Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Free medical treatment banned Network hospitals on strike in Andhra Pradesh1
‘ఆరోగ్యం’ విషమం..ఆగిన సేవలు!

సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీకి టీడీపీ కూటమి సర్కారు రూ.3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెకు దిగడంతో సోమవారం నుంచి ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. గత ఐదేళ్లూ పేద, మధ్య తరగతి వర్గాలను అపర సంజీవనిలా ఆదుకున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ)ని టీడీపీ కూటమి సర్కారు అస్తవ్యస్థంగా మార్చేయడంతో వైద్యం కోసం మళ్లీ అప్పుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ ఇచ్చింది. రూ.1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. దీనిపై ఆస్పత్రులతో చర్చలు జరిపి సేవలు నిలిచిపోకుండా చూడాల్సిన కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవలు ఆగిపోయే పరిస్థితి దాపురించింది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చిన సీఎం చంద్రబాబు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం నిలిపివేశారు. దీంతో ఆస్పత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఈ ఏడాది జనవరి ఆరో తేదీ నుంచే ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌), అన్ని రకాల నగదు రహిత సేవలను నిలిపి వేశాయి. మూడు నెలలకుపైగా వైద్య సేవలు అందడం లేదు. ఇన్ని రోజుల పాటు సేవలను నిలిపివేయడం ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇదే తొలిసారి అని యాజమాన్యాలు చెబు­తున్నాయి. ఆరోగ్యశ్రీని ట్రస్టు విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్య ప్రదాత..ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి సేవలను విస్తరించడంతో ఐదేళ్లలో దాదాపు 45 లక్షల మందికి రూ.13 వేల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే వరకూ ఆయా కుటుంబాల జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా మరో రూ.1,465 కోట్లకుపైగా ఆర్ధిక సాయం అందించి భరోసానిచ్చారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటుతోపాటు పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు బలోపేతం చేశారు. వినూత్న రీతిలో తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు కోసం మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా 88 కొత్త పీహెచ్‌సీల నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో పీహెచ్‌సీలో ఒకే ఒక వైద్యుడు ఉండగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇద్దరు డాక్టర్ల చొప్పున నియమించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జీరో వేకెన్సీ విధానంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖలో రికార్డు స్థాయిలో 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత 61 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో కేవలం 6.2 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. బకాయిలు చెల్లించి భరోసా 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కారు 2019లో దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయిలు పెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించి పేదల వైద్యానికి అండగా నిలిచింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్‌ జగన్‌ ఊపిరిలూదారు. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అప్పటి వరకూ పథకంలో వెయ్యి ప్రొసీజర్‌లు మాత్రమే ఉండగా వాటిని ఏకంగా 3,257కి పెంచారు. రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. దీంతో రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది.

Not Worried About Elon Musk Tesla Coming To Country Says BMW India2
టెస్లా రాకపై బీఎండబ్ల్యూ ఇండియా కీలక వ్యాఖ్యలు

అమెరికన్ బ్రాండ్ టెస్లా.. భారతదేశంలో ప్రవేశిస్తుందనే వార్త దేశీయ విఫణిలో కొంతమంది వాహన తయారీదారులను ఒకింత భయానికి గురి చేసింది. అయితే బీఎండబ్ల్యూ ఇండియా మాత్రం.. మాకు ఏమాత్రం భయం లేదని స్పష్టం చేసింది.టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ వాహన విభాగం మరింత అభివృద్ధి చెందుతుందని బీఎండబ్ల్యూ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ 'విక్రమ్ పవాహ్' స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్ పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కువ పోటీ ఉన్నప్పుడే.. ఆ విభాగం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.టెస్లా కంపెనీ పోటీపై మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో మా ఉనికి ఉంది. ప్రతి ఏటా బీఎండబ్ల్యూ నమోదు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కూడా ఆశాజనకంగానే ఉందని విక్రమ్ పవాహ్ పేర్కొన్నారు. 2024లో బీఎండబ్ల్యూ గ్రూప్ నాలు లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇది అంతకు ముందు అమ్మకాలతో పోలిస్తే 13.5 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్స్ రెండూ.. కూడా వరుసగా 3,68,523 యూనిట్లు.. 56,181 యూనిట్ల అమ్మకాలను సాధించాయని పవాహ్ చెప్పారు. 2025 జనవరి, మార్చి కాలంలో భారతదేశంలో కార్ల అమ్మకాలు 7 శాతం పెరిగి 3,914 యూనిట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది కూడా కంపెనీ అమ్మకాలలో వృద్ధి కనపరచడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

Sakshi Guest Column On Santosh Movie3
కఠిన వాస్తవాలను దాచేస్తారా?

