర్‌లో చదివేద్దాం
1/1

సమ్మర్‌లో చదివేద్దాం

Advertisement
 
Advertisement
 
Advertisement