ఆగస్టు 15 లోపు ఆధార్‌కు నమోదు చేసుకునే విద్యార్థులకు తొందరగా కార్డులిస్తామని యూఐడీఏఐ తెలిపింది.
న్యూఢిల్లీ: విద్యార్థులు ఉపకార వేతనం అందుకోవటంలో ఇబ్బందుల్లేకుండా త్వరితగతిన ఆధార్‌కార్డు మంజూరు చేయడానికి యూఐడీఏఐ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆగస్టు 15 లోపు ఆధార్‌కు నమోదు చేసుకునే విద్యార్థులకు తొందరగా కార్డులిస్తామని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. విద్యార్థులకు ఆధార్ కార్డులు ఇప్పించే బాధ్యత పాఠశాలలదేనని, దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రాలకు పిల్లలను తీసుకెళ్లాలని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఆధార్ కార్డు కలిగిన విద్యార్థులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఎటువంటి ఆటంకాలూ లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే పొందొచ్చు. ఇప్పటిదాకా దేశంలో 103.5 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు. దేశ జనాభాలోని పెద్దలలో 97 శాతం మందికి ఆధార్ కార్డులుండగా, 5-18 ఏళ్లలోపు పిల్లల్లో మాత్రం 64 శాతం మందికే ఆధార్ కార్డులున్నాయి.