ఆమె పేరు సూచిస్తున్నట్టుగానే సంధ్యా సూరి భారత సంతతికి చెందిన ఫిల్మ్‌ మేకర్‌. ఆమె దర్శకత్వం వహించిన ‘సంతోష్‌’ సినిమా గత ఏడాది యూకే తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్స్‌కు వెళ్లింది. కాన్‌ (ఫ్రాన్స్‌) చిత్రోత్సవంలో విశేష మన్ననలు అందుకుంది. ‘బాఫ్టా’ (బిఏఎఫ్‌టీఏ– ద బ్రిటిష్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌)కు నామినేట్‌ అయ్యింది. ఇందులో నటించిన షహానా గోస్వామి ఏసియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఇంత ఖ్యాతి గడించినప్పటికీ, కోట్లాది మంది భారతీయులు మాత్రం ఈ సినిమాను ఎప్పటికీ చూడలేరు. సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ– సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌) దీనికి దారుణమైన కత్తెరలు వేసింది. వాటికి అంగీకరిస్తేనే భారత్‌లో ప్రదర్శనకు అనుమతి ఇస్తామని చెప్పడంతో, సంధ్యా సూరి సహజంగానే అందుకు నిరాకరించారు.పూర్తిగా భారత్‌లోనే నిర్మించిన, భారతీయ నటీనటులతోనే చిత్రీకరించిన, అదీ హిందీలో తీసిన చిత్రం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి భారతీయ చిత్రం. కానీ భారతీయులమైన మనం దీన్ని వీక్షించలేక పోవడం మన దౌర్భాగ్యం. ఎందుకంటే, మనం కాదనలేని ఒక సత్యాన్ని ఇది ఆవిష్కరించింది. దాన్ని మనకు తెలియకుండా దాచి ఉంచగలనని సెన్సార్‌ బోర్డు అనుకుంటోంది. నేను ప్రస్తావిస్తున్న ఈ సత్యం పోలీసుల కర్కశత్వం, వారు పెట్టే చిత్రహింసల గురించి!ఈ సినిమా నేను చూశాను. ఇది అంతులేని బాధ కలిగిస్తుంది. మనసును విపరీతంగా కలవరపెడుతుంది. ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసుల దాష్టీకానికి ఇది వాస్తవ చిత్రీకరణ. అమాయక ప్రజలను పోలీసులు ఎలా టార్చర్‌ పెట్టగలరో, దళితులు, ముస్లింలు వారి చేతిలో ఎన్ని దుర్మార్గాలకు గురవుతున్నారో, మానభంగాలను ఏ విధంగా వారు వెనకేసుకొస్తారో, సాధారణ ప్రజానీకాన్ని ఎంతగా భయభ్రాంతులకు గురిచేస్తారో ఈ సినిమా కళ్లకు కడుతుంది. పుట్టుక, సంపద, పలుకుబడి... ఈ మూడింటిలో ఏ బలమూ లేకుండా పోలీసులతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ ఇది సత్యమని, ఇదే వాస్తవమని తెలుసు. ఈ య«థార్థం వారికి ఆశ్యర్యం కలిగించదు, వారిని దిగ్భ్రాంతికి అసలు గురి చేయదు. ఎందుకంటే వారికి పోలీసుల వైఖరి నిత్యజీవిత అనుభవం. కానీ సెన్సార్‌ బోర్డు దీన్ని సమ్మతించడానికి ఇష్టపడటం లేదు. గుర్తించడానికి అంగీకరించడం లేదు. పోలీసుల హింస, జవాబుదారీతనం లేకపోవడం గురించి ‘పోలీస్‌ టార్చర్‌ అండ్‌ (అన్‌) అకౌంటబిలిటీ’ పేరుతో ‘కామన్‌ కాజ్‌’, ‘లోక్‌నీతి సీఎస్‌డీఎస్‌’లు ఇటీవలే సంయుక్తంగా ప్రచురించిన ఒక నివేదిక ఈ సినిమా వాస్తవికతను ధ్రువీకరిస్తోంది. 17 రాష్ట్రాల్లో 8,000 మందికి పైగా పోలీసులను ఈ సంస్థలు సర్వే చేశాయి. వారిలో రమారమి 30 శాతం మంది చిత్రహింసలను సమర్థించారు. ప్రమాదకరమైన నేరగాళ్లను విచారణ ముగిసే వరకూ వేచిచూడకుండా చంపేయడమే మెరుగు అని దరిదాపు 25 శాతం మంది తేల్చి చెప్పారు. ప్రజల్లో భయం ఉండాలంటే కఠిన పద్ధతులు అవలంబించాల్సిందే అంటూ 20 శాతం మంది వెల్లడించారు. ముస్లింలు నేరప్రవృత్తికి లోనయ్యే అవకాశం ఉందని 50 శాతం మంది చెప్పడం ఆశ్చర్యకరం. ఇక, ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌’ (ఎస్‌ఓపీ)ను పాటించడం ఎప్పుడో తప్ప జరగదని 40 శాతం కంటే ఎక్కువ మందే అంగీకరించారు. అందుకే కాబోలు... కేవలం 33 శాతం మంది భారతీయులే పోలీసులను విశ్వసిస్తారని ‘ఇప్సాస్‌’ సర్వే (యూకే) నిర్ధారించింది. వీటిలో ఏదీ మనకు ఆశ్యర్యం కలిగించదు. ఎవరూ చెప్పనవసరం లేకుండానే ఇవన్నీ నిజాలేనని మనకు సహజంగానే తెలుసు. పోలీసుల దాష్టీకాన్ని వెల్లడించే అధ్యయనాలకు కొరత లేదు. ‘నేషనల్‌ క్యాంపేన్‌ ఎగైనెస్ట్‌ టార్చర్‌’ వార్షిక నివేదిక (2019) ప్రకారం, ఆ ఏడాది 1,723 కస్టడీ చావులు వెలుగు చూశాయి. అంటే పోలీసు కస్టడీలో రోజుకు అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఈ అధ్యయ నాలు బట్టబయలు చేసిన వాస్తవాలకే ‘సంతోష్‌’ సినిమా కర్కశ, వాస్తవిక దృశ్యరూపం ఇచ్చింది. అయినా సరే, భారతీయలు ఈ సినిమా ఎప్పటికీ చూడలేరు. ఏదైనా అద్భుతం జరిగి సెన్సార్‌ బోర్డు మనసు మారితే తప్ప!ముచ్చటైన విషయం ఏమిటటే, ఇండియాలో చిత్రీకరణ కోసం అనుమతి కోరుతూ సంధ్యా సూరి తన సినిమా స్క్రిప్టును అధికా రులకు సమర్పించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు. ‘గార్డియన్‌’ వార్తాపత్రికకు ఆమె ఇదే చెప్పారు. ‘ఇప్పుడు చాంతాడు పొడవన్ని కట్స్‌ జాబితా ఇచ్చారు. ఈ సెన్సార్‌ కోత లన్నీ కలిపి పేజీలకు పేజీలు ఉన్నాయి’. వాటికి అంగీకరించడం ‘అసాధ్యం’. ఎందుకంటే, సినిమా ‘విజన్‌’ పూర్తిగా దెబ్బతింటుందని ఆమె వాపోయారు.నేను ఈ సినిమా చూసిన ప్రభావంతో చెబుతున్నాను. ఇది తప్పనిసరిగా చూడాల్సినది. బాలీవుడ్‌ సినిమాల్లో కూడా పోలీసు జులుం తరచూ కనబడుతూనే ఉంటుంది. అయితే, అది మృదువుగా, ప్రభావ శూన్యంగా ఉంటుంది. సానుకూల కోణం కూడా సమాంతరంగా నడుస్తుంది. కానీ ‘సంతోష్‌’ అలాకాదు.అందులో ఎలాంటి చక్కెర పూతా ఉండదు. కర్కశమైన, ఉపశమన రహితమైన వాస్తవికతను చూపిస్తుంది. చూడటం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాస్తవాన్ని చూడకుండా మనం ఎలా కళ్లు మూసు కుంటాం? అది తగిన పని కాదు. అయినా మనం సత్యాన్ని తిరస్కరిస్తూనే పోతున్నాం. ‘సంతోష్‌’ అలాంటి తిరస్కారాల జాబితాలో తాజాగా చేరింది. చిత్రహింసలకు వ్యతిరేకంగా రూపొందించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందం (యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఎగైనెస్ట్‌ టార్చర్‌)పై సంతకం చేయని అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. అలా ఆమోదించకపోవడానికి... కస్టడీ హింసను నిరోధించే సొంత చట్టం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. నిజానికి ఇవి మనం ఎప్పుడూ చర్చించని యథార్థాలు. ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినా, ఆ వెంటనే మర్చిపోతాం. ఒకవేళ ‘సంతోష్‌’ను మనం చూడడం జరిగితే... ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించే అవకాశం అది ఇస్తుంది. ఈ దారుణాలు ఎందుకు అనుమతిస్తున్నారు? ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? అని నిలదీస్తాం. బహుశా అందుకే సెన్సార్‌ బోర్డు మనం ఎప్పటికీ ఈ సినిమా చూడకుండా జాగ్రత్త పడింది. సత్యమేవ జయతే!కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Case Filed On TDP Woman Leader Sarvasiddhi Ananta Lakshmi 4
Visakha: ఎట్టకేలకు టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు

విశాఖ: ఓ వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో విశాఖ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి గత నెలలో దాడి చేస్తే.. ఇప్పటికి కేసు నమోదైంది. గత నెలలో సర్వసిద్ధి అనంతలక్ష్మి.. ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టింది. అది కూడా పోలీస్ స్టేషన్ లో ఆ వ్యక్తి ఉండగా దాడికి దిగింది టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మి. అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్రను గాజువాక పోలీస్ స్టేషన్ లో నే చెప్పుతో కొట్టింది. అంతే కాదు.. తనపై కేసు పెడితే బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి బెదిరించింది. అధికారంలో ఉన్నామనే గర్వంతో పోలీసుల్నే భయపెట్టింది. ఇది జరిగి సుమారు నెల అయ్యింది. అయితే దీనిపై ఎట్టకేలకు కేసు నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు గాజువాక సీఐ పార్థసారధి. ఇంత ఆలస్యం ఎందుకో..?అయితే టీడీపీ నేత కాబట్టి కేసు నమోదు చేయడానికి పోలీసులు అలక్ష్యం ప్రదర్శించారు. కేసును ఏదో రకంగా పక్కదారి పట్టించే యత్నం చేశారు. కాకపోతే అనంతలక్ష్మిపై కేసు ఏమైందని పలువురు పదే పదే ప్రశ్నించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదైతే చేశారు కానీ, దాన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళతారో అనేది చూడాలి. కాలయాపన చేసి కేసును మాయం చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. అదే ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతల విషయానికి వచ్చే సరికి కళ్లముందు తప్పుకనిపిస్తున్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఆ నేతలు ఏం చేస్తున్నా చూస్తూ మిన్నుకుండిపోతున్నారు. అనంతలక్ష్మిపై కేసు నమోదు చేయడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ. కేసు అయితే పెట్టాం కదా అని చెప్పుకోవడానికే ఈ తతంగం నడుపుతున్నారా.. లేక నిజంగానే ఆమెపై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

