
ఇస్లామాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ అనుమతి నిరాకరించింది. గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తామని దాదాపు నెల క్రితమే పాక్ ప్రకటించినా ఈ విషయమై అధికారింగా ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. తాజాగా, రాష్ట్రపతి కోవింద్ విమానానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందిస్తూ.. ప్రముఖ వ్యక్తులు ప్రయాణించే విమానాలను ఏ దేశమైనా సాధారణంగా అనుమతిస్తుంది. పాక్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం’అని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి కోవింద్ సోమవారం నుంచి ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఉగ్రవాదంతో దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించనున్నారు.