మూగబోయిన మైకులు..రెండో దశ పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ | Sakshi
Sakshi News home page

మూగబోయిన మైకులు..రెండో దశ పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌

Published Thu, Apr 25 2024 3:59 PM

Loksabha Elections Second Phase Polling On April 26th

న్యూఢిల్లీ,సాక్షి: రెండో విడత లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాల్లో ఓట్ల పండుగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాహుల్ గాంధీ, శశి థరూర్‌, హేమామాలిని తదితరులు సెకండ్ ఫేజ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

లోక్‌సభ ఎన్నికల రెండో దశ ప్రచారానికి బుధవారం(ఏప్రిల్‌24) సాయంత్రం తెరపడింది. దాదాపు నెల రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుండగా.. శుక్రవారం(ఏప్రిల్‌26) రెండో దశ పోలింగ్ జరగనుంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్‌.

ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్ ప్రకారం రెండో దశలో 89 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలవి మరణంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ జరగనుంది.

కర్ణాటకలో 14, రాజస్థాన్‌‌లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బిహార్‌లో ఐదేసి, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌లో మూడు, మణిపుర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌‌లో ఒక్కో స్థానానికి పోలింగ్‌ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్‌, కేంద్రమంత్రులు రాజీవ్‌ చంద్రశేఖర్‌, గజేంద్ర సింగ్ షెకావత్‌, లోక్‌సభ మాజీ స్పీకర్ ఓంబిర్లా, వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్, టీవీ రాముడు అరుణ్ గోవిల్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని, నటి నవనీత్ కౌర్ రాణా సహా పలువురు ప్రముఖులు రెండో దశ బరిలో ఉన్నారు.

వరుసగా రెండోసారి కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు రాహుల్ గాంధీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాతో తలపడుతున్నారు. ఏప్రిల్‌19న తొలి దశ పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. లోక్‌సభ బరిలో అఖిలేశ్‌.. మళ్లీ అక్కడి నుంచే 
 

Advertisement
Advertisement