Sakshi Guest Column On Artificial Intelligence for India5
ఏఐలో మనం మేటి కావాలంటే...

కొత్త సంవత్సరం మొదలై మూడు నెలలే అయింది కానీ... కృత్రిమ మేధ రంగంలో ఈ స్వల్ప అవధిలోనే పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో విడుదలైన డీప్‌సీక్‌ ఆర్‌–1 ఒకటైతే... ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇంకోటి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌లు సంయుక్తంగా అధ్యక్షత వహించిన ఈ సదస్సులోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఏఐ తీసుకురాగల రాజకీయ, భద్రతాపరమైన సవాళ్లను ప్రపంచం ముందుంచారు. చివరగా మోదీ తాజా అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏఐ వంటి కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఏఐ రంగం నేతృత్వాన్ని ఆశిస్తున్న భారత్‌పై ఈ పరిణామాల ప్రభావం ఏమిటి?డీప్‌సీక్‌ ఆర్‌–1 సంచలనం తరువాత భారత్‌లో నడుస్తున్న చర్చ ఏమిటీ అంటే... మనదైన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఒకటి తయారు చేసుకోవాలని. ఇందుకు అవసరమైన ఏఐ చిప్స్‌ అందు బాటులో ఉండేలా చూసుకోవాలని! మరోవైపు ప్రభుత్వం కూడా సొంత ఎల్‌ఎల్‌ఎం అభివృద్ధిపై ప్రకటన చేసింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పింది. నేషనల్‌ ఏఐ మిషన్‌ స్టార్టప్‌లు, పరిశోధకుల కోసం పది వేల జీపీయూలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా... ఎల్‌ఎల్‌ఎంలతోపాటు స్మాల్‌ లాంగ్వేజ్‌ మోడళ్లు, ప్రాథమికమైన ఏఐ మోడళ్ల తయారీకి పిలుపునిచ్చింది.ఈ చర్యలన్నీ ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ... ఇవి మాత్రమే సరిపోవు. డీప్‌సీక్‌ విజయవంతమైన నేపథ్యంలో చేపట్టాల్సిన పనుల ప్రాథమ్యాల్లోనూ ఇవి లేవనే చెప్పాలి. అతి తక్కువ ఖర్చు, శిక్షణలతోనే అద్భుతమైన ఎల్‌ఎల్‌ఎంను రూపొందించవచ్చునని డీప్‌సీక్‌ ఇప్పటికే రుజువు చేసింది. చౌక ఆవిష్కరణలకు పేరుపొందిన భారత్‌కు ఇది ఎంతో సంతోషించదగ్గ సమాచారం. అయితే దీనర్థం సొంత ఎల్‌ఎల్‌ఎం అభివృద్ధే ఏఐ ఆధిపత్యానికి తొలి అడుగు అని కాదు. అమెరికా, ఇతర దేశాల ఎల్‌ఎల్‌ఎంలకు, డీప్‌సీక్‌కు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే... శిక్షణకు సంబంధించి భిన్నవైఖరి తీసుకోవడం! ఈ వైఖరి కారణంగానే దాని శిక్షణకు అయిన ఖర్చు చాలా తక్కువగా ఉంది. భారత్‌లోని టెక్నాలజీ నిపుణులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు స్థూలంగా మూడు. ఏఐలో సృజనను పెంచే అన్ని ప్రాథమిక అంశాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇందుకు ఏఐలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వారు అవసరం. అలాగే మనదైన డేటా సెట్లు, రేపటి తరం రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మంట్‌ దృష్టికోణం కావాల్సి వస్తాయి. ప్రస్తుతం భారత్‌లో అత్యున్నత స్థాయి ఏఐ నైపుణ్యం లేదు. భారతీయ మూలాలున్న ఏఐ నిపుణులు దురదృష్టవశాత్తూ సిలికాన్‌ వ్యాలీలో పనిచేస్తున్నారు. పెర్‌ప్లెక్సిటీ ఏఐ సృష్టికర్త అరవింద్‌ శ్రీనివాస్‌ భారత్‌లో చేపట్టే ఏఐ కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సిద్ధమని అంటున్నాడే కానీ... ఇక్కడకు వచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. అమెరికాలో పెర్‌ప్లెక్సిటీ ఏఐ బాగా పాపులర్‌ కాబట్టి ఈ నిర్ణయం సరైందే అనిపిస్తుంది. కానీ ఏఐ విషయంలో భారత్‌ నుంచి మేధా వలసను అరికట్టేందుకు ఏదైనా చేయాల్సిన అవసరాన్ని కూడా