
సాక్షి, కృష్ణా : టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని, వైఎస్ షర్మిల, లక్ష్మీ పార్వతిలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సినీనటులు జీవితా రాజశేఖర్ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తరుపున అంబాపురం, నైనవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలను గౌరవించలేని ప్రభుత్వం ఇంకేం మంచి చేస్తుందని దుయ్యబట్టారు. పసుపు-కుంకుమ పేరుతో మహిళలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యాడని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అబద్దం, మోసం, దోపిడికి అడ్డాగా మారిందన్నారు. చంద్రబాబుకు మూడుసార్లు అవకాశమిస్తే.. ఏం చేశాడని నిలదీశారు. అమరావతిలో 33వేల ఎకరాలను సింగపూర్ కంపెనీలకు దారాదత్తం చేశాడని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. వైఎస్ జగన్ వస్తే.. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.