
134 వైన్స్‌లు.. 9బార్ అండ్ రెస్టారెంట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో సిండికేట్ల పుణ్యమాని.. ఊరికి ఒకటీ.. రెండు బెల్ట్‌షాపులు.. మరికొన్ని చోట్ల మూడు.. సిండికేట్ పరిధిలోని షాపులనుంచి రూ.20వేలు.., సిండికేట్ లేని దుకాణాలనుంచి నెలకు రూ.13వేలు, ఇక, బార్లనుంచి రూ.30 వేలు... ఇలా నెలనెలా ముక్కుపిండి వసూలు చేస్తున్న ముడుపుల మొత్తం ఏటా రూ.3కోట్ల పైమాటే. వెరసి జిల్లా ఎక్సైజ్‌శాఖ మామూళ్ల మత్తులో ఊగుతోంది..!
సాక్షి, నల్లగొండ : ‘జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో ఒక మహిళ బెల్ట్‌షాప్ నిర్వహిస్తోంది.. అయితే ఆమె తమ మండలంలోని వైన్స్‌నుంచి కాకుండా.. నల్లగొండలోని ఓ వైన్స్ నుంచి మద్యం తీసుకెళ్లి విక్రయిస్తోంది. సిండికేట్‌లోని వైన్స్ నుంచి కాకుండా, బయటి ప్రాంతంనుంచి మద్యం ఎలా తెచ్చి అమ్ముతావని ఆబ్కారీశాఖలోని ఓ సీఐ స్థాయి అధికారికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఇంకేముంది తన సిబ్బందిని పురమాయించి ఆ మహిళను తీసుకురావాలని హుకుం జారీ చేశారు. గతంలో తాను బెల్ట్‌షాప్ నిర్వహించానని, ఇప్పుడు మానుకున్నానని ఆ మహిళ ఎంత మొత్తుకున్నా వినని ఎక్సైజ్ సిబ్బంది ఆమెను నానా దుర్భాషలాడారు. దీంతో ఆమె తనకు తెలిసిన వారి ద్వారా పరిస్థితిని ఓ ఎమ్మెల్యేకు వివరించింది. ఆయన మందలింపుతో ఎక్సైజ్ శాఖ అధికారి వెనక్కి తగ్గారు.’
ఈ ఉదంతం తేటతెల్లం చేసిందేమిటి?
‘బెల్ట్‌షాప్‌లు నడుపుకోండి. అభ్యంతరం లేదు.. కానీ, తమ మండలంలోని వైన్స్‌నుంచి మాత్రమే మద్యం కొనుక్కుని పోవాలి’ అన్నది ఆబ్కారీ అధికారుల పంతం. కారణం.. సిండికేట్‌గా ఏర్పడిన వైన్స్ నుంచి తమకు నెలా నెలా ఇబ్బడి ముబ్బడిగా అందుతున్న మామూళ్లే. ఈ వైన్స్‌లలో ఎక్కువ విక్రయాలు జరిగే బాధ్యతను ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు భుజానికి ఎత్తుకున్నారన్నది తేటతెల్లమవుతోంది.
సిండికేట్ షాపుల్లో ఎందుకు కొనరంటే..?
బెల్ట్‌షాపుల నిర్వాహకులు .. తమ ప్రాంతంలోని వైన్స్‌నుంచి మద్యం ఎందుకు కొనడం లేదంటే.. సదరు సిండికేట్ షాపులనుంచి ఎంఆర్‌పీకి మద్యం దొరకదు. రూ.5 నుంచి రూ.10 అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకెళ్లిన మద్యాన్ని బెల్ట్‌షాపుల్లో మరో రూ.5 నుంచి రూ.10 అదనంగా తీసుకుని విక్రయించుకోవాల్సి వస్తుంది. ఈ కారణంగానే బెల్ట్‌షాపుల నిర్వాహకులు సిండికేట్‌లో భాగం లేని వైన్స్‌లనుంచి మద్యం తీసుకుని గ్రామాల్లో విక్రయిస్తున్నారు. దీంతో మండలాల్లోని వైన్స్‌లో విక్రయాలు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి వాటిని గట్టెక్కించేందుకు అధిక మామూళ్లు ఇస్తున్న సిండికేట్ వైన్‌షాపుల బిజినెస్ దెబ్బతినకుండా ఉండేందుకు ఎక్సైజ్‌శాఖలోని కొందరు అధికారులు బెల్ట్‌షాపుల వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇదీ.... పరిస్థితి..
జిల్లాలో 134 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికితోడు నల్లగొండ, దేవరకొండలో కలిపి 9 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పట్టణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు సిండికేట్‌కు దూరంగా ఉన్నాయి. ఇక, మండలాల్లోని దుకాణాలు మాత్రం సిండికేట్‌గా ఏర్పడ్డాయి. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, చండూరు, నాంపల్లి, హాలియా, దేవరకొండల్లో ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని పట్టణ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని చోట్లా సిండికేట్లను ఎక్సైజ్ శాఖే ప్రోత్సహిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కొద్ది నెలల కిందట.. ఈ శాఖ ఎన్ని బెల్ట్‌షాపులు ఉన్నాయో లెక్క తేల్చేందుకు ఓ సర్వే నిర్వహించింది. కనీసం 1800 బెల్ట్‌షాపులు ఉన్నట్లు లెక్క తేలిందని సమాచారం. అంటే జిల్లాలోని 844 గ్రామాల్లో సరాసరిన ఊరికి ఒకటీ .. రెండు బెల్ట్‌షాపులు.. మరికొన్ని చోట్ల మూడు దాకా ఉన్నట్లు అంచనా.
మామూళ్లు ఇవ్వకుంటే కొర్రీలు
అన్ని నిబంధనలను పాటించి సక్రమంగా నడుపుకునే వైన్స్‌నుంచి కూడా నెలనెలా మామూళ్లు ఇచ్చుకోవాల్సి వస్తోందన్న ఆరోపణ ఉంది. ఇవ్వకుంటే సవాలక్ష కొర్రీలతో సతాయించడం ఎక్సైజ్ శాఖకు వెన్నతో పెట్టిన విద్య అన్న అభిప్రాయం ఉంది. దీంతో సిండికేట్‌లో లేని దుకాణాలనుంచి నెలకు రూ.13వేలు, సిండికేట్ పరిధిలోని షాపుల నుంచి రూ.20వేలు... ఇక, బార్లనుంచి రూ.30 వేలు చొప్పున... నెలనెలా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతినెలా వైన్స్, బార్ల నుంచి రూ.28.80లక్షలు వసూలు అవుతున్నాయని సమాచారం. ఇలా లెక్కగడితే ఏడాదికి వీరి మామూళ్లు మొత్తం 3.45కోట్ల పైమాటేనని చెబుతున్నారు.