చెబుతోంది ఇది. దేశంలోని టెక్నాలజీ రంగాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు తగిన వ్యూహం కూడా కావాలిప్పుడు! యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా భారత్‌కు సంబంధించిన డేటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా వీటి ఆధారంగా డేటాసెట్లను ఇప్పటివరకూ ఏఐ స్టార్టప్‌లు తయారు చేయలేకపోయాయి. ఇలాంటివే అనేక డేటాసెట్లు వేర్వేరు చోట్ల పడి మూలుగుతున్నాయి. వీటన్నింటినీ ఉపయోగించడం ఎలాగో చూడాలి. అలాగే భారతీయ ఆర్‌ అండ్‌ డీ (పరిశోధన–అభివృద్ధి) రంగానికి కూడా భారీ ప్రోత్సాహకం అవసరం. మోదీ ఆ మధ్య అమె రికా పర్యటనకు వెళ్లినప్పుడు అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ , అమెరికాకు చెందిన నేషనల్‌ సైన్‌ ్స ఫౌండేషన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలాగే ఏఐలో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వంతోపాటు, ప్రైవేట్‌ రంగం కూడా పెట్టుబడులు పెట్టేలా చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా మాత్రమే సుశిక్షితమైన ఎల్‌ఎల్‌ఎం లేదా ఇంకో వినూత్న ఏఐ ఉత్పత్తి ఆవిష్కృతమవుతుంది. ఇలా చేయడం ద్వారా భారత్‌ ప్రపంచస్థాయిలో తనదైన గుర్తింపు పొందగలుగుతుంది. రెండో విషయం... ఏఐలో వినూత్న ఆవిష్కరణల కోసం ఓపెన్‌ సోర్స్‌ పద్ధతిని అవలంబించడం మేలు. డీప్‌సీక్‌–ఆర్‌1, మిస్ట్రల్‌ వంటివి అన్నీ ఓపెన్‌ సోర్స్‌ పద్ధతిలో అభివృద్ధి చేసినవే. ఇలాంటివి మేలా? ఛాట్‌ జీపీటీ వంటి క్లోజ్డ్‌ సోర్స్‌ ఎల్‌ఎల్‌ఎంలు మేలా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఫ్రాన్‌ ్సకు చెందిన మిస్ట్రల్, యూఎస్‌ కంపెనీ మెటా, చైనా కంపెనీ డీప్‌ సీక్‌లు ఓపెన్‌ సోర్స్‌ బాట పట్టాయి. భారత్‌ కూడా ఇదే పద్ధతిని ఎంచుకోవాలి. ఓపెన్‌ సోర్స్‌ ద్వారా భారతీయ స్టార్టప్‌ కంపెనీలు, పరిశోధకులు మెరుగ్గా పోటీపడగలరు. అదే క్లోజ్డ్‌ సోర్స్‌ అనుకోండి... విదేశీ ఏఐలపై ఆధారపడటం మరింత ఎక్కువ అవుతుంది. ఓపెన్‌ సోర్స్‌ బాట పట్టేందుకు యూరప్‌తో పాటు దక్షిణ దేశాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి భారత్‌ అందరికీ మేలు చేసేలా ఆ యా దేశాలతో ఏర్పాటు చేసుకోవడం మంచిది.మూడో అంశం... ఏఐలో పోటీతత్వాన్ని పెంచేందుకు భారత్‌ తక్షణం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ నుంచి రక్షణ ఎలా అన్న అంశంపై ప్రస్తుతానికి అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్యారిస్‌ సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఏఐపై అమెరికా వైఖరి ఏమిటన్నది సుస్పష్టంగా చెప్పారు. ఈ రంగంలో చైనా పైస్థాయిలో ఉంది కాబట్టి... అమెరికా కూడా ఎలాగైనా ఈ రేసులో తనది పైచేయి అనిపించుకోవాలని చూస్తోంది. ఈ పోటీలో భారత్‌ కూడా తనదైన ప్రత్యేకతను నిరూపించుకోవాలి. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఈ పోటీ తీరుతెన్నులను ఒడిసిపట్టుకోకపోతే కష్టమే.అందుకే ఏఐ నైపుణ్యాలను పెంచేందుకు, ఏఐ ఆర్‌ అండ్‌ డీకి సంబంధించి ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీల వాడకానికి తగిన వ్యూహం రూపొందించాలి. యూపీఐ వంటి భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన డేటా సాయంతో ఏఐ రంగంలో సృజనకు వీలుకల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రపంచం ఏఐ ఆటలో మనల్ని గుర్తించగలదు.అనిరుధ్‌ సూరి వ్యాసకర్త ఇండియా ఇంటర్నెట్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

Sunrisers Hyderabad suffer fourth consecutive defeat6
‘నాలుగు’తో నగుబాటు

ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగిసేవరకు ఒక్క సిక్స్‌ కూడా లేదు... ఒకదశలో వరుసగా 6 ఓవర్ల పాటు కనీసం ఫోర్‌ కూడా రాలేదు... విధ్వంసక బ్యాటింగ్‌తో మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలతో విరుచుకుపడే సన్‌రైజర్స్‌ జట్టేనా ఇది? మొదటి మ్యాచ్‌ తర్వాత గతి తప్పిన బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ అదే వైఫల్యాన్ని కనబర్చింది. ఒక్క బ్యాటర్‌ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. ఫలితంగా ఐపీఎల్‌ 18వ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమితో సన్‌రైజర్స్‌ ఆఖరి స్థానంతోనే మరింత అథమ స్థితికి చేరింది. గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తన సొంతగడ్డపై నాలుగు వికెట్లతో చెలరేగి సన్‌రైజర్స్‌ను కుప్పకూల్చాడు. పవర్‌ప్లేలో అతను ఓపెనర్లను అవుట్‌ చేసిన తర్వాత హైదరాబాద్‌ జట్టు కోలుకోలేకపోయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్‌ ఆడుతూ పాడుతూ అలవోక­గా ఛేదించింది. గిల్, సుందర్, రూథర్‌ఫోర్డ్‌ రాణించడంతో మరో 20 బంతులు మిగిలి ఉండగానే టైటాన్స్‌ జట్టు గెలుపు ఖాయమైంది. సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఉప్పల్‌ స్టేడియంలోనూ కోలుకోలేకపోయిన జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. ఆదివారం జరిగిన ఈ పోరులో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (34 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ సిరాజ్‌ (4/17) పదునైన బౌలింగ్‌తో రైజర్స్‌ను దెబ్బ తీయగా... సాయికిషోర్, ప్రసిధ్‌ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం టైటాన్స్‌ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 61 నాటౌట్‌; 9 ఫోర్లు), తొలిసారి టైటాన్స్‌ తరఫున ఆడిన వాషింగ్టన్‌ సుందర్‌ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు గెలుపు సులువైంది. వీరిద్దరు మూడో వికెట్‌కు 56 బంతుల్లో 90 పరుగులు జోడించారు. గిల్, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (16 బంతుల్లో 35 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి 21 బంతుల్లో 46 పరుగులు భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ముగించారు. ఓపెనర్లు విఫలం... టి20 క్రికెట్‌లో తొలిసారి ట్రవిస్‌ హెడ్‌ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు)కు సిరాజ్‌ బౌలింగ్‌ చేశాడు. అయితే ఈ పోరాటం ఐదు బంతులకే పరిమితమైంది. మొదటి ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన హెడ్‌ను చివరి బంతికి సిరాజ్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత తన మూడో ఓవర్లో అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 18; 4 ఫోర్లు)ను కూడా సిరాజ్‌ వెనక్కి పంపడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఓపెనర్లను కోల్పోయిన హైదరాబాద్‌ 45 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌ (14 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నితీశ్, హెన్రిచ్‌ క్లాసెన్‌ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే నితీశ్‌ మరీ నెమ్మదిగా ఆడాడు. భారీ షాట్లు ఆడటంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఐదో ఓవర్‌ నుంచి 10వ ఓవర్‌ వరకు హైదరాబాద్‌ బ్యాటర్లు ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేకపోయారు. 13వ ఓవర్‌ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్‌ నమోదు కాలేదు. రషీద్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ ఈ సిక్స్‌ బాదాడు. నాలుగో వికెట్‌కు నితీశ్, క్లాసెన్‌ 39 బంతుల్లో 50 పరుగులు జోడించారు. క్లాసెన్‌ అవుటైన తర్వాత తక్కువ వ్యవధిలో నితీశ్, కమిందు (1), అనికేత్‌ వర్మ (18) కూడా వెనుదిరిగారు. చివర్లో ప్యాట్‌ కమిన్స్‌ (9 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కాస్త ధాటిగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. 15–19 ఓవర్ల మధ్య 34 పరుగులే రాబట్టిన రైజర్స్‌ ఇషాంత్‌ వేసిన ఆఖరి ఓవర్లో గరిష్టంగా 17 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో టైటాన్స్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ తన తొలి ఓవర్లో సాయి సుదర్శన్‌ (5)ను వెనక్కి పంపగా, బట్లర్‌ (0)ను కమిన్స్‌ అవుట్‌ చేశాడు. అయితే సన్‌రైజర్స్‌ ఆనందం ఇక్కడికే పరిమితమైంది. గిల్, సుందర్‌ కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో వారికి హైదరాబాద్‌ బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. సిమర్జిత్‌ ఓవర్లో సుందర్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టైటాన్స్‌ స్కోరు 48 పరుగులకు చేరింది. మరోవైపు గిల్‌ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 36 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు షమీ బౌలింగ్‌లో అనికేత్‌ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగిన సుందర్‌ అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. 41 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన రూథర్‌ఫోర్డ్‌ చెలరేగిపోయాడు. అభిషేక్‌ ఓవర్లో అతను 4 ఫోర్లు బాదడం విశేషం. ఆ తర్వాత మ్యాచ్‌ ముగించేందుకు టైటాన్స్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 19 ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో 100 వికెట్లు పడగొట్టిన 19వ భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా 26వ బౌలర్‌గా సిరాజ్‌ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 97 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ మొత్తం 102 వికెట్లు పడగొట్టాడు. 4/17 ఐపీఎల్‌ చరిత్రలో సిరాజ్‌ తన అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేశాడు. 2023లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. స్కోరు వివరాలుసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) తెవాటియా (బి) సిరాజ్‌ 18; హెడ్‌ (సి) సుదర్శన్‌ (బి) సిరాజ్‌ 8; ఇషాన్‌ కిషన్‌ (సి) ఇషాంత్‌ (బి) ప్రసిధ్‌ 17; నితీశ్‌ రెడ్డి (సి) రషీద్‌ (బి) సాయికిషోర్‌ 31; క్లాసెన్‌ (బి) సాయికిషోర్‌ 27; అనికేత్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 18; కమిందు (సి) సుదర్శన్‌ (బి) ప్రసిధ్‌ 1; కమిన్స్‌ (నాటౌట్‌) 22; సిమర్జిత్‌ (బి) సిరాజ్‌ 0; షమీ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–50, 4–100, 5–105, 6–120, 7–135, 8–135. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–17–4, ఇషాంత్‌ శర్మ 4–0–53–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–25–2, రషీద్‌ ఖాన్‌ 4–0–31–0, సాయికిషోర్‌ 4–0–24–2. గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయిసుదర్శన్‌ (సి) అనికేత్‌ (బి) షమీ 5; గిల్‌ (నాటౌట్‌) 61; బట్లర్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 0; సుందర్‌ (సి) అనికేత్‌ (బి) షమీ 49; రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–15, 2–16, 3–106. బౌలింగ్‌: షమీ 4–0–28–2, కమిన్స్‌ 3.4–0–26–1, సిమ్రన్‌జీత్‌ 1–0–20–0, ఉనాద్కట్‌ 2–0–16–0, అన్సారీ 4–0–33–0, కమిందు మెండిస్‌ 1–0–12–0, అభిషేక్‌ శర్మ 1–0–18–0. ఐపీఎల్‌లో నేడుముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Some People Have Habit Of Crying: Pm Modi Veiled Jab At Cm Stalin7
కొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.. స్టాలిన్‌కు మోదీ కౌంటర్‌

రామేశ్వరం: కొంతమందికి కారణం లేకుండానే ఎప్పుడూ ఏడ్చే అలవాటు ఉంటుందంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభ వేదికగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తోందని, గతంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని తెలిపారు.త్రిభాషా విధానంపై స్టాలిన్‌ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్‌ ఇస్తూ.. తమిళ నాయకులు నాకు లేఖలు రాస్తుంటారు. ఒక్కరు కూడా మాృతభాష తమిళంలో సంతకం చేయరు. తమిళ భాషను గౌరవించండి.. తమిళంలో సంతకం చేయండి. చాలా రాష్ట్రాల్లో మాృతభాషలో వైద్య విద్యా బోధన జరుగుతోంది. తమిళనాడులోనూ తమిళంలో వైద్య విద్యను అందించాలి. గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించాం. రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచాం’’ అని మోదీ చెప్పారు.‘‘తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. 2014 నుంచి అధికంగా తమిళనాడుకు ఇచ్చాం. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లకు పైగా ఉందన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌లో తమిళనాడు పాత్ర చాలా గొప్పదన్న మోదీ.. ఈ రాష్ట్రం ఎంత బలంగా ఉంటే మన దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు.

Boy Dies In Stray Dog Attack In Guntur Swarna Bharathi Nagar8
గుంటూరులో దారుణం.. కుక్క దాడిలో బాలుడు మృతి

సాక్షి, గుంటూరు: నగరంలోని స్వర్ణ భారతి నగర్‌లో దారుణం జరిగింది. వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల ఐజాక్‌ అనే బాలుడు మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. బాలుడు మృతితో తండ్రి నాగరాజు, తల్లి రాణి రోదిస్తున్నారు. బాలుడి తల్లి.. ఏడ్చి ఏడ్చి ఆసుపత్రిలో సొమ్ముసిల్లి పడిపోయారు.వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. శునకాల దాడితో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై ఇటీవల కుక్కల దాడులు పెరిగిపోయాయి. ఎటు చూసినా కుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. ఏ సమయంలో చూసిన రోడ్లపైన కుక్కలు గుంపులుగా సంచరిస్తూనే ఉన్నాయి. కుక్కల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Man poses as UK cardiologist, performs 15 surgeries9
యూకే డాక్టర్‌నని చెప్పి.. ఏడుగురి ప్రాణాలు తీశాడు..!

భోపాల్: యూకే రిటర్న్స్ డాక్టర్ పేరుతో ఓ వ్యక్తి ఆడిన నాటకం.. ఏడుగురి ప్రాణాలు తీసింది. కార్డియాలజీ స్పెషలిస్టునని ‘ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి మధ్యప్రదేశ్ లోని దామోహ్‌ జిల్లాలో ఒక ఆస్పత్రిలో జాయినయ్యాడు. ఇక అంతే స్పెషలిస్టు కదా అని .. మేజర్ ఆపరేషన్లను అతనికే అప్పగించింది ఆ ఆస్పత్రి యాజమాన్యం. అంతే అతను ఆపరేషన్లు చేసిన వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో అసలు విషయం బయటపడింది. అతను యూకే డాక్టర్ కాదని, కార్డియాలజిస్ట్ అంతకన్నా కాదనే విషయం వెలుగుచూసింది. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘంగా తీవ్రంగా స్పందించింది.డాక్టర్ ఎన్ జాన్ కెన్ పేరుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు ఓ డాక్టర్. యూకేకు చెందిన కార్డియలాజిస్ట్ నని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ చూపించడంతో అతన్ని డాక్టర్ గా అపాయింట్ చేసుకున్నారు. ఇక అంతే వరుస పెట్టి ఆపరేషన్లు చేసేస్తున్నాడు. హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్ అయితే ఇక ఆపరేషన్ అంటున్నాడు. ఆ ఆస్పత్రికి ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భవా స్కీమ్ కు కూడా ఉండటంతో పేషెంట్లు కూడా ఆపరేషన్ కు సరే అంటున్నారు. ఇలా 15 ఆపరేషన్లు చేయగా, 7 గురు చనిపోయారు. దాంతో దీనిపై ఆరా తీయగా అతను ఫేక్ డాకర్ట్ అనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని దామోహ్ చైల్డ్ వెల్ఫే్ కమిటీ అధ్యక్షుడు దీపక్ తివారీ వెలుగులోకి తేవడంతో ఆ డాక్టర్ అసలు కథ బయటపడింది. ఒక నెలలోనే అతను చూసిన ఏడుగురు మృతి చెందడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది.ఫేక్ డాక్టర్ పై విచారణకు ఆదేశించాంఒక డాక్టర్ గా ఆస్పత్రిలో జాయిన్ అయి ఏడుగురు ప్రాణాలు పోవడానికి కారణమైన సదరు ఫేక్ డాక్టర్ పై విచారణ జరుగుతోందని జాతీయ మానవ హక్కుల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు తమకు ఫిర్యాదు అందిందని, ఏడుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన డాక్టర్‌ వ్యవహారం మా దృష్టికి వచ్చింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవా స్కీమ్ కింద ఆపరేషన్ చేసి ఆ నిధుల్ని కూడా దుర్వినియోగం చేశాడు’ అని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూన్ గో పేర్కొన్నారు.

Canada Parliament Put Under Lockdown After Unknown Man Sneaks In10
కెనడా పార్లమెంట్‌కు తాళాలు.. ఎన్నికల వేళ అసలేం జరుగుతోంది?

కెనడా పార్లమెంటు భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు ఒట్టావా పోలీసులు వెల్లడించారు. అక్రమంగా పార్లమెంట్ హిల్‌లోని ఈస్ట్‌ బ్లాక్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రాత్రంతా లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.శనివారం రాత్రి ఓ వ్యక్తి పార్లమెంట్‌ భవనంలోకి అక్రమంగా చొరబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. బ్యాంక్ స్ట్రీట్ నుండి సస్సెక్స్ డ్రైవ్ వరకు వెల్లింగ్టన్ స్ట్రీట్‌లోని అన్ని రోడ్లను మూసివేశారు. పెద్ద సంఖ్యల్లో పోలీసులు మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది మొత్తం ఒకే గదిలోకి చేరుకొని తాళాలు వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సహకరించిన ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.కాగా, కెనడాలో అక్టోబర్ 27న జరగాల్సిన ఎన్నికలను ఆరు నెలలకు ముందుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ పార్లమెంటును రద్దు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ భవనంలోకి దుండగుడు ప్రవేశించడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అపహరించడానికి దుండగుడు ప్రయత్నించి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement