Yields
-
పండినా ‘ఫలం’ లేదాయె!
పంటలు బాగా పండితే ధరలుండవు. మంచి ధరలున్నప్పుడు దిగుబడి సరిగా రాదు. రాష్ట్రంలోని ఉద్యాన రైతుల దీనస్థితి ఇది. ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రా’గా పిలుచుకునే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటల దిగుబడి ఆశించిన మేరకు వచ్చినా ధరలు లేక రైతులు దారుణంగా నష్టపోయారు. వాణిజ్య పంటలైన ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ వంటివి పంటలకు సైతం ఆశించిన ధర లభించక ఆర్థికంగా దెబ్బతిన్నారు. – సాక్షి ప్రతినిధి, అనంతపురంచీనీ రైతులకు నష్టాలేఆంధ్రప్రదేశ్లో మేలిమి రకం చీనీ అనంతపురం జిల్లాలోనే పండుతుంది. ప్రస్తుతం టన్ను చీనీ ధర రూ.20 వేలు కూడా పలకడం లేదు. తొలినాళ్లలో గరిష్టంగా రూ.40 వేలు పలికింది. టన్నుకు రూ.60 వేల లభిస్తేనే రైతుకు బాగా గిట్టుబాటు అవుతుంది. గత ఏడాది డ్రాగన్ ఫ్రూట్స్ టన్ను ధర రూ.1.80 లక్షలు పలికింది. ఈ ఏడాది రూ.1.20 లక్షలకు పడిపోయింది. దానిమ్మకు మంచి ధరలు ఉన్నా.. అకాల వర్షాలు, వైరస్, తెగుళ్లతో దిగుబడి సరిగా రాలేదు.టమాట రైతు చిత్తుఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా టమాట, పచ్చిమిర్చి రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ పంటలు టన్నుల కొద్దీ దిగుబడి వచ్చినా ధరలు లేక నష్టపోయారు. టమాటాలకు ఐదు నెలలుగా కేజీ రూ.10కి మించి ధర లేదు. ఒక్కోసారి కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. కొన్నిసార్లు ధరలు లేక మండీలోనే టమాట బాక్సులను వదిలేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక కందిరైతు అవస్థలు చెప్పడానికి లేదు. ధర గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. క్వింటాల్‌కు రూ.7,500 కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కినా.. సర్కారు కనికరించడం లేదు. గిట్టుబాటు కావడం లేదునేను రెండు ఎకరాల్లో మిరప సాగు చేశాను. సుమారు రూ.రెండు లక్షల పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.15 వేలు ఉంది. ధరలు ఉన్నట్టుండి పడిపోయాయి. దీంతో పూర్తిగా నష్టం వచ్చింది. ఒకప్పుడు క్వింటాల్ ధర రూ.35 వేలు ఉండేది. ఇలా ఉంటేనే మిరప రైతుకు లాభం. లేదంటే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. – రవి, మిరప రైతు, ఒంటిమిద్ది, కళ్యాణదుర్గం మండలంధర పడిపోయిందిగత ఏడాదికీ ఇప్పటికీ చూస్తే డ్రాగన్ ఫ్రూట్స్ ధర పడిపోయింది. గతంలో టన్ను రూ.1.80 లక్షల వరకూ పలికింది. ఇప్పుడు ధర పూర్తిగా పడిపోయింది. ఉత్పత్తి ఎక్కువై ఇలా అయిందా.. మార్కెట్లోనే రేటు లేదా అనేది అర్థం కావడం లేదు. – రమణారెడ్డి, మర్తాడు, గార్లదిన్నె మండలం -
పత్తికి గరిష్ట ధర రూ.7,200
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు వంటి పంట ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలు లభిస్తాయి. ఈ విషయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషణ చేసి ఈ ధరలను రూపొందించింది. 22 ఏళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో నెలవారీగా ఉన్న 21 రకాల పంట దిగుబడుల ధరలను నమూనాగా తీసుకొని వాటి ఆధారంగా ధరల అంచనాలను సిద్ధం చేసింది. వాటి ఆధారంగా ఏఏ పంటలు వేస్తే ఏ మేరకు దిగుబడులు వస్తాయో, వాటి ఆదాయంపై రైతులకు అవగాహన పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ మేరకు కసరత్తు చేసినట్టు చెబుతున్నారు. » ఈ సీజన్లో పత్తి దిగుబడి వచ్చే నవంబర్–ఫిబ్రవరి మధ్య గరిష్టంగా క్వింటాకు రూ.7,200 వరకు ధర వస్తుందని వ్యవసాయ వర్సిటీ ప్రకటించింది. కనిష్టంగా రూ. 6,600 ఉంటుంది. » వరి సాధారణ రకానికి నవంబర్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 2,203 నుంచి రూ. 2,350 ధర పలుకుతుంది. ఇక వరి గ్రేడ్ ఏ రకానికి అదే కాలంలో రూ. 2,290 నుంచి రూ. 2,680 వరకు ధర పలుకుతుందని పేర్కొంది. » మొక్కజొన్నకు అక్టోబర్–నవంబర్ మధ్యకాలంలో రూ. 2,150 నుంచి రూ. 2,350 వరకు ధర వస్తుంది. » పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధర లు, ఎగుమతులు, దిగుమతులు పరిమితు ల మూలంగా ధరల్లో మార్పులు ఉండొచ్చు. ధరను బట్టి పంటలు వేసుకోవచ్చని వర్సిటీ సూచించింది. -
కోకో.. ధర కేక
సాక్షి అమలాపురం: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా దిగుబడి తగ్గినప్పటికీ.. కోనసీమ కోకో రైతులు కలలో కూడా ఊహించని విధంగా ధర పలుకుతుండడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కేజీ ఎండబెట్టిన కోకో గింజల ధర రూ.200 నుంచి ఏకంగా రూ.800 వరకు ఎగబాకింది. గతేడాది నుంచి చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా పశ్చిమ ఆసియా దేశాల్లో దిగుబడి గణనీయంగా పడిపోవడంతో.. కోకో గింజల డిమాండ్‌ను బట్టి ధర పెరగడానికి కారణమైందని రైతులు చెబుతున్నారు. దశాబ్దాలుగా సాగు.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో దశాబ్దాల కాలంగా కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నారు. కాకినాడ , తూర్పుగోదావరి, ఏలూరు, పశి్చమగోదావరి జిల్లాల్లో సుమారు 5,800 ఎకరాల్లో కోకో సాగవుతున్నట్లు అంచనా. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకో అంతరసాగు వల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తున్నది. దిగుబడి తగ్గినా.. తూర్పుగోదావరి జిల్లాలో ఎకరాకు దిగుబడి 1.50 క్వింటాళ్ల నుంచి రెండు క్వింటాళ్ల వరకు వస్తుండగా, ఏలూరు జిల్లా పరిధిలో నాలుగు క్వింటాల్ నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మనదేశంతోపాటు కోకో అధికంగా ఐవరీ కోస్ట్, ఘనా, ఇండోనేషియా, నైజీరియా వంటి దేశాలలో పండిస్తారు. ఆ దేశాల్లో 70 శాతం దిగుబడి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులకు తోడు ఆగస్టు వరకు వేసవిని తలపించే ఎండల వల్ల కోకో పూత రాలిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు దిగుబడిపై కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సగటు దిగుబడి ఒక క్వింటాల్‌కు తగ్గింది. కాగా, గతేడాది కోకో ఎండబెట్టిన గింజల ధర క్వింటాల్‌కు రూ.180 నుంచి రూ.240 మధ్యలో ఉండేది. ఈ ఏడాది జనవరి నుంచి స్వల్పంగా ధర పెరుగుతూ ప్రస్తుతం రూ.800కు చేరింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే ధర మరింత పెరిగే అవకాశముందని రైతులు అంచనా వేస్తున్నారు. -
దిగుబడులు దుమ్మురేపాయి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2022–23 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి దిగుబడులు దుమ్మురేపాయి. గతేడాది కంటే మిన్నగా నమోదయ్యాయి. ఆహార ధాన్యాల దిగుబడులే కాదు.. అపరాలు, నూనె గింజలు, వాణిజ్య పంటల దిగుబడులు కూడా ఈసారి రికార్డు స్థాయిలోనే వచ్చాయి. 2022–23 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తుది దిగుబడి అంచనాల నివేదికను అర్థగణాంక విభాగం (డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23 వ్యవసాయ సీజన్లో 259.28 లక్షల టన్నుల దిగుబడులు రాగా.. ఇవి 2021–22తో పోలిస్తే 22.10 లక్షల టన్నులు అధికంగా నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో పత్తి, మిరప దిగుబడులు.. ఇక వాణిజ్య పంటల విషయానికొస్తే.. పత్తి 2021–22లో 13.85 లక్షల ఎకరాల్లో సాగయితే 12.74 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. అలాగే, 2022–23లో 17.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, 15.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. మరోవైపు.. మిరప 2021–22లో 5.62 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర ప్రభావంతో 4.18 లక్షల టన్నులకు పరిమితమైంది. అదే 2022–23లో 6.47 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 14.63 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. రైతు ఇంట ‘ధాన్యం’ సిరులు.. ♦ 2021–22 సీజన్లో కోటి 51 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 237.16 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ఆ తర్వాత 2022–23 సీజన్లో వివిధ కారణాల వల్ల కోటి 39 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనప్పటికీ దిగుబడులు మాత్రం రికార్డు స్థాయిలో 259.28 లక్షల టన్నులు నమోదయ్యాయని ఆ విభాగం వెల్లడించింది. ♦ వీటిలో ప్రధానంగా 2021–22లో 60.30 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, హెక్టార్‌కు సగటున 5,048 కిలోల చొప్పున 121.76 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొచ్చాయి. ♦ అదే.. 2022–23లో 53.22 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా, హెక్టార్‌కు సగటున 5,932 కిలోల చొప్పున 126.30 లక్షల ధాన్యం దిగుబడులు నమోదయ్యాయి. ♦ మొత్తం మీద చూస్తే 2021– 22లో కోటి 03 లక్షల ఎకరాల్లో ఆహార పంటలు సాగవగా.. దిగుబడులు కోటి 55 లక్షల టన్నులు వచ్చాయి. 2022–23లో 92లక్షల ఎకరాలకుగాను కోటి 68 లక్షల టన్నుల దిగు బడులొచ్చాయి. అపరాలు, నూనె గింజలు కూడా.. ♦ అపరాల పంటలు 2021–22లో 30.67 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.55 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ 2022–23లో 25.80 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.87 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ♦ ఇక నూనెగింజల పంటలు 2021–22లో 25.05 లక్షల ఎకరాల్లో సాగవగా, 27.68 లక్షల టన్నులు.. 2022–23లో 20.30 లక్షల ఎకరాల్లో సాగవగా, 28.96 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ♦ వీటిలో ప్రధానంగా కందులు 2021–22లో 6.27 లక్షల ఎకరాల్లో సాగయితే.. 68 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. అలాగే, 2022–23లో 6 లక్షల ఎకరాల్లో సాగవగా, 78 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ వేరుశనగ అయితే 2021–22లో 20.62 లక్షల ఎకరాల్లో సాగవగా, 5.15 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. 2022–23లో 14.85 లక్షల ఎకరాల్లోనే సాగవగా, 6 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. సగటు దిగుబడులు పెరిగాయి.. ఆర్థిక, గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021–22 సీజన్‌తో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ 2022–23లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదయ్యాయి. తెగుళ్ల ప్రభావం తక్కువగా ఉండడంతో దాదాపు ప్రతీ పంటలోనూ హెక్టార్‌కు సగటు దిగుబడులు 2021–22తో పోలిస్తే పెరిగాయి.– చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఖరీఫ్ దిగుబడులు...144 లక్షల టన్నులు
సాక్షి, అమరావతి: ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులపై ఆశాజనకంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదిక ప్రకారం ఈసారి 144 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఖరీఫ్ సీజన్లో సాధారణ విస్తీర్ణం 84.98 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 89.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దిగుబడులు 164 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 74 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగయ్యాయి. దిగుబడులు 144 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. అయితే, రెండో ముందస్తు అంచనా నివేదికలో దిగుబడులు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. జూలైలో అధిక, సెప్టెంబర్లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవగా, జూన్, ఆగస్టు నెలల్లో కనీస వర్షపాతం నమోదుకాక రైతులు ఇబ్బందిపడ్డారు. సగటున 593 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 493.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ ప్రభావం ఖరీఫ్ పంటల సాగుపై పడింది. ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే, దిగుబడులు మాత్రం ఆశాజనకంగా ఉంటాయని రైతులు అంచనా వేస్తున్నారు. పంటల అంచనాలు ఇలా.. మొదటి ముందస్తు అంచనా దిగుబడుల నివేదిక ప్రకారం ఈ ఏడాది ఆహార పంటలు 47లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 73.89లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రధానంగా వరి గత ఏడాది 40 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 74.81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది 36.55 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 67.43 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. చెరకు 24.43లక్షల టన్నులు, పామాయిల్ 22.87లక్షల టన్నులు, మొక్కజొన్న 4.88లక్షల టన్నులు, వేరుశనగ 2.32లక్షల టన్నులు, అపరాలు 2.17లక్షల టన్నులు చొప్పున దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రతికూల వాతావరణంలో సైతం మిరప రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాలకు పైగా సాగవగా, 12 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. కాగా, పత్తి 12.85లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. -
AP: ఉత్పత్తి అదిరింది.. ఆర్బీఐ నివేదిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ పంట పండింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో అన్ని ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడిలో వృద్ధి నమోదైంది. 2021–22 కన్నా 2022–23లో ధాన్యం, ముతక, చిరు ధాన్యాలు, పప్పులు, నూనెగింజల ఉత్పత్తితో పాటు దిగుబడిలోనూ పెరుగుదల నమోదైనట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలో గత ఖరీఫ్‌లో (2021–22) వ్యవసాయ ఉత్పత్తుల నాల్గవ ముందస్తు అంచనాలు, 2022–23 ఖరీఫ్ మొదటి ముందస్తు అంచనాలతో ఆర్బీఐ ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడి, విస్తీర్ణంలో ఏ రాష్ట్రంలో ఎంతమేర వృద్ధి నమోదైందో ఈ నివేదికలో ఆర్బీఐ విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజస్థాన్, ఒడిశా, పంజాబ్, గుజరాత్, హరియాణా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే ధాన్యం ఉత్పత్తి గత ఖరీఫ్ కన్నా ఈ ఖరీఫ్‌లో పెరిగింది. మిగతా రాష్ట్రాల్లో క్షీణత నమోదైంది. జాతీయ స్థాయిలో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తిలో 6.1 శాతం క్షీణత నమోదైంది. ఈ ఖరీఫ్‌లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంతా ధాన్యం ఉత్పత్తి 46 శాతం వృద్ధి నమోదైంది. ఆ తరువాత రాజస్థాన్‌లో 32.3 శాతం.. ఆంధ్రప్రదేశ్‌లో 16.2, ఒడిశాలో 5.9, గుజరాత్లో 5.1, పంజాబ్‌లో 3.8, హరియాణాలో 2.9, ఉత్తరాఖండ్‌లో 1.7 శాతం వృద్ధి నమోదైంది. ఖరీఫ్ విస్తీర్ణంలో వృద్ధి ఇలా.. ► అలాగే, దేశం మొత్తం ఖరీఫ్ విస్తీర్ణంలో 47 శాతం విస్తీర్ణం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉంది. ► ఇక మన రాష్ట్రం విషయానికొస్తే.. వరి సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ఐదు శాతం మేర పెరిగింది. ► ధాన్యం దిగుబడి 10.6 శాతం మేర వృద్ధి నమోదైంది. ► రాష్ట్రంలో ముతక, చిరు ధాన్యాల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడిలో భారీ వృద్ధి నమోదైంది. ► పప్పు ధాన్యాల విస్తీర్ణం, నూనె గింజల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడుల్లో భారీగా పెరుగుదల ఉంది. ► పత్తి విస్తీర్ణం, ఉత్పత్తి కూడా పెరిగినప్పటికీ దిగుబడి మాత్రం ఈ ఖరీఫ్‌లో తగ్గింది. నిజానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో కాలువల కింద సాగుకు నీటిని ముందస్తుగా విడుదల చేసింది. అలాగే, రైతులకు అవసరమైన విత్తనాలతో పాటు, ఎరువులను రైతుభరోసా కేంద్రాల ద్వారానే సకాలంలో అందించింది. సాగు విషయంలో రైతుల అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. -
రైతులకు జీపీఏ సర్టిఫికేషన్
సాక్షి, అమరావతి: రసాయన అవశేషాలు లేని పంటల ధ్రువీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించే రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (జీఏపీ) సర్టిఫికేషన్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులను తీర్చిదిద్దేందుకు 2019లో శ్రీకారం చుట్టిన వైఎస్సార్ పొలం బడులను ప్రామాణికంగా తీసుకుని జీఏపీ సర్టిఫికేషన్ జారీ చేయనుంది. సేంద్రియ ధ్రువీకరణ కోసం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీ ఎస్‌వోపీసీఏ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, జీఏపీ సర్టిఫికేషన్ కోసం క్వాలిటీ కంట్రోల్ కమిషన్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) నుంచి, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) నుంచి గుర్తింపు రానుంది. ఎఫ్ఏవో ద్వారా శిక్షణ వైఎస్సార్ పొలం బడుల్లో మూడేళ్లుగా శిక్షణ పొందుతున్న రైతులకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)తో కలిసి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. అక్టోబర్‌లో రాష్ట్ర , జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, ఈ నెల 10వ తేదీ నుంచి నెలాఖరు వరకు క్లస్టర్ పరిధిలో గుర్తించిన రైతులు, ఆర్బీకేల్లో పనిచేస్తున్న వీఏఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. చివరగా డిసెంబర్లో డివిజన్ స్థాయిలో నాన్క్లస్టర్ పరిధిలోని వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఎలకు పొలం బడుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రబీలో అత్యుత్తమ యాజమాన్య పద్ధతులను పాటించిన రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్లో జీఏపీ సర్టిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సర్టిఫికెట్తో రైతులు వారి ఉత్పత్తులను అమెరికా, యూరోపియన్ దేశాల్లోని అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ధరకు అమ్ముకునే అవకాశం కలుగుతుంది. రబీలో 7,991 పొలం బడులు కాగా, 2022–23 సీజన్లో 17 వేల పొలం బడుల ద్వారా 5.10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గడచిన ఖరీఫ్ సీజన్లో 8,509 పొలం బడుల ద్వారా 2.55 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా, ప్రస్తుత రబీ సీజన్లో 7,991 పొలం బడుల ద్వారా 2.4 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా వరిలో 2,828, అపరాల్లో 2,720, వేరుశనగలో 1,220, మొక్కజొన్నలో 834, నువ్వులులో 223, చిరుధాన్యాల్లో 142, పొద్దుతిరుగుడులో 24 పొలం బడులు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. -
నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి
నగరి/విజయపురం(చిత్తూరు జిల్లా): సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడినిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయం అందిస్తోంది. తెగుళ్ల బెడద నుంచి కాపాడుతోంది. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తోంది. మరోవైపు ఈ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇది ఆయుర్వేద ఔషధంగానూ ఉపయోగపడుతోంది. అధిక దిగుబడితోపాటు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చదవండి: జామ్ జా‘మనీ’.. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం.. ఈ పంటకు భలే గిరాకీ! పండించే పంట దిగుబడి లేదని, దిగుబడి బాగా వచ్చినా మార్కెట్లో మంచి ధర పలకలేదని, నేల సారవంతంగా లేదని.. ఇలా రకరకాల కారణాలు రైతులను కుంగదీస్తున్నాయి. అయితే వ్యవసాయంలో ఆశించిన లాభాలు చూడలేమని నీరసించిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయాన్ని అందిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను కురిపిస్తూ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తోంది. ఆయుర్వేద ఔషధం ఆయుర్వేద వైద్యంలో ఉసిరే కీలకం. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలైనా నాటాలని పూర్వీకులు చెబుతారు. మనకు రోగనిరోధకశక్తి పెరగాలంటే సి–విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. కరోనా పుణ్యమా అని దీనిపై అందరికీ అవగాహన పెరిగింది. అయితే సి విటమిన్ ఎక్కువగా ఉండే వాటిలో ప్రథమ స్థానం ఉసిరికే దక్కుతుంది. ఆరోగ్యాన్ని అందించే ఉసిరి రైతులు లాభాలను కూడా మెండుగా అందిస్తోంది. 200 ఎకరాల్లో సాగు విజయపురం మిట్టూరు, శ్రీహరిపురం, కాకవేడు ప్రాంతాల్లోని రైతులు ఉసిరి పంటను సాగు చేస్తున్నారు. రెండు మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో ఉసిరి సాగవుతోంది. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకునే రైతులు ఈ ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. ఒక్క సారి సాగు చేసి మొక్కలు నాటితే రెండేళ్లకు కాత వచ్చి ఏడాదికి రెండు సార్లు ఫల సాయం అందుతోంది. ఎకరాకు 200 చెట్లు నాటి సాగుచేసిన రైతులు చెట్టు పెరుగుదలను అనుసరించి ఎకరాకు రెండు నుంచి 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. ఒక్క సారి మొక్కలు నాటితే 30 నుంచి 40ఏళ్ల వరకు ఫలసాయం అందుతుందని ఉద్యానవన అధికారులు తెలుపుతున్నారు. ఉసిరి చెట్టు నీటి కొరతను చాలా వరకు తట్టుకుంటుంది. చీడపీడలు, తెగులు ఎక్కువగా ఆశించదు. ఈ కారణంగా సాగు ఖర్చు తగ్గుతుంది. రాబడిలో ఖర్చు 10 శాతం మాత్రమే ఉంటుంది. డిమాండ్‌ను బట్టి టన్నుకు రూ.30 వేలు నుంచి 50 వేలు వరకు ధర పలుకుతుంది. నగరి, విజయపురం మండలాల్లో సాగుచేసే ఉసిరి మన రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, తెనాలితో పాటు తమిళనాడు, తెలంగాణలని ఫ్యాక్టరీలకు రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి ఫ్యాక్టరీలకు తరలి వెళ్లే ఉసిరితో మందులు, సిరప్లు, ఆయిల్, సోపు, ఊరగాయలు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తారు. లాభాలనిస్తోంది.. పదిహేనేళ్ల నుంచి ఉసిరి సాగు చేస్తున్నాను. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకున్నా. ఇప్పటి వరకు ఆ చెట్లే ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఏడాదికి రెండు సార్లు కాపు వస్తోంది. తెగుళ్లు, చీడపీడల సమస్య ఎక్కువగా ఉండదు. పంట మధ్య కలుపు పెరగకుండా చూసుకుంటూ, చెట్లను పరిశీలించి తెగులు ఎక్కడైనా కనిపిస్తే మందులు స్ప్రే చేసుకుంటే చాలు. మంచి దిగుబడి చూడవచ్చు డిమాండ్‌ను అనుసరించి ఎకరాకు రూ.లక్ష వరకు లాభం ఉంటుంది. – జయరామరాజు, మిట్టూరు, విజయపురం మండలం. అవగాహన కల్పిస్తున్నాం నగరి, విజయపురం మండలాల్లో 15 యేళ్ల క్రితం నుంచి ఉసిరి పంట సాగవుతోంది. మెలమెల్లగా ఉసిరి సాగులో లాభాలను చూసిన రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఉసిరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట సాగులో నష్టాలు వచ్చేందుకు ఆస్కారం లేదు. ఒక్క సారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు ఈ పంట దిగుబడిని అందిస్తుంది. ప్రస్తుతం ఉసిరికి మార్కెట్లో ఎక్కువగా డిమాడ్ ఉంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు 18 వేలు వరకు సబ్సిడీ అందిస్తుంది. – లోకేష్, ఉద్యానవన అధికారి, నగరి -
సహజ సేద్యం.. భలే లాభం
సాక్షి, అమరావతి: సహజ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఇటీవల వెల్లడించిన నీతి ఆయోగ్ రాష్ట్రంలో ఆ తరహా సేద్యం చేస్తున్న రైతుల అభిప్రాయాలను సేకరించింది. సంప్రదాయ సాగు పద్ధతుల్లో కన్నా సహజ సేద్యంవల్ల రైతులకు అధిక లాభాలు వస్తున్నాయని, ఇదే సమయంలో వారికి పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతోందని తెలిపింది. అయితే.. మొదట్లో ఒకట్రెండేళ్లు దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ ఆ తర్వాత నుంచి దిగుబడులు పెరుగుతున్నాయన్న అభిప్రాయం రైతుల్లో నెలకొంది. ఈ విషయాన్ని రైతుల మాటల్లో నీతి ఆయోగ్ గమనించింది కూడా. అలాగే, రసాయన ఎరువులకు బదులు సాంకేతిక సహజ ఇన్పుట్స్ వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకపోగా పర్యావరణ హితానికీ దోహదపడుతోందని వెల్లడించింది. సంప్రదాయ సాగు విధానంలో ఎకరా విస్తీర్ణంలో వరి సాగుచేస్తే సగటున రసాయన ఎరువుల ఇన్పుట్స్ వ్యయం రూ.5,961 అవుతోందని.. అదే సహజ సేద్యంలో కేవలం రూ.846 మాత్రమే అవుతోందని నీతి ఆయోగ్ పేర్కొంది. మరోవైపు.. సహజ సేద్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్న రైతుల అనుభవాలను నీతి ఆయోగ్ క్రోడీకరించి విస్త్రృత ప్రచారం కల్పిస్తోంది. ‘సహజం’తో దిగుబడి.. ధర అధికం ఇక సంప్రదాయ సాగుతో పోలిస్తే సహజ సేద్యం పద్ధతుల్లో పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుందని నారాయణమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► సహజ సేద్యంలో కొంత ఎక్కువ శ్రమచేయాల్సి ఉంటుంది. ► ఆవు మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, పుట్ట మన్ను, అవు పేడతో ఎరువు చేస్తా. ► పురుగు చేరకుండా వేప, జిల్లేడు, తదితర ఐదు రకాల ఆకులతో కాషాయం తయారుచేసి ప్రతీ 15 రోజులకోసారి పిచకారి చేస్తా. ► దీనికి కొంత శ్రమ తప్ప ఖర్చు పెద్దగా కాదు. ► సహజ సేద్యం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు పంటకు ఎక్కువ ధర వస్తోంది. ఈ విధానం ద్వారా పండించిన 75 కేజీల ధాన్యం బస్తా రూ.2,000 పలుకుతోంది. ► సహజ సేద్యం ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇస్తే మరింత లాభాలు వస్తాయి. ► అలాగే, పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. ► నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరగడంతో నేల మెత్తగా మారింది. ► ఇదే పొలంలో నువ్వులు, పిల్లిపెసర, మినుములు, జనుము కూడా సాగుచేస్తున్నా. ► రసాయనాల వినియోగాన్ని తగ్గించేందుకు పరిసరాల్లోని రైతులను కూడా సహజ సేద్యం వైపు ప్రోత్సహిస్తున్నా. మరోవైపు.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, నాగమంగళం గ్రామానికి చెందిన ఎ. వెంకట సుగుణమ్మ సహజ సేద్యం పద్ధతుల్లో 0.4 హెక్టార్లలో వరి పండిస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు తగ్గిందని, రసాయన రహిత ఆహారం లభిస్తోందని ఆమె పేర్కొంటోంది. తెగుళ్లు, వ్యాధులు సోకడం తగ్గిందని, పొలంలో వానపాముల సంఖ్య పెరగడంవల్ల భూసారం పెరిగినట్లు ఆమె తెలిపింది. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం పి. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎ. నారాయణమూర్తి సహజ సేద్యంచేస్తూ సంప్రదాయ సాగు విధానాల కన్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ విధానంలో ఆయన ఒక హెక్టార్లో వరి పండిస్తున్నారు. దీంతో సంప్రదాయ సాగు విధానంలో కన్నా హెక్టార్‌కు అదనంగా రూ. 30,520 లాభం వస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులు సహజ జీవామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి అన్ని సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతాన్ని పిచికారీ చేశారు. ఫలితంగా.. సంప్రదాయ వరి సాగుకన్నా సహజ సేద్యంతో హెక్టార్‌కు 16.05 క్వింటాళ్ల ధాన్యం అధిక దిగుబడి వచ్చింది. -
పూత నిలవలె..పిందె ఎదగలె
జగిత్యాల అగ్రికల్చర్/ కొల్లాపూర్: ఫలరాజుగా పేరుగాంచిన మామిడి గత రెండేళ్లు ఆశించిన స్థాయిలో దిగుబడులు ఇచ్చింది. కానీ కరోనా నేపథ్యంలో గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లభిస్తున్నా.. దిగుబడులు లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అధిక వర్షాలతో పూత ఆలస్యం కావడం, అవే వర్షాలు పురుగులు, తెగుళ్లు ఆశించడానికి దోహదపడటంతో..పూత నిలవక, పిందె ఎదగక రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి 3.5 టన్నుల చొప్పున రావాల్సిన దిగుబడి.. ప్రస్తుతం 1 నుంచి 1.5 టన్నుకు తగ్గిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్‌లో సైతం దిగుబడి 60 శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు తెలంగాణ రాష్ట్రంలో 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జగిత్యాల, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే నేలల రకాన్ని బట్టి ఎకరానికి 3.5 టన్నుల చొప్పున 11.10 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారుల తొలుత అంచనా వేశారు. ఎర్రనేలల్లో ఎకరాకు 4 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని భావించారు. అధిక వర్షాలతో తేమ ఆరక.. అయితే మామిడి దిగుబడిపై ఈ ఏడాది అధిక వర్షాలు ప్రభావం చూపాయి. సాధారణంగా జూన్, జూలైలోనే వర్షాలు ప్రారంభమై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కురుస్తాయి. కానీ గత ఏడాది నవంబర్ చివరివరకూ అధిక వర్షాలు కురిశాయి. దీంతో నేలల్లో తేమ శాతం పెరిగింది. తేమ ఆరక, చెట్టుకు పూత రాకుండా కొమ్మలు చిగురించాయి. సాధారణంగా డిసెంబర్, జనవరిలో రావాల్సిన పూత ఆలస్యమైంది. తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి..ఇలా నాలుగు దఫాలుగా పూత కాసింది. దీంతో కొన్నిచోట్ల పూత ఉంటే, కొన్నిచోట్ల పిందెలు వచ్చాయి. కొన్నిచోట్ల కాయ దశకు చేరుకున్నాయి. రసం పీల్చిన పురుగులు అధిక వర్షాలతో దున్నడం, ఎండిన కొమ్మలను తొలగించడం వంటి పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో నల్ల తామర, తేనెమంచు పురుగులు పంట కాలానికి ముందు చెట్టు కాండం, కొమ్మల బెరడులో దాక్కుని పూత, పిందె సమయంలో చెట్టు పైకి వచ్చి నష్టం చేశాయి. పురుగులు గుంపులుగా చేరి పూలు, పిందెల నుంచి రసం పీల్చాయి. దీంతో పూత రాలిపోయింది. నల్ల తామర పురుగులు పిందెల దశలో చర్మాన్ని గోకి రసం పీల్చి నష్టం కలిగించాయి. తగ్గనున్న దిగుబడులు.. పురుగులు, తెగుళ్లకు తోడు పోషకాల లోపంతో ఈ ఏడాది మామిడి దిగుబడి ఎకరాకి టన్ను నుంచి 1.5 టన్నుల వరకు పడిపోయే అవకాశం ఉందని ఉద్యాన అధికారులు అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద 5–6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్దిరోజులుగా 41– 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉన్న పిందెలు, కాయలు కూడా రాలిపోతున్నాయి. కొల్లాపూర్ మామిడికీ కరువే ఉమ్మడి జిల్లాలో భారీగా తగ్గిన దిగుబడులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ మామిడి పండ్లకు బాగా ప్రసిద్ధి. అందులోనూ బేనీషాన్ రకం పండ్లకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పండించే మామిడి పండ్లను దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన కొల్లాపూర్ మామిడి పండ్లకు ఈసారి కరువొచ్చే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 37,670 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చిన్నరసాలు, పెద్దరసాలు, దెసేరీ, నీలిషాన్ తదితరాలతో పాటు ప్రధానంగా బేనీషాన్ రకం మామిడిని రైతులు పండిస్తుంటారు. అయితే ఈసారి 60 శాతం తోటల్లో జనవరి చివర్లో, ఫిబ్రవరి మొదటి వారంలో పూత వచ్చింది. ఇదే సమయంలో వర్షాలు పడడంతో పూతను దెబ్బతీసింది. దీనికితోడు గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి పంటకు సోకే నల్ల తామర పురుగు మామిడి పంటకు సోకి దిగుబడిపై ప్రభావం చూపింది. ఉద్యాన శాఖ అధికారుల అంచనాల ప్రకారం కేవలం 40 శాతం తోటల్లోనే మామిడి కాపు కాసింది. టన్ను ధర లక్ష పైచిలుకే.. పంట దిగుబడి బాగా తగ్గడంతో ఈసారి మామిడి కొనుగోళ్లకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్, ముంబై వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నారు. కేజీ రూ.100 నుంచి రూ.120 దాకా చెల్లిస్తున్నారు. అంటే దాదాపుగా టన్ను ధర రూ.లక్ష పైచిలుకు పలుకుతోంది. పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు నాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. ఎకరాకి రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. రెండు, మూడుసార్లు రసాయన మందులు చల్లినా పూత నిలువలేదు. పిందె ఎదగలేదు. కాయలను చూస్తే.. పెట్టుబడి కూడా వచ్చేట్టు కనిపించడం లేదు. – పడిగెల రవీందర్‌రెడ్డి, రాయికల్, జగిత్యాల జిల్లా తేనె మంచుతో రాలిన పూత సాధారణంగా నవంబర్ నెలాఖరులో, డిసెంబర్లో మామిడిపూత ప్రారంభం కావాలి. కానీ ఆలస్యంగా ప్రారంభమైన పూత ఈ ఏడాది మార్చి వరకు వస్తూనే ఉంది. ఆ సమయంలోనే తేనె మంచు ఆశించింది. పూత రాలిపోయింది. – ప్రతాప్‌సింగ్, జిల్లా ఉద్యాన అధికారి, జగిత్యాల ఒక్క కాయ కూడా తెంచలేదు సొంత భూమి 30 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల మామిడి తోట కౌలు కు తీసుకున్నా. రూ.35 లక్షలు ఖర్చు చేశా. తెగుళ్లు, వాతావరణ మార్పులతో ఒక్క తోటలోనూ పూత నిలబడ లేదు. ఇప్పటివరకు ఒక్క కాయ కూడా తెంచలేదు. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ అధికారులకు నివేదించాం.. మామిడి దిగుబడి ఈసారి 60 శాతం తగ్గింది. సకా లంలో పూత రాకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నల్ల తామర తెగులు సోక డంతో పంట దిగుబడి తగ్గింది. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. పంటనష్టం, దిగుబడి వివరాలను అధికారులకు చెప్పాం. – లక్ష్మణ్, ఉద్యానవన అధికారి, కొల్లాపూర్ -
AP: ప్రతికూలతలోనూ పెరిగిన దిగుబడులు
సాక్షి, అమరావతి: ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు వరుస ప్రకృతి వైపరీత్యాలు.. అయినా, వ్యవసాయ రంగం పురోభివృద్ధి సాధించింది. దిగుబడులు పెరిగాయి. రైతు మోములో నవ్వు విరిసింది. పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో రాష్ట్రంలో రైతన్నలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రం కరువుతో అల్లాడింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవసాయానికి చేయూతనిచ్చారు. రైతన్నకు అండదండగా నిలిచారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో నదీజలాలు పుష్కలంగా లభించాయి. ఆ నీటిని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా వినియోగించింది. ప్రాజెక్టులు, చెరువుల నిండుగా నీరుండేలా చర్యలు తీసుకుంది. రైతులకు పంటలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చింది. దీంతో రైతులు రికార్డు స్థాయి దిగుబడులతో చరిత్ర సృష్టిస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా వస్తున్న దిగుబడులే ఇందుకు నిదర్శనం. 2021–22 సీజన్లో సైతం రికార్డుస్థాయిలో దిగుబడులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆరి్ధక సర్వే వెల్లడించింది. 2019–20 సీజన్లో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 175 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు వచ్చాయి. 312 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొచ్చాయి. ఇవి 2014–18 మధ్య కాలంలో వచ్చిన దిగుబడుల కన్నా చాలా అధికం. కరోనాకు తోడు వైపరీత్యాల ప్రభావంతో 2020–21 సీజన్లో కాస్త తగ్గినప్పటికీ, టీడీపీ హయాంతో పోల్చుకుంటే మెరుగ్గానే దిగుబడులొచ్చాయి. ఆ సీజన్లో 165.04 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 307 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొచ్చాయి. 2021–22 సీజన్లో కూడా వరదలు, వైపరీత్యాలు కలవర పెట్టినప్పటికీ దిగుబడులపై పెద్దగా ప్రభావం చూపలేదు.169.57 లక్షల ఆహారధాన్యాలు, 314 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొస్తాయని అంచనావేశారు. ముఖ్యంగా ధాన్యం దిగుబడులు 2020–21లో 130.89 లక్షల టన్నులు కాగా, 2021–22 సీజన్లో 135.24 లక్షల టన్నులు వస్తాయని అంచనా. పాడి ఉత్పత్తులను పరిశీలిస్తే 2019–20లో పాలు 152.63 లక్షల టన్నులు, 8.5 లక్షల టన్నుల మాంసం, 2170.77 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరిగింది. 2020–21 సీజన్లో పాల దిగుబడులు 3.60 శాతం తగ్గినప్పటికీ మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో 147.14 లక్షల టన్నుల పాలు, 9.54 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి కాగా, 2496.39 కోట్ల కోడి గుడ్ల ఉత్పత్తి జరిగింది. 2021–22 సీజన్లో 150 లక్షల టన్నుల పాలు, 10 లక్షల టన్నులు మాంసం, 2600 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి సాధించబోతున్నట్టు అంచనా వేశారు. మత్స్య ఉత్పత్తులు 2019–20 సీజన్లో 41.75 లక్షల టన్నుల దిగుబడులురాగా, 2020–21లో 46.23 లక్షల టన్నులు వచ్చాయి. 2021–22 సీజన్లో 50.85 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నారు. జనవరి నెలాఖరు నాటికి 36.12లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు వచ్చాయని ఆరి్థక సర్వే తెలిపింది. -
ఘాటెక్కిన మిర్చి
దేవరపల్లి: మిర్చి అ‘ధర’హో అనిపిస్తోంది. గతంలో ఎన్నడూలేని ధర పలుకుతోంది. అయితే దిగుబడులు దారుణంగా తగ్గడంతో రైతులు నిట్టూరుస్తు్తన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎండుమిర్చిని సాగుచేస్తున్నా దేవరపల్లి మండలంలోని పల్లంట్ల, కురుకూరు పంట ప్రత్యేకం. ఇక్కడ మిరపకాయలు దేశవాళీ కావడం వల్ల నాణ్యత, రుచి ఉంటుందని ప్రజల నమ్మకం. ఇక్కడ కాయలతో పచ్చళ్లు పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెబుతున్నారు. దీంతో గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చిన పల్లంట్ల మిరపకాయలు కొనుగోలు చేస్తుంటారు. 639 హెక్టార్లలో.. జిల్లాలో 639 హెక్టార్లలో ఎండుమిర్చి సాగు ఉంది. దీనిలో దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దేవరపల్లి మండలంలో పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం, దేవరపల్లి గ్రామాల్లో పండిస్తుండగా పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లోనే సుమారు 150 ఎకరాల్లో పంట ఉంది. గతంలో దేవరపల్లి మండలంలో 300 ఎకరాల్లో మిరప సాగు ఉండేది అయితే చీడపీడలు, దిగుబడులు తగ్గడం వంటి కారణాలతో నాలుగేళ్లుగా రైతులు సాగు తగ్గించారు. సగానికి తగ్గిన దిగుబడి ఈ ఏడాది ఎండుమిర్చి దిగుబడులు దారుణంగా పడిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు సుమారు 6 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని అంటున్నారు. ఎకరాకు సుమారు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండటంతో రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు. దిగుబడులు మరింత తగ్గిన రైతులకు నష్టాలు తప్పని పరిస్థితి. ప్రస్తుతం ధర వీసె (1400 గ్రాములు) రూ.650 నుంచి రూ.700, గుల్లకాయలు రూ.450 నుంచి రూ.500 పలుకుతోంది. తెల్లదోమతో నష్టం ఈ ఏడాది మిరప తోటలకు తెల్లదోమ వ్యాపించింది. కాయ తయారు కాకుండానే పిందె దశలోనే పండిపోయి రాలిపోయిందని రైతులు అంటున్నారు. దీంతో కాపులు లేక తోటలు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర పెరిగే అవకాశాలు నేను మూడు ఎకరాల్లో మిరప పంట వేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాను. ఎకరాకు 3 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. మూడు ఎకరాల్లో దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం వీసె ధర రూ.700 ఉంది. వారం రోజుల్లో రూ.1,000 దాటవచ్చు. ఈ ఏడాది మిరప తోటలు నల్లదోమ, ఆకుముడత తెగుళ్లతో ఎక్కువగా దెబ్బతిన్నాయి. – నలమాటి బాలకృష్ణ, రైతు, పల్లంట్ల -
ఇదో హైటెక్ రైతు కథ.. పట్నం మధ్యలో ప్రకృతి వ్యవసాయం
ఒకప్పుడు నగర శివారుల్లో పంట, పొలాలు కనిపించేవి. రైతులు సాగు చేస్తూ కనిపించే వారు. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. రానురాను శివారు ప్రాంతాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారుతూ ఉండటంతో అటు రైతులు.. ఇటు పొలాలు కనుమరుగవుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో... భూమి ధర తెలిసిన వాడు అమ్ముకుంటుంటే.. భూమి విలువ తెలిసిన వాడు సేద్యాన్ని నమ్ముకుంటున్నాడు. భూమి ధర మంచిగొస్తుంటే సేద్యం ఎవరు చేస్తారులే? అనే ప్రశ్న మనలో తలెత్తడం సర్వసాధారణం. కానీ ఓ రైతు సేద్యాన్నే నమ్ముకుని ఔరా అనిపిస్తున్నాడు. మరి కాలనీల మధ్యలో వ్యవసాయం చేస్తున్న ఆ రైతు ఎవరో తెలుసుకుందామా? సాక్షి, మీర్‌పేట(హైదరాబాద్): గ్రామపంచాయితీ నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందినా.. చుట్టూ కాలనీలు వెలిసినా సేద్యంపై ఉన్న మక్కువతో కాంక్రీట్ జంగిల్ మధ్య వ్యవసాయం చేస్తున్నాడో రైతు. మీర్‌పేట కార్పొరేషన్ పరిధి జిల్లెలగూడకు చెందిన సిద్దాల కొమురయ్య దాదాపు 45 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ప్రాంతం నగరానికి ఆనుకుని ఉండటం.. చుట్టూ కాలనీలు వెలిసినప్పటికీ వ్యవసాయాన్ని వదలకుండా తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో నేటికీ సేద్యం చేస్తుండడం విశేషం. వరితో పాటు పాలకుర, తోటకూర, వంకాయలు పండిస్తుంటాడు. ప్రస్తుతం ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో చామగడ్డ పంటను పండిస్తున్నాడు. సేద్యం, అమ్మకం ఒకేచోట.. ► సిద్దాల కొమురయ్య తాను పండించిన కూరగాయలు, ఆకు కూరలను పండించిన చోటే భార్య అంజమ్మతో కలిసి విక్రయిస్తుంటాడు. ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులతో కూరగాయలు, ఆకు కూరలను సాగు చేస్తుండటంతో కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. స్థానికులకు విక్రయించగా మిగిలిన వాటిని మాదన్నపేట మార్కెట్‌కు సరఫరా చేస్తామని కొమురయ్య తెలిపారు. నగర శివారు ప్రాంతాల్లో అర ఎకరం స్థలం ఉంటే ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకునే ఈ రోజుల్లో నగరానికి ఆనుకుని ఉన్న జిల్లెలగూడ ప్రాంతంలో విలువైన భూమి ఉన్నప్పటికీ కొమురయ్య ఇంకా వ్యవసాయం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నగర పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ చిట్టి వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చి సేద్యాన్ని పరిచయం చేయొచ్చని కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయంపై మక్కువతోనే.. తెలివి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. చుట్టూ కాలనీలు వెలిసినా సేద్యంపై మక్కువతో నాకున్న కొద్ది పాటి పొలంలో వ్యవసాయం చేస్తు న్నాను. కుటుంబ సభ్యుల సహకారంతో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నాను. ప్రస్తుతం ఒక ఎకరంలో వరిపంట, మరో ఎకరాలో చామగడ్డ, వంకాయ పంటలను సాగు చేస్తున్నాను. నాలుగు నెలల నుంచి సాగు చేస్తున్న చామగడ్డ పంట చేతికి వచ్చింది. నాలుగైదు రోజుల్లో కోతకోసి విక్రయిస్తాం. – సిద్దాల కొమురయ్య, రైతు, జిల్లెలగూడ -
కాఫీ సాగులో కేరళను వెనక్కినెట్టి ముందుకు ఏపీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో లక్షకు పైగా గిరిజన రైతు కుటుంబాలకు కాఫీ తోటలు మంచి ఆదాయాన్ని సమకూర్చే వనరుగా మారాయి. ఇక్కడి మన్యంలోని 200 గ్రామ పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు విస్తరించాయి. కాఫీ తోటల్లోనే అంతర పంటగా మిరియం సాగు చేస్తూ.. అధిక ఆదాయం పొందుతుండటం విశేషం. దీనికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహంతో మిగతా రైతులు కూడా కాఫీ తోటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సానుకూల పరిణామంతో మన రాష్ట్రం కాఫీ సాగు విస్తీర్ణంలో కర్ణాటక తర్వాత స్థానంలో నిలబడింది. ‘తూర్పు’న అడుగుపెట్టి.. కాఫీ మొక్కలను తొలుత మన రాష్ట్రానికి తీసుకొచ్చింది బ్రాడీ అనే ఆంగ్లేయుడు. 1898లో తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని పాములేరు లోయలో ఈ మొక్కలను నాటించాడు. తర్వాత రిజర్వు ఫారెస్ట్‌లో పోడు వ్యవసాయం కోసం చెట్లు నరికివేయడాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ) వాణిజ్య తరహాలో కాఫీ సాగు వైపు గిరిజన రైతులను ప్రోత్సహించింది. అలా 1960లో మొదలైన సాగు 1985 నాటికి 10,107 ఎకరాలకు విస్తరించింది. ఇప్పుడు అవన్నీ ఏపీఎఫ్డీసీ ఆధీనంలోనే ఉన్నాయి. తర్వాత కాలంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ), పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) రంగంలోకి దిగాయి. 1985 నుంచి వివిధ పథకాలతో రైతులను కాఫీ సాగువైపు ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. కాఫీ బోర్డు నిపుణుల సలహాలు, పర్యవేక్షణ ఎంతో ఉపకరిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కాఫీ తోటల విస్తీర్ణం 2019లో 2,10,390 ఎకరాలు కాగా 2020 నాటికి 2,22,390 ఎకరాలకు చేరింది. ఇందులో 2.12 లక్షల ఎకరాలు విశాఖ మన్యంలోనే ఉండటం విశేషం. ప్రభుత్వం సహకారంతో గిరిజన రైతులు ఏటా 10 వేల నుంచి 12 వేల ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా కాఫీ సాగును చేపడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ కర్ణాటక తర్వాత గుత్తాధిపత్యంతో ఉన్న కేరళ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి మన రాష్ట్రం ద్వితీయ స్థానానికి చేరుకుంది. మరింత విస్తరణే లక్ష్యంగా... కాఫీ తోటలను 2025–26 సంవత్సరం నాటికి మరో 58 వేల ఎకరాల్లో సాగు చేయించాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ఓ ప్రణాళిక అమలు చేస్తోంది. కాఫీ మొక్కలకు నీడ చాలా ముఖ్యం. అటవీ ప్రాంతంలో దట్టమైన చెట్లు ఉన్నచోట్ల వాటి మధ్య నేరుగా నాటుతున్నారు. అలాంటి సౌకర్యం లేనిచోట్ల మూడేళ్లు ముందుగా సిల్వర్ ఓక్ చెట్లను పెంచుతున్నారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో సిల్వర్ ఓక్ నర్సరీలు నిర్వహించేలా గిరిజనులను ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది. కాఫీ తోటల మధ్య అంతర పంటగా మిరియం వేసేందుకు కూడా ప్రత్యేక నర్సరీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో ముందుకు.. విశాఖ మన్యంలో కాఫీ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో అమలు చేస్తున్న మరో కార్యక్రమం ‘చింతపల్లి ట్రైబల్ ఆర్గానిక్ కాఫీ ప్రాజెక్ట్’. ఈ ప్రాజెక్టు ద్వారా చింతపల్లి మండలంలో చిన్న, సన్నకారు కాఫీ రైతులను ఏకం చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీవో)ను ఏర్పాటు చేసింది. దీన్ని మ్యాక్స్ (ఎంఏసీఎస్) చట్టం కింద రిజిష్టర్ చేయించింది. దీనివల్ల రైతులు మంచి ధర పొందడానికి అవకాశం ఏర్పడింది. వారే కాఫీ గింజలను నిపుణుల పర్యవేక్షణలో మేలైన పద్ధతుల్లో పల్పింగ్ చేస్తున్నారు. క్లీన్ కాఫీ గింజలను టాటా కాఫీ వంటి కార్పొరేట్ సంస్థలకు విక్రయిస్తున్నారు. అంతర పంటతో అదనపు ఆదాయం ఎకరా విస్తీర్ణంలో 900 వరకూ కాఫీ మొక్కలు వేస్తున్నారు. ఒక్కో మొక్క నుంచి ఏటా కిలో నుంచి 1.20 కిలోల వరకూ.. ఎకరానికి సగటున 100 నుంచి 120 కిలోల వరకూ క్లీన్ కాఫీ గింజల దిగుబడి వస్తోంది. తద్వారా రూ.20 వేల నుంచి రూ.30 వేల ఆదాయం లభిస్తోంది. అంతర పంటగా కాఫీ తోటల మధ్య 100 నుంచి 160 మిరియం మొక్కలు వేస్తున్నారు. ఇవి రెండేళ్లలో కాపు కాస్తున్నాయి. వాటిద్వారా రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ అదనపు ఆదాయం వస్తోంది. మొత్తం మీద ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.90 వేల వరకూ ఏటా ఆదాయం పొందే అవకాశం ఉండటంతో మిగతా రైతులు కూడా కాఫీ తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో అడవులను నరికి పోడు వ్యవసాయం చేసినవారే ఇప్పుడు అదే పోడు భూముల్లో దట్టమైన చెట్లను పెంచి కాఫీ తోటలను సాగు చేయడం విశేషం. మంచి దిగుబడి కాలం గత ఏడాది క్లీన్ కాఫీ గింజల దిగుబడి 11 వేల టన్నులు వచ్చింది. ఈసారి 13 వేల టన్నులకు పెరిగే అవకాశం ఉంది. సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులు ఇప్పటికే 50 వేల ఎకరాల్లో సిల్వర్ ఓక్ మొక్కలను వేశారు. ఇతర ఆహార, చిరుధాన్యాల పంటల కన్నా కాఫీ, మిరియాల పంట నుంచి మెరుగైన ఆదాయం సంవత్సరం పొడువునా వస్తుండటంతో మరింత మంది ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరించే అవకాశం ఉంది. -
రైతులకు భారం: నష్టాలు ‘కోకో’ల్లలు
అమలాపురం: కొబ్బరి, ఆయిల్పామ్లలో ప్రధాన అంతర పంటగా.. అదనపు ఆదాయంతో పాటు భూసారాన్ని పెంచే కోకో సాగు ఇప్పుడు రైతులకు భారంగా మారుతోంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సుమారు 75 వేల ఎకరాల్లో అంతర పంటగా కోకో సాగు జరుగుతోంది. మన జిల్లాలోనే సుమారు 8,151 ఎకరాల్లో సాగవుతోంది. కొబ్బరి, ఆయిల్‌పామ్ ధర తగ్గిన ప్రతిసారీ దీని ఆదాయం రైతులను ఆదుకుంటోంది. వాతావరణం సహకరించి, దిగుబడులు ఆశాజకంగా ఉన్నప్పుడు కోకో ద్వారా రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఆదాయం వచ్చిన సందర్భాలున్నాయి. గడచిన ఐదేళ్లుగా కోకో ధర ఆటుపోట్లకు లోనవుతోంది. ఇష్టానుసారం ధర నిర్ణయం కోకో గింజల నుంచి తయారు చేసే చాక్లెట్లకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతున్నా కోకో గింజల ధర మాత్రం తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. 2014, 2015 సంవత్సరాల్లో కోకో గింజల సగటు ధర కేజీ రూ.192 కాగా 2016లో రూ.200కు పెరిగింది. 2017లో రూ.191కి తగ్గింది. 2018లో రూ.160కు పడిపోయింది. అప్పట్లో అంబాజీపేట, అమలాపురం మండలాల్లో రైతులు ఈ తోటలను తొలగించారు. రూ.240కి పెరిగిన ధర తాజాగా మరోసారి రూ.180కి తగ్గింది. ఏటా సాగు పెట్టుబడులు పెరుగుతుండగా, కోకో గింజల ధర తగ్గుతూ వస్తోంది. ఒకటి రెండు కార్పొరేట్ కంపెనీలు మాత్రమే కొనుగోలు చేయడం, వారు ఇష్టానుసారం ధర నిర్ణయించడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది. కూలీ చెల్లింపునకే సరి.. ఇటీవలి కాలంలో గోదావరి జిల్లాల్లో కూలి ధరలు రైతుకు భారంగా మారాయి. పురుషులకు రూ.500 వరకూ, మహిళలకు రూ.250 నుంచి రూ.300 వరకూ చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత దిగుబడికి కార్పొరేట్ చెల్లిస్తున్న ధర ప్రకారం ఎకరాకు రూ.27 వేలకు మించి రావడం లేదు. ఇది కూలీల చెల్లింపులకే సరిపోతోందని రైతులు వాపోతున్నారు. దీంతో కోకో సాగుకు వారు క్రమేపీ దూరమవుతున్నారు. తాజాగా అమలాపురం మండలం కామనగరువులో ఒక రైతు తన పదెకరాల కొబ్బరి తోటలో ఉన్న అంతర పంట కోకోను తొలగిస్తున్నారు. కోకో సాగు బహుళ ప్రయోజనం ధరలో హెచ్చుతగ్గులు వచ్చినా కోకో సాగు బహుళ ప్రయోజనం. ధర తగ్గడం అనేది తాత్కాలికం. కోనసీమ కేంద్రంగా కోకో ప్రాసెసింగ్ పరిశ్రమ త్వరలోనే ప్రారంభం కానుంది. స్థానికంగా కొనుగోలు పెరిగితే మంచి ధర వచ్చే అవకాశముంది. మన ప్రాంతంలో దిగుబడి వచ్చే గింజలు చాలా నాణ్యమైనవి. కానీ దిగుబడి తక్కువగా వస్తోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు వచ్చే అవకాశముంది. పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఈ స్థాయిలో దిగుబడి సాధిస్తున్నారు. అంతర పంటలు లేని సాధారణ కొబ్బరి తోటల్లో కన్నా కోకో సాగు జరిగే కొబ్బరి తోటల్లో దిగుబడి ఎక్కువ. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. కోకోకు ఆకురాల్చే గుణం ఉండడం వల్ల కొబ్బరి తోటకు మంచి సేంద్రియ ఎరువు అందుతుంది. – నేతల మల్లికార్జునరావు, ఏడీహెచ్, అమలాపురం ఐదేళ్లుగా ధర తప్ప అన్నీ పెరిగాయి ఐదేళ్ల క్రితం కోకో గింజల ధర కేజీ రూ.200 ఉండేది. ఇప్పుడు రూ.180. ఈ ఐదేళ్లలో ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలి రేట్లు అన్నీ పెరిగాయి. కోకో గింజల ధర మాత్రం పెరగడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాతో పోల్చుకుంటే మనకు ఎకరాకు సగం దిగుబడి మాత్రమే వస్తోంది. కనీసం కూలీలకు అవుతున్న ఖర్చు కూడా రావడం లేదు. అందుకే కోకో తోటల లీజును రద్దు చేసుకున్నాను. ఇప్పుడు అదే తోటను రైతు తొలగిస్తున్నారు. – సీహెచ్ సూర్యనారాయణరాజు, రైతు, మాగాం, అయినవిల్లి మండలం చదవండి: కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్స్ మాత్రం.. గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి -
మామిడి రైతుకు 'తీపి' ధర
సాక్షి, అమరావతి బ్యూరో: మామిడి రైతుకు ఈ ఏడాది మంచి రోజులొచ్చాయి. గత సంవత్సరంకంటే అధిక దిగుబడులు రావడంతోపాటు ధర కూడా ఎక్కువగా లభిస్తోంది. ఇన్నాళ్లూ రైతులు మామిడిని స్థానిక మార్కెట్లోనే విక్రయించడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో మార్కెట్లో వ్యాపారులు నిర్ణయించిన తక్కువ ధరకే అమ్ముకోవలసిన పరిస్థితి ఉండేది. ఫలితంగా రైతుకు నష్టం వాటిల్లేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యానశాఖ ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా మామిడికి మంచి ధర లభించేలా చూస్తోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూమిలో తేమ శాతం పెరిగి మామిడి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి రాగా ఈ సంవత్సరం ఐదు టన్నులకుపైగా (25 నుంచి 30 శాతం అధికంగా) వస్తోంది. ఈ ఏడాది 56 లక్షల టన్నుల మామిడి దిగుబడి రావచ్చని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. పైగా ఈ ఏడాది మామిడి నాణ్యత కూడా మెరుగ్గా ఉంది. ఇప్పటికి మామిడి కోత 20 శాతం వరకు జరగ్గా ఏప్రిల్ రెండోవారం నుంచి పూర్తిస్థాయిలో మామిడి మార్కెట్‌కు వస్తుందని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. తోటలోనే రైతులకు సొమ్ము.. బంగినపల్లి రకం టన్ను ఎ–గ్రేడు రూ.60 వేల నుంచి 65 వేలు, బి–గ్రేడు రూ.50 వేలు, సి–గ్రేడు రూ.40 వేలు పలుకుతోంది. తోతాపురి టన్ను ధర రూ.35 వేలు ఉంది. ఉద్యానశాఖ ఈనెల 16న విజయవాడలో నిర్వహించిన మ్యాంగో సెల్లర్స్, బయ్యర్స్ సమావేశం రైతులకు ఎంతో ఉపయోగపడింది. ఆ సమావేశంలో రైతులు.. కొనుగోలుదార్లు/ఎగుమతిదార్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలా ఈ ఏడాది ఐదువేల టన్నుల మామిడి ఎగుమతులకు ఒప్పందాలు జరిగాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, ఇండోర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల నుంచి ఒప్పందాలు చేసుకున్న కొనుగోలుదార్లు వస్తున్నారు. వీరు మామిడితోటల్లోకి నేరుగా వెళ్లి కాయలను కోయించుకుని స్పాట్లోనే రైతులకు సొమ్ము చెల్లించి కాయల్ని తీసుకెళుతున్నారు. రైతులు స్థానిక మార్కెట్లో అమ్ముకుంటే సొమ్ము కోసం నాలుగైదుసార్లు తిరగాల్సి వచ్చేది. పైగా ఎగుమతిదార్లు ఇచ్చే ధరకంటే స్థానిక మార్కెట్లో టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు తక్కువే లభించేది. గత సంవత్సరం నాణ్యమైన బంగినపల్లి టన్ను గరిష్టంగా రూ.30 వేలకు, తోతాపురి రూ.10 వేలకు మించలేదు. గతంలో రైతులే మార్కెట్‌కు తరలించే సమయంలో కాయ కోత, లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఖర్చుల కింద టన్నుకి రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఖర్చయ్యేది. మార్కెట్లలో 10 శాతం కమీషన్ కింద ఇవ్వాల్సి వచ్చేది. కొనుగోలుదారులే నేరుగా తోటల్లోకి వచ్చి తీసుకెళుతుండటంతో రైతులకు ఈ ఖర్చులు, కమిషన్ సొమ్ము ఆదా అవుతున్నాయి. మంచి ధర దక్కుతోంది స్థానిక మార్కెట్లో మామిడిని విక్రయిస్తే తక్కువ ధరతో పాటు కమీషన్, హమాలీల ఖర్చుల కింద 10 శాతం సొమ్ము తీసుకుంటున్నారు. ఇలా గత ఏడాది రైతుకు టన్నుకు రూ.30 వేలు రావడం కష్టమైంది. సెల్లర్స్, బయ్యర్స్ మీట్లో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఫలితంగా ఎ–గ్రేడు బంగినపల్లి రకం టన్ను రూ.52 వేల నుంచి రూ.70 వేల వరకు కొనుగోలు చేశారు. వెంటనే సొమ్ము చెల్లించారు. ఇలా నాకున్న 20 ఎకరాల్లో ఇప్పటివరకు నాలుగున్నర టన్నులు విక్రయించాను. మా గ్రామం నుంచి వంద టన్నులు ఎగుమతిదార్లకు విక్రయించాలని ఒప్పందం చేసుకున్నాం. – బాలరాఘవరావు, మామిడి రైతు, హనుమంతునిగూడెం, కృష్ణా జిల్లా ఒప్పందాలతో సత్ఫలితాలు గత ఏడాదికంటే మామిడి అధిక దిగుబడి రావడంతో పాటు మంచి ధర కూడా లభిస్తోంది. రైతులు నాణ్యమైన మామిడిని ఎగుమతిదార్లకు విక్రయించేలా ప్రోత్సహిస్తున్నాం. ఇటీవల విజయవాడలో నిర్వహించిన మ్యాంగో మీట్లో ఒప్పందాల మేరకు ఎగుమతిదారులు నేరుగా కొనుగోళ్లు మొదలు పెట్టారు. – సీహెచ్. శ్రీనివాసులు, ఏడీ, ఉద్యానశాఖ -
గిరి వాకిట సిరులు!
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో దాదాపు గిరిజన రైతులంతా ఖర్చులేని ప్రకృతి సేద్య విధానం (జడ్బీఎన్ఎఫ్)లో రాగులు సాగుచేసి సిరులు కురిపిస్తున్నారు. ఎలాంటి ఎరువులు, రసాయనిక మందులను కూడా వాడకుండా పూర్తిగా గుల్లిరాగి పద్ధతిని అనుసరిస్తున్నారు. ఫలితంగా తక్కువ విత్తనాలతో అదీ దేశవాళీ రకాలతో రికార్డు స్థాయిలో దిగుబడి సాధిస్తున్నారు. ఈ తరహాలో మంచి దిగుబడులు సాధించిన సుమారు 250 మంది గిరిజన రైతులను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ అభినందించారు. సోమవారం ముంచంగిపుట్టు మండలంలోని వణుగుపుట్టులో రైతుసాధికార సంస్థ, ఐటీడీఏ, వ్యవసాయ శాఖ, జడ్బీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మన్యంలోని 21 క్లస్టర్లలోనూ వంద శాతం జడ్బీఎన్ఎఫ్ అమలు చేయడానికి ఐటీడీఏ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైబ్రిడ్ విత్తనాలతో కాకుండా పూర్తిగా దేశవాళీ విత్తనాలతోనే రాగుల సాగులో రికార్డు స్థాయి దిగుబడి సాధించడం విశేషమని జడ్బీఎన్ఎఫ్ జిల్లా మేనేజరు డి.దాసు హర్షం వ్యక్తం చేశారు. రాగులదే ప్రథమ స్థానం.. చిరుధాన్యాల్లో రాగులది ప్రథమ స్థానం. జిల్లాలో వరి, చెరుకు పంటల తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట ఇదే. మొత్తం 17,626 హెక్టార్లలో ఈ ఖరీఫ్‌లో సాగు చేశారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. 2017 ఖరీఫ్‌లో 16,731 హెక్టార్లు, 2018 ఖరీఫ్‌లో 16,731 హెక్టార్లకే పరిమితమైంది. ఈసారి సాగు పెరిగింది. దీనిలో ఎక్కువగా మన్యంలోని 21 వ్యవసాయ క్లస్టర్లలోనే సాగు అయ్యింది. ఇప్పటికే దసరా బూడులు, మింతచోడి, మిలట్రీ చోడి రకాల పంట కోతలు పూర్తయ్యాయి. ఇప్పుడు పెద్దరకం చోడి పంట కోతలు మొదలయ్యాయి. ఇది దాదాపు గుల్లిరాగి సాగు విధానంలోనే సాగింది. గిరిజన రైతులు అద్భుతమైన దిగుబడులు సాధించారు. వ్యవసాయ శాఖ, రైతుసాధికారిక సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు (జడ్బీఎన్ఎఫ్) అధికారులు, సంజీవని, వాసన్, సీసీఎన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో గిరిజన రైతుల ప్రతిభ వెల్లడైంది. తనకు రెండెకరాల్లో రాగులు పంట సాగుచేసిన గిరిజన రైతు పాంగి గోవిందు ఎకరాకు 18.20 క్వింటాళ్ల చొప్పున రికార్డు స్థాయిలో దిగుబడి సాధించి అభినందనలు పొందారు. మన్యంలోని 11 మండలాల్లోనున్న 21 క్లస్టర్లలో 1,260 మంది గిరిజన రైతులు గుల్లిరాగు విధానాన్నే అనుసరించడం విశేషం. సుమారు 824 ఎకరాల్లో ఈ విధానంలో సత్ఫలితాలు సాధించారు. ప్రభుత్వ ప్రోత్సాహం... చిరుధాన్యాల సాగులో ముందంజలోనున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా నిలబడుతున్నాయి. ముఖ్యంగా రాగులకు కనీస మద్దతు ధర బాగా పెరిగింది. 2018–19 సంవత్సరంలో క్వింటాలుకు రూ.2,897లు ఉంది. ఈ ఖరీఫ్ సీజన్లో రూ.3,150కి పెరిగింది. ఈ ప్రకారం రాగులకు మద్దతు ధర గత ఏడాది కన్నా ఈసారి రూ.253 పెరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే చిరుధాన్యాల సాగును పెంచడానికి మరింత ప్రోత్సాహం, ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా త్వరలోనే మిల్లెట్ బోర్డునూ ఏర్పాటు చేయనున్నారు. ఈ బోర్డు ద్వారా చిరుధాన్యాలు పండించే రైతులకు అవసరమైన సాయం, ప్రోత్సాహం అందనున్నాయి. మద్దతు ధరకన్నా తక్కువకు అమ్మవద్దు జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విధానం విశాఖ మన్యంతో పాటు నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నాం. రాగుల సాగులో విశాఖ మన్యం రైతులు అద్భుత ప్రగతి చూపిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఎకరాకు 18 క్వింటాళ్లు దిగుబడి సాధించడం గొప్ప విషయం. రాగులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ధర ఎవ్వరు ఇచ్చినా విక్రయించవద్దని గిరిజన రైతులకు చెబుతున్నాం. గిరిజన సహకార సమాఖ్య (జీసీసీ), పాడేరు ఐటీడీఏ యంత్రాంగం రాగుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. – పి.దేవుళ్లు, రాష్ట్ర రిసోర్స్‌పర్సన్, జడ్బీఎన్ఎఫ్ -
పత్తి విత్తనంపై అధికారుల పెత్తనం
సాక్షి, హైదరాబాద్: బీజీ–2 పత్తి విత్తనం విఫలమైంది. గులాబీ రంగు పురుగు సోకి పత్తి పంట నాశనమవుతోంది. దీంతో పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటున్నా, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం బీజీ–2 పత్తిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఖరీఫ్‌కోసం విత్తన ప్రణాళికను ఖరారు చేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. ఇప్పటికే జిల్లాల నుంచి ఇండెంట్లు తెప్పించుకుంది. ఆ ప్రకారం విత్తనాలను సరఫరా చేయాలని యోచిస్తోంది. వ్యవసాయశాఖ తాజా ప్రణాళిక ప్రకారం వచ్చే ఖరీఫ్‌కు ఏకంగా 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. విస్మయం కలిగించే విషయమేంటంటే, గతేడాది కేవలం కోటి ప్యాకెట్లు మాత్రమే సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి అదనంగా 29 లక్షల ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్తి విత్తన కంపెనీలకు బాసటగా నిలిచేలా అధికారుల వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 90 పత్తి విత్తన కంపెనీలకు ఆర్డర్లు.. తెలంగాణలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, 2018–19 ఖరీఫ్‌లో ఏకంగా 44.30 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే గులాబీ రంగు పురుగు కారణంగా ఉత్పత్తి మాత్రం గణనీయంగా పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. 10 జిల్లాల్లో గులాబీ పురుగు కారణంగా పత్తి దిగుబడి పడిపోయిందని నిర్ధారించారు. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి కావాలి. కానీ అనేకచోట్ల ఈసారి 6–7 క్వింటాళ్లకు మించి ఉత్పత్తి కాలేదని అంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండగా, పత్తిని ప్రత్యేకంగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం అంతుబట్టడంలేదు. ఈసారి 90 పత్తి విత్తన కంపెనీలకు విత్తన ప్యాకెట్లను సరఫరా చేసే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. ఇదిలావుం టే అనుమతిలేని బీజీ–3 పత్తి విత్తనాన్ని కూడా కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టే పనిలో నిమగ్నమయ్యాయి. బీజీ–2, బీజీ–3 విత్తనాలు చూడడానికి ఒకేరకంగా ఉంటాయి. కాబట్టి వాటిని గుర్తు పట్టడం కష్టమైన వ్యవహారం. దీన్ని ఆసరాగా చేసుకొని కంపెనీలు బీజీ–3 విత్తనాలను కూడా మార్కెట్లోకి దించుతున్నాయి. వాటిపై దాడులు చేస్తున్నామని చెబుతు న్నా పరోక్షంగా ఆయా కంపెనీలకు కొందరు అధికారులు మద్దతుగా ఉండటంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇతర విత్తనాలు 8 లక్షలు.. ఇదిలావుంటే వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రకటించింది. ఖరీఫ్‌కు ఏఏ విత్తనాలు అవసరమో జిల్లాల నుంచి ఇండెంట్ తెప్పించుకుంది. ఆ ప్రకారం ఖరీఫ్‌కు 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేస్తారు. మూడు లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సబ్సిడీపై రైతులకు అందజేయనున్నారు. అలాగే 1.70 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు, 20 వేల క్వింటాళ్ల కంది, లక్ష క్వింటాళ్ల జీలుగ, 80 వేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలను కూడా సరఫరా చేస్తారు. పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, పిల్లిపెసర, పొద్దు తిరుగుడు, ఆముదం విత్తనాలను కూడా ఖరీఫ్ కోసం అందజేస్తారు. -
రైతు కంట.. మిర్చి మంట
గత ఏడాది పర్వాలేదనిపించిన మిరప ఈ ఏడాది పుట్టిముంచేలా ఉంది. పోయిన సంవత్సరం ధరలు, దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది మిరపను సాగు చేసేందుకు మరికొంత మంది రైతులు ముందుకొచ్చారు. మిరపలో వచ్చే లాభాలతో అప్పుల బాధ నుంచి గట్టెక్కవచ్చని ఆశించిన అన్నదాతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చేలకు వైరస్ సోకిందని వాపోన్నారు. మార్కెట్లో లభించే మందులన్నీ వాడినా పరిస్థితి మెరుగుపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పెట్టుబడులు పెరిగి, ధరలు దిగజారడంతో సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కారంచేడు (ప్రకాశం): జిల్లాలో సుమారు 54 వేల హెక్టార్ల (1.35 లక్షల ఎకరాలు)లో మిరప సాగు చేశారు. సాగుకు నీరు లేక పొలాలన్నీ బెట్టకు రావడమే కాకుండా భూమిలో తేమ లేక పంటలకు కొత్తకొత్త తెగుళ్లు సోకాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల రైతులు ఎకారానికి సగటున రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు. జిల్లాలో మిరప రైతులు పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో మిరప చేలకు ప్రధానంగా బూడిద తెగులు, పండాకు, కొమ్మ ఎండు తెగుళ్లు ఆశించాయి. వీటి వల్ల దిగుబడులు ఘోరంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయాధికారుల సూచనల మేరకు మార్కెట్లో ఎన్ని రకాల నివారణ మందులున్నాయో వాటన్నింటినీ పిచికారి చేసామని సాగుదారులు వాపోతున్నారు. సాగునీరు జిల్లాకు సక్రమంగా విడుదల కాకపోవడమే మిరప రైతు నష్టానికి కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన సాగు ఖర్చులు: గత ఏడాదితో పోల్చుకుంటే భూమి కౌలు నుంచి పంట చేతికందే వరకు అయిన సాగులో ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు చెప్తున్నారు. ఖర్చు వివరాలు రూపాయల్లో.. ఎకరం భూమి కౌలుకు 30 వేలు– 40 వేలు విత్తనాలు, దుక్కి 13–16 వేలు సేద్యం, వ్యవసాయం 5–8 వేలు నీళ్ల మందులు 30–35 వేలు కలుపునకు 18–20 వేలు అదనపు ఎరువులకు 10–12 వేలు నీళ్ల ఖర్చులు, కోతలకు మొత్తం ఎకరానికి రూ. 1.5 లక్షకు పైగా ఖర్చు గణనీయంగా తగ్గిన దిగుబడులు: గత ఏడాదితో పోల్చుకుంటే మిరపలో దిగుబడులు గణనీయంగా తగ్గాయని రైతులు చెప్తున్నారు. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వస్తే అందుకు తగ్గట్లుగానే బస్తా రూ. 13 వేలు నుంచి రూ. 15 వేల వరకు వచ్చిందని రైతులు చెప్తున్నారు. వీటిలో కూడా సుమారు 20 శాతం వరకు తాలు కాయలే దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. ఈ ఏడాది ఎకరానికి కేవలం 5 నుంచి 12 బస్తాలకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర కూడా క్వింటా రూ. 8000 మాత్రమే వుంది. అంటే సగటున ఎకరానికి రైతులు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు. దిగుబడులు, ధరలు పోల్చుకుంటే.. గత ఏడాది.. ఈ ఏడాది సాగు ఖర్చు రూ. 1.25 లక్షలు.. 1.60 లక్షలు దిగుబడులు 10–15 బస్తాలు.. 5–12 బస్తాలు ధరలు(కింటా) రూ. 9–11 వేలు.. రూ. 7–8 వేలు ఎకరానికి రూ. 50 వేలకు పైగా నష్టం మిరప రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోవాల్సిందే. సాగుకు సక్రమంగా నీరు విడుదల చేయకపోడంతో తెగుళ్లు సోకాయి. వీటి వల్ల ఎకరానికి గత ఏడాది 15 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది కేవలం 5 బస్తాలు కూడా రాలేదు. గత ఏడాది బస్తా రూ. 11 వేల వరకు ఉంటే ఈ ఏడాది కేవలం రూ. 8 వేలకు మించడం లేదు. సగటున మిరప రైతు ఈ ఏడాది ఎకరానికి రూ. 50 వేలకు పైగా నష్టం వస్తుంది. – పోతిని వెంకట్రావు, పోతనివారిపాలెం తెగుళ్లను నివారించలేక పోయాం ఈ ఏడాది మిరపకు విపరీమైన తెగుళ్లు వచ్చాయి. వీటిలో ప్రధానంగా బూడిద తెగులు, కొమ్మ ఎండు, పండు ఆకు తెగుళ్లు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కేవలం తెగుళ్ల మందులకే ఎకరానికి రూ. 30 – 35 వేల వరకు ఖర్చు చేశాం. అయినా తెగుళ్ళు నివారించలేకపోయాం. గత ఏడాది కొద్దిగా లాభాలు వస్తే ఈ ఏడాది అప్పటి లాభాలకు వడ్డీలతో కలుపుకొని నష్టపోయాం. – నక్కా రామకృష్ణ, రైతు కారంచేడు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి మిరప రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు తెగుళ్లను నివారించుకోవచ్చు. బూడిద తెగుళ్ళకు ఎకరానికి 1 లీటరు నీటిలో 2 గ్రాముల కోపరాక్సిక్లోరైడ్, ఇండెక్స్‌లను పిచికారి చేసుకోవాలి. కొమ్మ ఎండు, పండు ఆకు తెగుళ్లకు అమిస్టర్ లేదా, నోటీఓలను తరచుగా 1 లీటరు నీటిలో 2 గ్రాముల చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే కొంత ఉపసమనం ఉంటుంది. – కే శివనాగప్రసాద్, ఏడీఏ, పర్చూరు -
అరికెలు... ఆరుద్ర కార్తెలోనే విత్తాలి!
సిరిధాన్యాలు(అరికలు, అండుకొర్రలు, కొర్రలు, సామలు, ఊదలు) తింటే ఎంతటి జబ్బులనైనా పారదోలి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేవన్న చైతన్యం వ్యాపిస్తున్న కొద్దీ.. వీటి సాగుపై రైతులు, ముఖ్యంగా మెట్ట పొలాలున్న రైతులు దృష్టిసారిస్తున్నారు. విత్తనం నేలలో తేమ ఉన్నప్పుడు వేయాలి. మొలిస్తే చాలు బెట్టను కూడా తట్టుకొని చక్కని దిగుబడినివ్వగలిగే మెట్ట రైతుల మిత్ర పంటలివి. వీటి సాగులో కష్టం, ఖర్చూ రెండూ తక్కువే. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుకు రూపాయి కూడా నష్టం రాకుండా చూసే గ్యారంటీ పంటలు సిరిధాన్యాలు. ఈ 5 రకాలలో అరికలు ఒక్కటే ఆరు నెలల పంట. మిగతావి 3 నెలల్లోపు పంటలే. కాబట్టి, అరికలను వర్షాకాలం ప్రారంభంలోనే విత్తుకోవాలి. ఒకట్రెండు వర్షాలు పడి వాతావరణం చల్లబడిన తర్వాత ఆరుద్ర కార్తె(జూన్ ఆఖరు)లో అరికలు విత్తుకుంటే నిశ్చింతగా ఎకరానికి ఎటువంటి భూమిలోనైనా 8 క్వింటాళ్లు పండుతాయని కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అరికలతోపాటు అంతర పంటలను విత్తుకునే విధానాన్ని ఆయన వివరించారు. సిరిధాన్యాల సాగుకు భూమిని మే నెలలోనే చదును చేసుకోవాలి. ముంగారి (తొలి) చినుకులకు తొలి దుక్కి చేయాలి. తర్వాత వర్షాలకు కలుపు గింజలు మొలుస్తాయి. ఆ తర్వాత రెండో దుక్కి చేసుకుంటే మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. పశువుల ఎరువు వేయాలి. అవకాశం ఉంటే గొర్రెలు/పశువుల మంద కట్టుకోవాలి. పంటలు ఏవైనా తూర్పు– పడమర సాళ్లుగా విత్తుకుంటే చీడపీడల బెడద తప్పుతుంది. అరికలు 6 నెలల దీర్ఘకాలిక పంట. అరిక పంటను వర్షాధారంగానే సాగు చేయాలి. నీటి తడి పెడితే దిగుబడి తగ్గుతుంది. ఆరుద్ర కార్తెలోనే విత్తుకుంటే చలి రావడానికి ముందే పొట్ట దశ దాటిపోతుంది.. అరిక పొట్ట మీద ఉన్నప్పుడు చలి తగిలితే కాటుక తెగులు వస్తుంది.ఎకరానికి 3 కిలోల విత్తనం కావాలి. అరికలు 6 సాళ్లు విత్తిన తర్వాత ఒక సాలు కంది విత్తాలి. మళ్లీ 6 సాళ్లు అరకలు విత్తిన తర్వాత మరో సాలులో 5 రకాల(ఆముదాలు, అలసందలు/బొబ్బర్లు, అనుములు, గోగులు, సీతమ్మ జొన్నలు) విత్తనాలు కలిపి విత్తాలి. అంటే.. 6 సాళ్లు అరికలు – ఒకసాలు కందులు– 6 సాళ్లు అరికలు– ఒక సాలు 5 రకాల విత్తనాలు– మళ్లీ 6 సాళ్లు అరికలు... ఇలా మంచి పదునులో విత్తుకోవాలి. కొన్ని రకాలు కలిపి విత్తడం వల్ల ఏకదళ, ద్విదళ పంటలు పొలం నిండా ఉంటాయి. పంటల జీవివైవిధ్యం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు.. షుగర్‌ను, ఊబకాయాన్ని తగ్గించే ఆరోగ్యకరమైన, ఎంతో రుచికరమైన అరికలతోపాటు తినడానికి పప్పులు కూడా అందివస్తాయి. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే అరికల ధాన్యం ఎకరానికి ఎట్లా కాదన్నా 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా రూ. 3 వేలనుకున్నా రూ. 24 వేలు వస్తాయి. మిగతావి కూడా కలుపుకుంటే.. ఎకరానికి రూ. 40 వేలకు తగ్గకుండా రైతులకు ఆదాయం వస్తుందని సిరిధాన్యాల సాగులో అనుభవం ఉన్న విజయకుమార్ చెబుతున్నారు. మెట్ట పొలాలను రెండు సార్లు దున్ని విత్తనాలు చల్లి.. ఒకటి రెండు సార్లు పైపాటు/అంతర సేద్యం చేస్తే చాలు. అరికలు మొలిచిన చోట గడ్డి కూడా మొలవదు. ఒక్కసారి మొలిస్తే చాలు వర్షం సరిగ్గా కురిసినా లేకపోయినా మొండిగా పెరిగే పంట అరిక. ఎకరానికి ట్రాక్టర్ అరిక గడ్డి వస్తుంది. గడ్డి అమ్ముకుంటే సాగుకు అయిన ఖర్చు కన్నా ఎక్కువే ఆదాయం వస్తుంది. రైతుకు నష్టం రానే రాదు. ఎత్తు పల్లాల భూమిలో వర్షాలకు మట్టి కొట్టుకుపోకుండా అరిక పంట బాగా ఉపయోగపడుతుందని విజయకుమార్ వివరించారు. ఆయనను 79814 07549 నంబరులో సంప్రదించవచ్చు. ఏపీ రైతులు ఉ. 5–9 గం. మధ్య, కర్ణాటక రైతులు మ. 1–3 గం. మధ్య, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య ఫోన్ చేయవచ్చు. -
ధాన్యం.. దైన్యం
రబీ డీలా ♦ దిగుబడులు లేక కొనుగోలు కేంద్రాలు వెలవెల ♦ గతేడాది కొనుగోళ్లు 96 వేల మెట్రిక్ టన్నులు ♦ ఈసారి కేవలం 34 వేల మెట్రిక్ టన్నులే ♦ కరువు తీవ్రతకు దర్పణం మెతుకుసీమలోనే ఈ దుస్థితి కరువు కాటేసింది... దిగుబడులు లేక రైతన్న చతికిల పడ్డాడు. ఉత్పత్తులు రాక మార్కెట్లు డీలాపడ్డాయి. ఒకప్పుడు వరి ధాన్యం దిగుబడులతో మెతుకుసీమగా ఖ్యాతిగడించిన మెదక్ జిల్లాలో నేడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరుస కరువులతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. బోరు బావుల ఆధారంగా సాగు చేసే ‘వరి’కి గడ్డురోజులొచ్చాయి. ఈ క్రమంలో ఏటా వరి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. మరోవైపు అకాల వర్షాలు ఏటా చేతికొచ్చే దశలో పంటను దెబ్బతీస్తూ.. కొద్దిపాటి ఉత్పత్తులు కూడా అందకుండా చేస్తున్నాయి. గతేడాది రబీ సీజన్లో జిల్లాలో 96 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వస్తే.... ఈసారి రబీలో కేవలం 34 వేల మెట్రిక్ టన్నులకే పరిమితం కావడం జిల్లాలోని కరువు పరిస్థితికి అద్దం పడుతుంది. గజ్వేల్: జిల్లాలో 2015-16 రబీలో వరి 48,476 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గాను 22,662 హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చింది. వరుస కరువు, వర్షాభావంతో భూగర్భ జలమట్టం భారీగా పడిపోవడంతో వరికి శాపంగా మారింది. వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. మరోవైపు చేతికందే దశలో అకాల వర్షాలు, వడగళ్లు రైతును మరింత కుంగదీశాయి. ఫలితంగా ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. నిజానికి 22,662 హెక్టార్లలో పంట సక్రమంగా పండితే సుమారు 15 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు వచ్చేవి. కానీ నేడు జిల్లాలో ఇప్పటివరకు 3.4 లక్షల క్వింటాళ్లు (34 వేల మెట్రిక్ టన్నులు) మాత్రమే కేంద్రాల్లో నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఈసారి 44 ఐకేపీ, 53 సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఐకేపీ కేంద్రాల్లో 3843 మంది రైతులు, సహకార సంఘాల కేంద్రాల్లో 7,120 మంది రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకున్నారు. ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1,450, ‘బీ’ గ్రేడ్ రకానికి రూ.1,410 మద్దతు ధరగా చెల్లిస్తున్నది. గతేడాది 37 వేల హెక్టార్లలో వరి సాగైంది. ఐకేపీ ద్వారా 70, సహకార సంఘాల ద్వారా 58 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 35శాతం కూడా ఉత్పత్తులు రాకపోవడం జిల్లాలో నెలకొన్న దయనీయ పరిస్థితులను చాటుతోంది. గజ్వేల్ యార్డులో గతేడాది.. గజ్వేల్ మార్కెట్ యార్డులో గతేడాది ఏర్పాటు చేసిన సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో 30 వేల క్వింటాళ్లకుపైగా వడ్లను కొనుగోలు చేస్తే ఈసారి 7 వేల క్వింటాళ్లకే పరిమితమైంది. యార్డులో పెద్దగా సందడిలేదు. నిష్ర్కమించిన ప్రభుత్వ సంస్థలు.. జిల్లాలో వరి ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. రాబోవు రోజుల్లో ఈ పంట కనుమరుగవుతుందేమోనన్న ఆందోళన నెలకొంది. చేతికందే కొద్దిపాటి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందడ ం కూడా పోతోంది. తూకాల్లో మోసాలు కూడా శాపంగా మారుతుంది. గతంలో జిల్లాలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో గజ్వేల్, సిద్దిపేట, తొగుట, మెదక్ తదితర చోట్ల ఎనిమిదివరకు కొనుగోలు కేంద్రాలను నాలుగేళ్ల క్రితం వరకు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఆ కేంద్రాలను పూర్తిగా ఎత్తేశారు. కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సొసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమవుతోంది. గతంలో సివిల్ సప్లయ్, ఎఫ్‌సీఐ కేంద్రాల్లో కచ్చితత్వం ఉండేది. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలి తాలు రావడం లేదనే అభిప్రాయం నెలకొం ది. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5 శాతం కమీషన్ ఇస్తున్నారు. ఈ సంస్థలకు మార్కెట్ యార్డులున్న చోట మార్కెటింగ్ శాఖ అధికారులు సమకూరుస్తుండగా మిగితాచోట్ల ఆ సంస్థలే సమకూర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాల కల్పన భారంగా మారుతున్నది. ఈ విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నారు. కాలం కలిసి రాక లాసైన.. నేను నాలుగెకరాల్లో వరి సాగు చేసిన. రెండు బోర్లున్నయ్. రెండేండ్ల సంది వానలు సరిగాలేక బోర్లలో నీళ్లు రాలేదు. వచ్చిన కొద్దిపాటి నీళ్లు వరికి సరిపోలే. పంట ఎంతో నష్టపోయిన. చేతికందే దశలో వడగండ్ల వాన మరింత నష్టం చేసింది. కాలం కలిసొస్తే నాకు వంద కింటాళ్ల ఒడ్లు వచ్చేవి. కానీ... 50 కింటాళ్లు మాత్రమే ఒచ్చినయ్. పెట్టుబడి కూడా సక్కగ ఎళ్లలేదు. మాకష్టమంతా మట్టిల పోయింది. వరుసగా నష్టాలే ఒస్తున్నయ్. తలుసుకుంటే దుఃఖమొస్తుంది. - ఆకుల సుధాకర్, రైతు, జాలిగామ, మం: గజ్వేల్ పంట కరాబైంది.. నేను మూడెకరాల పొలంలో వరి ఏసిన. బోర్లు సక్కగ పొయ్యలె. పంట చేతికొచ్చే టైంల రాళ్లవాన పడ్డది. పంటంతా కరాబైపోయింది. కొద్దిపంటనే చేతికొచ్చింది. పెట్టుబడి రాక కష్టంగా ఉంది. ఏం జేయాలె. మా బాధలు ఎవలకు జెప్పుకోవాలే..? - తలకొక్కుల మల్లేశం, రైతు, పాములపర్తి, మం: వర్గల్ -
ఖరీఫ్ ప్లాన్ షురూ
ఈ సారి టార్గెట్ 2.05 లక్షల హెక్టార్లు 1.05 లక్షల హెక్టార్లలో వరి 37 వేల హెక్టార్లలో చెరకు 42 వేల హెక్టార్లలో మిల్లెట్స్ 17 వేల హెక్టార్లలో అపరాలు పంటల వివరాల సేకరణకు 17 నుంచి గ్రామ సభలు గతేడాది రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించడం.. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయన్నవాతావరణ శాఖ తీపి కబురు నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు రైతులు ఉద్యుక్తులవుతున్నారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌పై మరో పక్క వ్యవసాయశాఖ కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. తొలుత గ్రామాల వారీగా వ్యవసాయ సమగ్ర స్వరూపంతో కూడిన ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించింది.ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడులు, విత్తనాలు,ఎరువులు, భూసార పరీక్షలు, వ్యవసాయ యాంత్రీకరణ తదితర వాటిపై ప్రత్యేకదృష్టి సారించాలని నిర్ణయించారు. విశాఖపట్నం: రానున్న ఖరీఫ్‌లో కనీసం 2.06 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 1,99,813 హెక్టార్లు కాగా, గతేడాది 2,08,988 హెక్టార్లలో సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆచరణలోకొచ్చేసరికి 1.75 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. దాంట్లో ప్రధానంగా వరి 1.06 లక్షల హెక్టార్లకు 1.03 లక్షల హెక్టార్లు, చెరకు 35,573 హెక్టార్లకు 34వేల హెక్టార్లలో సాగుచేశారు. మిగిలిన పంటల మాటెలాగున్నా వరిలో మాత్రం ఊహించని దిగుబడి సాధించగలిగారు. ఎకరాకు 30కి పైగా బస్తాలతో 3.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధించారు. ఇదే ఉత్సాహంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో తొలకరి పంట (ఖరీఫ్)కు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. పంటల ప్రణాలిక ఇలా.. 1.05 లక్షల హెక్టార్లకు తక్కువకాకుండా వరి, 37వేల హెక్టార్లలో చెరకు, 42 వేల హెక్టార్లలో మిల్లెట్స్ (చిరుధాన్యాలు) 17వేల హెక్టార్లలో అపరాలు సాగు చేయాలని నిర్ణయించారు. గతేడాది ఆరువేల హెక్టార్లలో మాత్రమే సాగు చేసిన పచ్చిరొట్టను ఈ ఏడాది15 వేల హెక్టార్లలో సాగుచేయాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ ఏడాది కనీసం 10 శాతం చెరుకు సాగు విస్తీర్ణంలో కనుపు సాగుకు అవసరమైన సహకారాన్ని రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది తొలిసారిగా 40 వేల హెక్టార్లకు సూక్ష్మ పోషకాలు అందించాలని టార్గెట్ పెట్టుకున్నారు. గతేడాది 27వేల హెక్టార్లకే ఇవ్వ గలిగారు. ఖరీఫ్‌లోగా 28,612 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 33వేల హెక్టార్లకు సరిపడా వరివిత్తనాలు, 150 క్వింటాళ్ల చోళ్లు, 450 క్వింటాళ్ల అపరాలు, 251 హెక్టార్లకు సరిపడా చెరుకు కనుపులు సిద్ధం చేస్తున్నారు. కాని ఇవి ఏమూలకు సరిపోవని రైతులంటున్నారు. కనీసం 50 శాతం విత్తనాలైనా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో రూ.840 కోట్లు రుణాలివ్వగా, ఈ ఏడాది రూ.1050 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. గ్రామాల వారీగా కసరత్తు గ్రామాల వారీగా పంటల వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహిస్తోంది. ఇందుకోసం మల్టీపర్పస్ ఎక్సెటెన్షన్ అధికారులకు ప్రత్యేకంగా టాబ్స్‌ను ఇస్తున్నారు. వీటి ద్వారా గ్రామాల వారీగా ఏఏ పంటలు ఏ మేరకు సాగవుతున్నాయి? వాటికి ఏ మేరకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అవసరమవుతాయి? వంటి అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకంపై ఈ సభల్లో రైతులకు అవగాహన కల్పించి కనీసం 50 శాతం మందిని ఈ పథకంలో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఈసారి ప్రకృతి సేద్యం.. సేంద్రీయ సేద్యం చేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు జేడీ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఇలా సేకరించిన వివరాలను నిర్ణీత ఫార్మెట్లో అప్లోడ్ చేస్తామన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు పరిస్థితిని బట్టే ఈసారి విత్తనాలు, ఎరువులు, యాంత్రీకరణ యూనిట్లు మంజూరవుతాయని ఆయన చెప్పారు. -
వర్షాలు కురుస్తున్నా దిగుబడి సగమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసిన పంటలు పూర్తిస్థాయిలో చేతికి అందడం కష్టమేనని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వర్షాలు ఆలస్యమైనందున అవి చాలా చోట్ల ఎండిపోయాయని... ప్రస్తుత వర్షాలకు పూర్తిగా కోలుకోవడం అసాధ్యమని వ్యవసాయశాఖ నిర్ధారణకు వచ్చింది. వర్షాలు, పంటల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం సమీక్షించారు. వివిధ శాఖల అధికారులతో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డితోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొంతభాగం పంటల ఎదుగుదల ఉండదని తేల్చిన వ్యవసాయ శాఖ దీంతో పంటల దిగుబడి తగ్గుతుందని పేర్కొంది. ఖమ్మం, ఆదిలాబాద్‌లలో మాత్రమే పంటల పరిస్థితి ఆశాజనకంగా ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లోని పత్తి, మొక్కజొన్న ఎండిపోయిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పటికీ వేసిన పంటల దిగుబడి సగానికి తగ్గుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. అయితే ఈ వర్షాలు ముందస్తు రబీ పంటలకు ప్రయోజనకరంగా ఉంటాయని అంటున్నారు. పాడి పరిశ్రమకు, పశుగ్రాసానికి కొరత ఉండదని... భూగర్భ జలాలు పెరుగుతాయనే ఆశాభావంతో ప్రభుత్వం ఉంది. వారం రోజుల్లో మరో అల్పపీడనం ఉందని... దీంతో దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొన్నట్లు తెలిసింది. నిజామాబాద్‌లో 13 సెంటీమీటర్ల వర్షం... గత 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్‌లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. మక్లూర్లో 9, డిచ్పల్లి, వెంకటాపురం, ఏటూరునాగారం, నావీపేట్‌లలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
కూరగాయలకూ కష్టమే..!
రాష్ట్రంలో కరువు ప్రభావం కూరగాయల సాగుపైనా పడింది. తెలంగాణలో ‘వెజిటబుట్ హబ్’గా ఆవిర్భవించిన మెదక్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి కరువు తీవ్రతను కళ్లకు కడుతోంది. ఈ జిల్లాలో సాధారణంగా దాదాపు 50 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతుంటాయి. కానీ ఈసారి వర్షాభావం కారణంగా కూరగాయల రైతులు కుదేలయ్యారు. దిగుబడులు భారీగా తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం రంగారెడ్డి జిల్లాలోనూ కూరగాయల రైతులను దెబ్బ తీసింది. ఖరీఫ్ సీజన్లో ఇక్కడ 25 వేల హెక్టార్లలో కూరగాయలు సాగవుతాయి. సీజన్ ప్రారంభంలో వర్షాలు మురిపించడంతో రైతులు దాదాపు 15 వేల హెక్టార్లలో సాగు మొదలుపెట్టారు. కానీ వర్షాలు ముఖం చాటేయడం, భూగర్భజలాలూ తగ్గిపోవడంతో టమాటా, క్యారెట్, బీట్రూట్ పంటలు దెబ్బతిన్నాయి. చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి మండలాల్లో పంటల ఎదుగుదల నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా టమాట, మిర్చి పంటలు వేసినా.. మొలక దశలోనే వాడిపోతున్నాయి. ముఖ్యంగా గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, జైనథ్ మండలాల్లో టమాటా ఎండిపోయింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పాలమూరు జిల్లాలోనూ కూరగాయల సాగును వర్షాభావం కోలుకోలేని దెబ్బతీసింది. మరోవైపు కూరగాయల కొరత కారణంగా హైదరాబాద్ నగరంలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నా.. హైదరాబాద్ అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. అసలు ప్రపంచ ఆహార సంస్థ నియమావళి ప్రకారం ఒక్కో వ్యక్తికి రోజుకు 250 గ్రాముల కూరగాయలు వినియోగించాలి. ఈ లెక్కన నగరంలోని జనాభాకు సుమారు 2,500 టన్నులు అవసరమని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అంచనా వే యగా... ప్రస్తుతం రోజుకు 1,600 టన్నులే సరఫరా అవుతున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. -
కందిపోయిన దిగుబడి కలిసిరాని రాబడి
ధర చూసి మురిసిపోవాలో.. దిగుబడి చూసి దిగాలు చెందాలో.. అర్థం కాని పరిస్థితి కంది రైతులది. గతేడాది గణనీయంగా ఉన్న దిగుబడి.. ఈసారి అదే స్థారుులో దిగజారింది. ఆ సమయంలో మద్దతు ధరకు నోచుకోని రైతులు.. ఇప్పుడేమో వ్యాపారులు ముందు చూపుతో మద్దతు ధరకు మించి అదనంగా రూ.వెయి చెల్లిస్తున్నారు. గతేడాది ఎక్కువ దిగుబడి వస్తే క్వింటాల్‌కు రూ.3,900 నుంచి రూ.4,600లోపు చెల్లించి కొనుగోలు చేశారు. ఈసారి ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా దిగుబడి రాకపోవడంతో మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,350కి అదనంగా రూ.వెరుు్య వరకు చెల్లిస్తున్నారు. - కంది ధర పెరిగినా.. దిగుబడి రాని వైనం - మద్దతు ధర కంటే అదనంగా రూ.1000 వరకు.. ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి సగానికి పైగా పడిపోయింది. వీటిలో కంది దిగుబడి కూడా గణనీయంగా తగ్గింది. పంట ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉన్నా.. 3 నుంచి 4 క్వింటాళ్లు దాటలేదు. ఈ పంటకు వ్యవసాయ మార్కెట్ యూర్డులో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,350 ఉండగా.. ఈ ధర కంటే అదనంగా మరో రూ.వెరుు్య వరకు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఎక్కువ దిగుబడి రావడంతో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.3,900 నుంచి రూ.4,600 లోపు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.5,000 నుంచి రూ.5,600 వరకు చెల్లిస్తున్నారు. దిగుబడి తగ్గి వినియోగం పెరుగుతుం దనే కారణంతోనే ఇక్కడ మద్దతు ధర పెంచినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర మార్కెట్ ఇంధన్ఘడ్లో ఎక్కువ ధర చెల్లిస్తుండడంతో ఇక్కడా మద్దతు ధరకు రెక్కలొచ్చాయని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో కంది పంట 43,350 హెక్టార్లలో సాగు చేశారు. దీని ప్రకారం జిల్లాలో ఆశించినంత వర్షాలు కురిస్తే సుమారుగా ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల చొప్పున మొత్తం మూడున్నర నుంచి నాలుగు లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ.. రెండు లక్షలు కూడా దాటలేదు. గతేడాది ఇదే సమయూనికి ఆదిలాబాద్ మార్కెట్ యూర్డులో వ్యాపారులు 47,980 క్వింటాళ్లు కొనుగోలు చేయగా.. ఈసారి 7,102 క్వింటాళ్లు మాత్రమే వచ్చారుు. వర్షాభావ పరిస్థితులే కారణం.. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో విత్తుకున్న పంటలు వర్షాలు లేక మొలకెత్తలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు, మూడేసి సార్లు విత్తారు. పంట కాలం పూర్తరుునా జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. 1094 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను.. 746 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులే స్వయంగా జిల్లాలో 52 మండలాలకు గాను 40 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. వర్షాభావంతో వాణిజ్య పంటలతోపాటు ఆహారధాన్యాల పంటలైన వరి, కంది, పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, తదితర పంటల దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో దిగుబడిపై ప్రభావం.. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం, పప్పు దినుసుల ధరలు భగ్గుమంటున్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నారుు. అందుకే.. ప్రస్తుతం వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఒక్క మార్కెట్లోనే కొనుగోళ్లు.. జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్లు ఉండగా.. ఎక్కువగా సాగు చేసే ప్రాంతాలకు అనుగుణంగా ఏటా నిర్మల్, భైంసా, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరుగుతాయి. ఆయూ ప్రాంతాల్లో పంట దిగుబడి ఎక్కువగా రాకపోవడంతో నిర్మల్, భైంసా మార్కెట్యూర్డుల్లో కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఒక్క ఆదిలాబాద్ మార్కెట్లో మాత్రమే కొనుగోళ్లు చేపడుతున్నారు. దిగుబడి సగానికి తగ్గింది.. పోయినేడు పదెకరాలు సోయా పంటలో అంతర పంటగా కంది సాగు చేసిన. 13 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది పదెకరాలు సాగిచేసినా. అరుునా.. 4 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే పండింది. పోయేనేడు ధర తక్కువగా ఉండే. ఈసారి ధర ఎక్కువగా ఉంది. కానీ.. పంట సగం వరకు ఎండిపోయింది. - సంతోష్, గిరిగాం, తాంసి మండలం ధర ఎక్కువ.. దిగుబడి తక్కువ.. చేనులో పంట దిగుబడి తగ్గింది. మార్కెట్లో ధర మాత్రం పెరిగింది. కానీ.. ఈ ఏడాది విత్తనం, ఎరువుల, కూలీల ధర గతం కంటే ఎక్కువగా ఉంది. వర్షాలు లేక పంట దిగుబడి బాగా తగ్గింది. ధర చూసి సంబరపడాలో పంట దిగుబడి చూసి ఏడవలో అర్థం కావడం లేదు. నాలుగెకరాల్లో 10 క్వింటాళ్ల వరకు రావాల్సింది. మూడున్నర క్వింటాళ్లకు తగ్గింది. - గంగుల నర్సింగ్, రమాయి గ్రామం, ఆదిలాబాద్ మండలం -
చెరకు చేదే
నారాయణఖేడ్ రూరల్: చెరకు రైతులకు ప్రతీఏడు చేదు పరిస్థితులే మిగులుతున్నాయి. తాము పండించిన పంటకు సరైన గిట్టుబాటుకు విక్రయించుకొనే పరిస్థితి చెరుకు రైతుకు లేకుండా పోతుంది. యాజమాన్యాలు నిర్ణయించిన ధరకే రైతులు పంటను అమ్మాల్సిన పరిస్థితి. ప్రతీ ఏడు పంటసాగుకు తీవ్ర ఇబ్బందులు, పెట్టుబడులు పెరిగిపోవడం పరిపాటిగా మారుతున్నా పంట విక్రయించే సరికి మద్దతు ధర లభించడంలేదు. రెండు మూడేళ్ళుగా ఒకే ధర ఉండడం రైతులకు ఆశనీపాతంగా మారుతోంది. ఈ ఏడు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు తోడు విపరీతమైన కరెంటు కోతలు. ఫలితం సాగుచేసిన చెరకు పంటకు సరిపడా నీరందడం లేదు. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ చెరకుకు మాత్రం గత ఏడాది ఇచ్చిన ధరనే ఇస్తామని కర్మాగార యాజమాన్యం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈనెల 9న క్రషింగ్‌ను ప్రారంభించింది. రైతులు టన్నుకు రూ.3,500ల చొప్పున ధర చెల్లించాలని కోరుతున్నా యాజమాన్యం మాత్రం రూ.2,600లు చెల్లిస్తామని ప్రకటించింది. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి వద్ద ఉన్న గాయత్రి షుగర్స్ పరిధిలోకి వస్తారు. కష్టానికి దక్కని ఫలితం మాగి గాయత్రి షుగర్స్ కర్మాగారం పరిధిలో మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, కల్హేర్, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, కంగ్టి మండలాలు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, మద్నూర్, బిచ్కుందు మండలాల నుంచి చెరకు అగ్రిమెంట్ అయింది. ఈ కర్మాగారంలో కేవలం నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోనే 12వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకు కర్మాగారానికి వెళ్తుంది. అంటే సాగైన చెరకులో 90 శాతం ఈ కర్మాగారానికే అగ్రిమెంట్ అయింది. నిజామాబాద్ జిల్లాలో కేవలం 3,500ల ఎకరాలలోపే చెరకు కర్మాగారానికి తరలుతుంది. కర్మాగారం నిర్ణయించిన ధర ప్రకారం ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. అందునా పె ట్టుబడులు కూడా అధికమయ్యాయని అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో చెరకు సాగుకు రూ.60 వేల నుంచి రూ.80వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలిపారు. దిగుబడులు మాత్రం 20 నుంచి 30 టన్నుల లోపే వస్తుందని తెలిపారు. ఈ లెక్కన కర్మాగారం ద్వారా టన్నుకు రూ.2,600ల చొప్పున చెల్లిస్తే కనీస పెట్టుబడే దక్కుతుందని రైతులు అంటున్నారు. రూ.3,500లు చెల్లించిన పక్షంలో తమకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఇది ఏడాది పంట కావడంతో యాజమాన్యం చెల్లించే ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ పెట్టుబడులను కూడా అప్పులు చేసి సాగు చేసినట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతానికి.. నేటికీ భిన్నత్వం చెరకు సాగులో గతంలో లాభసాటిగా ఉండగా రాను రాను చెరకు సాగు రైతులకు గుదిబండలా మారుతుంది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం ఈ దుస్థితికి కారణమని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం రంగంలో చెరకు కర్మాగారాలు ఉన్నపుడు కేంద్ర ప్రభుత్వం ఎస్ఎంపీ ధర ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రోత్సాహకాలను అందించేదని రైతులు పేర్కొం టున్నారు. దీంతో ప్రైవేట్ కంపెనీలూ ఇదే ధరను చెల్లించేవి. ఫలితంగా రైతులకు గిట్టుబాటయ్యేది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం రైతులకు ఇబ్బందికరంగా తయారయింది. ఫలితంగా రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. ప్రతీఏటా చెరకు రైతులకు ధర విషయంలో ఇబ్బందులే ఏర్పడుతున్నాయి. క్రషింగ్ ప్రారంభ సమయం దగ్గర పడుతుండడం, రైతులు గిట్టుబాటు ధర చెల్లించాలని విన్నవించడం పరిపాటిగా మారుతోంది. పెట్టుబడుల్ని దృష్టిలో పెట్టుకోవాలి మెదక్ రూరల్: నిజాం దక్కన్ షుగర్(ఎన్డీఎస్ఎల్) ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరకు టన్ను ధర రూ. 3,500 చెల్లించాలి. రైతులు వరిని వదిలేసి చెరకు తోటలను కాపాడుకున్నారు. ప్రతి ఏడాది రసాయన ఎరువుల ధరలు పెరగడంతో పాటు కూలీల రేట్లు, రవాణా చార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. సాగుకు పె రుగుతున్న ఖర్చుల ను దృష్టిలో పెట్టుకొ ని గిట్టుబాటు ధర చెల్లించాలి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి రైతుల్ని ఆదుకోవాలి. క్రషింగ్‌ను సైతం సకాలంలో ప్రారంభించి రైతులు నష్టపోకుండా చొరవ చూపాలి. -టీపీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి -
పంటమార్పిడితో ప్రయోజనం
నిజామాబాద్ వ్యవసాయం : ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వేస్తూ ఉంటే దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. చాలామంది రైతులు నేటికీ ఒకేరకమై పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుందని జేడీఏ నర్సింహా తెలిపారు. రబీలో ఆలస్యంగా సాగుచేస్తున్న రైతులకు ‘పంటమార్పిడి విధానం’పై పలు సూచనలు చేశారు. అవగాహన అవసరం పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది. దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఒకరిని చూసి మరొకరు వేసిన పంటేనే వేస్తూ నష్టాలపాలవుతున్నారు. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల చీడపీడల బెడద అస్పలుండదు. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర తెగుళ్లను దూరం చేయవచ్చు. బీజాలు వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి ఎక్కువవుతుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందవు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. రైతులు గమనించాల్సినవి భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. జాగ్రత్తలు పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలను వేయడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు. పత్తి పైరు సాగు చేసిన నేలలో మినుము, పెసర వంటి పం టలతో మార్పు చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గించవచ్చు. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించాలి. దీని వల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు. పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీని వల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గానీ నూనె గింజల పైర్లనుగాని పండించడం వల్ల వరి పంటను ఆశించే టంగ్రో వైరస్, దోమ పోటులను సమర్ధంగా నివారించవచ్చు. పెసర గాని పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే తర్వాత వేరుశనగ పంటలు వేసుకోవాలి. సూచనలు జొన్న సాగు తర్వాత మళ్లీ అదే పంట వేయొద్దు. దీని వల్ల ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించవచ్చు. వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, మినుము, పెసర పంటలు వస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. -
బిందు సేద్యం.. సిరులు సాధ్యం
మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలూ మారాలి.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి.. సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ.. కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకుని.. ఆదర్శ వ్యవసాయం చేయాలి. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు.. అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే ‘బిందు సేద్యం’.. మరి ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న చేయూతను పరిశీలిద్దామా.. ► డ్రిప్పు పద్ధతితో.. నాణ్యమైన దిగుబడులు, అధిక లాభాలు ►మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచిత అవకాశం ►బీసీ, ఓసీలకు తొంభై శాతం సబ్సిడీ చేర్యాల తులసీదాస్, నంగునూరు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఆరు తడి పంటలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో బిందు సేద్యం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. డిప్పు పద్ధతిన ఆరుతడి పంటలు సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందవచ్చని మైక్రో సిబ్బంది చెబుతున్నారు. బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిచవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా యూరియా, డీఏపీ వంటి ఎరువులను ఈ పద్ధతిలో సులువుగా వేసుకోవచ్చని పేర్కొం టున్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్’ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు తొంభై శాతం రాయితీ ప్రకటించిం ది. ఐదు నుంచి పది ఎకరాలలోపు ఉన్న రైతులకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. ఈ లెక్కన ఎక రం పొలం ఉన్న రైతులకు రూ. 50 వేలకు గాను రూ. 6 వేలు, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.10 వేలు చెల్లిస్తే లక్ష రూపాయల విలువైన పరికరాలను అందజేస్తారు. పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ రాయితీ పొందని ప్రతీ రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి మైక్రో ఇరిగేషన్ పీడీ డ్రిప్పును మంజూరు చేస్తారు. ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి ►ప్రతి మండలానికి ఒక మైక్రో ఇరిగేషన్ ఏరియా కో ఆర్డినేటర్ ఉంటారు. ► అతని వద్ద లభించే ఫారాన్ని తీసుకుని వివరాలను పూరించాలి. ► మీ సేవా కేంద్రం నుంచి 1బీ, ఆధార్ లేదా రేషన్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు, భూమికి సంబంధించిన సర్వే నక్షా కాపీలను దరఖాస్తు ఫారానికి జతచేయాలి. ►ఎస్సీ, ఎస్టీలైతే మీ సేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ►డ్రిప్పు మంజూరైన రైతు పీడీ టీఎస్ ఎంఐపీ పేరిట డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) తీసి అధికారులకు అందజేయాలి. ఏ పరికరాలు అందజేస్తారు. ►బోరు మోటర్లు ఉన్న రైతులకు స్క్రీన్ఫిల్టర్, వ్యవసాయ బావులు ఉన్న రైతులకు సాండ్ఫిల్టర్తో కూడిన డ్రిప్పు అందజేస్తారు. ►హెడ్యూనిట్ పరికరాల్లో ల్యాట్రల్, పీవీసీ మెయిన్ లైన్, సబ్ లైన్ కంట్రోల్ వాల్వ్స్, ఎయిర్ రిలీజ్ వాల్వ్, ప్రెజర్ క్రేజ్. ఇస్తారు. ►యూరియా కలుపుకోవడానికి ట్యాంక్, వెంచూరిలు కూడా అందజేస్తారు. ►21 రకాల కంపెనీలకు చెందిన పైపులు అందుబాటులో ఉన్నాయి. రైతులు కోరిన కంపెనీ పైపులను అందజేస్తారు. ►కంపెనీకి చెందిన వ్యక్తులు రైతు భూమిని సర్వే చేసి డ్రిప్పును బిగించి సలహాలు, సూచనలు అందజేస్తారు. ►వీరు బిగించిన పరికరాలకు 5 సంవత్సరాల పాటు కంపెనీ వారంటీ ఉంటుంది. ఏ పంటలు సాగు చేసుకోవచ్చు ►ఆరుతడితోపాటు అన్ని రకాల పంటలను ఈ విధానం ద్వారా పండిచుకోవచ్చు. ►మామిడి, బొప్పాయి, అరటి, ద్రాక్ష, సపోట, దానిమ్మ, అరటి, మల్బరీ, జామ, సీతాఫలం తదితర తోటలు.. ►వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, వేరుశనగ (పల్లి), చెరకు, అల్లం, పసుపు, బంగాళదుంప, మిరప, కూరగాయ పంటలకు ఇది ఎంతో సౌకర్యవంతమైనది. డ్రిప్పు వల్ల ఉపయోగాలు ►ఎత్తుపళ్లాలు ఉన్న భూములు, గరప నేలల్లోనూ బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయొచ్చు. ►50 శాతం నీరు ఆదా అవుతుంది. ►కలుపు, చీడ పీడల బెడద ఉండదు. ►కూలీల కొరతను సులువుగా అధిగమించ వచ్చు. ►20 నుంచి 30 శాతం నాణ్యమైన, అధిక దిగుబడి పొందవచ్చు. ►ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చు. ఫోన్ చేస్తే మేమే వస్తాం ఆరుతడి పంటలకే కాకుండా అన్ని రకాల పంటలకు డ్రిప్పు బిగించుకోవచ్చు. దీని ద్వారా పంటలు పండిస్తే నీరు, ఫెర్టిలైజర్ నేరుగామొక్కలకు అందడంతో 15 నుంచి 20 శాతం ఎక్కువ దిగుబడులు వస్తాయి. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఏ రైతుకు డ్రిప్పు కావాలన్నా ఫోన్ చేస్తే చాలు.. స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారాలు అందజేసి డ్రిప్పు మంజూరు చేయిస్తాం. ఇదే కాకుండా రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ డ్రిప్పు వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. - అర్జున్, సిద్దిపేట నియోజకవర్గ ఏరియా కో ఆర్డినేటర్, ఫోన్: 8374449858 -
‘పంట’ పండిస్తాం!
యాచారం: కూరగాయల పంటల సాగును ప్రోత్సహిస్తే గణనీయమైన దిగుబడులు తీసి చూపిస్తామంటున్నారు యాచారం మండలంలోని రైతులు. మండలంలోని మొండిగౌరెల్లి, యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల, గడ్డమల్లయ్యగూడ, తమ్మలోనిగూడ, తాడిపర్తి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో వందలాది మంది రైతులు కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. వీరికి దశాబ్దాలుగా ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకుండాపోతోంది. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం, ఒకవేళ ఉన్నా వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లు నిర్ణయించి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. దీంతో కొందరు రైతులు యాచారం, మాల్ మార్కెట్లకు దిగుబడులు తీసుకెళుతుం డగా.. మరికొందరు నగరంలోని సరూర్‌నగర్ రైతు బజారు, మాదన్నపేట తది తర మార్కెట్లకు తరలిస్తున్నారు. నాలుగేళ్లుగా ఇబ్రహీంపట్నంలో రైతుబజారు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడమే గానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు. రైతులకు సకాలంలో కూరగాయల విత్తనాలు సైతం అందడంలేదు. పాత పద్ధతుల్లోనే పంటల సాగు ప్రభుత్వ పోత్సాహం లేకపోవడంతో ఇక్కడి రైతులు ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే కూరగాయల పంటల సాగు చేస్తున్నారు. చౌదర్‌పల్లిలోని పలువురు రైతులు మాత్రమే పందిర్లపై కూరగాయల సాగు, డ్రిప్ సౌకర్యాంతో మంచి దిగుబడి తీస్తున్నారు. కానీ మిగతా గ్రామాల్లో రైతుల కాల్వల ద్వారా నీరు పారించి పంటలు సాగు చేస్తున్నారు. సంబంధిత అధికారులను కలిసి ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసేలా సౌకర్యాలు కల్పించాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం జిల్లాను కూరగాయల జోన్‌గా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
ఆవున్న చోటే అన్నముంది!
ప్రతి ఏటా దాళ్వాకు విరామం! ఆరు ఆవులతో 28 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం.. భూమికి విశ్రాంతి కోసం దాళ్వా వరి సాగుకు ప్రతి ఏటా సెలవు! సార్వాలో మాత్రమే వరి సాగు.. వినియోగదారులకు నేరుగా ముడి బియ్యం అమ్మకం ద్వారా ఎకరానికి రూ. 40 వేల నికరాదాయం ఒక్కో దేశీ ఆవు ద్వారా రూ. 40 వేల సాగు ఖర్చులు ఆదా! ‘వ్యవసాయం పరమ లక్ష్యం అధికంగా పంట దిగుబడులు నూర్చడం కాదు.. మంచి మనసు గల మనుషులున్న సమాజాన్ని నిర్మించడం..’ అంటాడు సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా. నాచుగుంటలోని భూపతిరాజు రామకృష్ణంరాజు(65) వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే ఈ మాటలకు అర్థం ఏమిటో కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. భూమిని తల్లిగా కొలిచే రైతుగా గత ఏడేళ్లుగా వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన గోఆధారిత వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ.. మొదట్లో జీవామృతం వాడినా.. ఇప్పుడు ఏ ఎరువూ వేయకుండా ఎకరానికి 29 బస్తాల విష రహిత ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. 5-10 ఏళ్లు జీవామృతం వాడిన పొలంలో ఏ ఎరువూ వేయకుండానే పంటలు పండించొచ్చని రుజువు చేశారు. తను చేయడమే కాకుండా తోటి రైతులకు జ్ఞానాన్ని పంచి.. పచ్చని బతుకు దారి చూపుతున్నారు. ‘పిచ్చి రాజు.. పిచ్చి పంట..’ అని ఎగతాళి చేసిన రైతులే ఇప్పుడు అనుసరిస్తున్నారు! అత్యాశకు పోయి రసాయనిక వ్యవసాయంతో భూమిని సర్వనాశనం చేసుకోవడం రైతు తనకు తాను ద్రోహం చేసుకోవడమేనని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు భూపతిరాజు రామకృష్ణంరాజు(65) ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రకృతిని ఉపయోగించుకుంటూనే ప్రకృతి పరిరక్షణకు దోహదపడే రీతిలో రైతు జీవన విధానం, పంటల విధానం ఉండాలంటారాయన. ఉంగుటూరు మండలం నాచుగుంటలోని శ్రీగోపాలకృష్ణ గోశాలకు డా. సుంకపల్లి పర్వతరావు 28 ఎకరాలను దానం ఇచ్చారు. ఆ భూమిని లీజుకు తీసుకొని రామకృష్ణంరాజు సాగు చేస్తున్నారు. పచ్చని పంటలతో మనిషికి ఆయువునిచ్చే భూమిని వ్యాపార వస్తువుగా కాకుండా తల్లిగా చూడడం ఆయన ప్రత్యేకత. సార్వా వరి పంట కోసిన తర్వాత వెంటనే దాళ్వా వేయకుండా.. మినుమో, పిల్లిపెసరో, అలసందో చల్లుతారు. అయిన కాడికి కాయలు కోసుకున్నాక పశువులకు మేపుతారు. ఆనక ఆవులతో పొలంలో మందగడతారు. తొలకరి వర్షాలు కురిశాక దమ్ము చేసి నాటేస్తారు.. నలభయ్యేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న రామకృష్ణంరాజు 2007 నుంచి పంటల సాగు తీరును పూర్తిగా మార్చుకున్నారు. ఎగతాళి చేసిన వారే..! తొలుత 9.5 ఎకరాల్లో జీవామృతంతో వ్యవసాయాన్ని ప్రారంభించి.. క్రమంగా 28 ఎకరాలను ఈ పద్ధతిలోనే రసాయనిక ఎరువులు, పురుగుమందులను కొంచెం కూడా వాడకుండా సాగు చేస్తున్నారు. తొలుత జీవామృతంతో సాగు చేసిన 9.5 ఎకరాల్లో నాలుగేళ్లుగా అసలు జీవామృతం కూడా వాడడం లేదని, కేవలం ఆవులతో మందగట్టడం తప్ప ఇంకేమీ చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయనను పిచ్చి రాజు గారు, పిచ్చి వ్యవసాయం. ఇది అయ్యేదా పొయ్యేదా.. అని ఎగతాళి చేసిన రైతులే ఇప్పుడాయనను అనుసరిస్తున్నారు. రామకృష్ణంరాజు స్వగ్రామం తణుకు మండలం తేతలి గ్రామం. పూర్వీకుల దగ్గర నుంచి వ్యవసాయ కుబుంబం. 1970లో వ్యవసాయం చేపట్టి.. పరిమితంగా రసాయనిక ఎరువులు వాడుతూ సేద్యం చేశారు. సాంద్ర వ్యవసాయ పద్ధతి అమల్లో ఉన్న జిల్లాలో ఇతర రైతులు విరివిగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు దట్టిస్తూ.. తెరపి లేకుండా పంటల మీద పంటలు వేయడం పట్ల అసంతృప్తి చెందుతుండే వారు. ఆ దశలో మధ్యప్రదేశ్ చిత్రకూట్‌లోని దీనదయాళ్ సంస్థ, నాగపూర్‌లో మరో సంస్థను సందర్శించినప్పుడు ప్రకృతి వ్యవసాయం విలువ ఆయనకు అవగతమైంది. ఆ విధంగా ఏడేళ్ల క్రితం ప్రకృతిసిద్ధమైన పద్ధతుల్లో వ్యవసాయం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేసిన తొలి ఎకరానికి ఏడాది 20 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. క్రమంగా 29 బస్తాలకు పెరిగింది. ఒక్క ఆవు మూత్రం, పేడలతో జీవామృతం తదితర కషాయాలను తయారు చేసుకుంటూ తక్కువ ఖర్చుతో 4, 5 ఎకరాలను సాగు చేయవచ్చని నిరూపించారు. ఇతర రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7,8 వేలు ఖర్చు పెడుతున్నారు. ఇరుగు పొరుగు రైతుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆయనను అనుసరిస్తున్నారు. గద్దె వెంకటరత్నం అనే రైతు 10 ఎకరాల్లో, మరో రైతు 4 ఎకరాల్లో గోఆధారిత వ్యవసాయం చేయనారంభించారు. మరో 20 మంది రైతులు అరెకరం, ఎకరంలో ఈ పద్ధతిలో సాగు చేస్తూ ధాన్యాన్ని సొంతానికి వాడుకుంటున్నారు. నాట్లు వేయటం.. కలుపుతీయటం.. పంట కోయటం! అనేక ఏళ్లుగా జీవామృతం వేసి పంటలు పండిస్తున్నందున భూమి పూర్తిగా సారవంతమైంది. నాట్లేయటం, కలుపు తీయడం, పంట కోసుకోవడం తప్ప ఏ ఎరువులూ వేయాల్సిన అవసరం లేనేలేదని రామకృష్ణం రాజు తెలిపారు. కోత కోసిన తర్వాత పిల్లిపెసర వంటి గింజలు చల్లితే.. ఆవులు తినగా మిగిలిన పంట పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఎరువులు, జీవామృతం వేయకుండానే తదుపరి ఖరీఫ్‌లో వరి పంటను సాగు చేయవచ్చని ఆయన రుజువు చేశారు. ఏ భూమిలోనైనా వరుసగా ప్రకృతి వ్యవసాయం చేస్తే వానపాములు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, భూమిలో సేంద్రియ కర్బనం కొరత తీరుతుందని, 5 నుంచి 10 ఏళ్లలో ఇదే ఫలితం వస్తుందని ఆయన గంటాపథంగా చెబుతున్నారు. ఈ సాగు పద్ధతి గురించి ఆ నోటా ఈ నోటా విన్న రైతులు అనేక జిల్లాల నుంచి వచ్చి శిక్షణ పొందుతూ ఉంటారు. ఏడాదికి 400 నుంచి 500 మంది రైతులు శిక్షణ పొందుతుండగా, వీరిలో 60 % మంది ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని రామకృష్ణంరాజు తెలిపారు. - యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, ప. గో. జిల్లా ఫొటోలు: ఎస్ కే రియాజ్ ఎకరాకు రూ. 40 వేల నికరాదాయం గత ఖరీఫ్‌లో అరెకరంలో చెరకు, 27.5 ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఎకరాకు 15 వేలు ఖర్చు చేశారు. అవిపోను రూ. 40 వేల నికరాదాయం సంపాదించారు. ఇతర రైతులు రెండు పంటలు పండించి ధాన్యం అమ్ముకొని సంపాదించే మొత్తాన్ని. తాను ఒక పంటలో పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి సంపాదిస్తున్నానని రామకృష్ణంరాజు తెలిపారు. పండించిన ధాన్యాన్ని నిల్వ చేసి, మరపట్టించి ముడి బియ్యాన్ని కిలో రూ. 52 చొప్పున నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. పీఎల్ -1100, బీపీటీ -5204 రకాల బియ్యం సుమారు 55 వేల కిలోలను రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలతో పాటు చెన్నై, బెంగళూరు, బళ్లారి, కోయంబత్తూరు, పుణే వంటి ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్టు ద్వారా పంపిస్తున్నారు. ఈ బియ్యాన్ని సుమారు 500 కుటుంబాలు వాడుతున్నాయి. ఆరోగ్యదాయకమైన ఈ బియ్యాన్ని జనానికి అలవాటు చేయడానికి తనకు మూడేళ్లు పట్టిందని, వీటి విలువ తెలిసిన తర్వాత వాళ్లే పది మందికి చెబుతున్నారని రామకృష్ణంరాజు వివరించారు. ‘పెద్ద రైతులు, చిన్న. సన్నకారు రైతులు ఎవరికైనా ఈ వ్యవసాయం సాధ్యమే. కాకపోతే ఓపిక ఉండాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్ముకోగలగాలి..’ అంటారాయన. ఆవుతో 40 వేలు ఆదా! రామకృష్ణంరాజు వ్యవసాయ క్షేత్రంలో ఆరు దేశవాళీ ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే మూత్రం, పేడతో ఇక్కడ 28 ఎకరాల వ్యవసాయం సాగుతోంది. ఒక ఆవు మూత్రం, పేడతో తయారుచేసిన జీవామృతం తదితరాలతో 4,5 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. అంటే ఆ 4,5 ఎకరాల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు మిగిలినట్టే కదా. ఒక ఆవు ద్వారా రూ. 40 వేలకుపైగా వ్యవసాయ ఖర్చు తగ్గుతుంది. ఏటా రెండు పంటలు వేసే వాళ్లకు ఇంతకు రెట్టింపు మిగిలినట్టే. దేశవాళీ ఆవు లీటరు పాలిచ్చినా.. అవి అమృతతుల్యమైనవి. ఆవు ఉన్న ఇంట్లో పిల్లలు, పెద్దలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. అంతేకాదు.. ఆవు మూత్రంతో అర్క్, చర్మవ్యాధుల నివారణకు లేపనం కూడా తయారు చేసి అమ్ముతున్నారు. గడ్డి కొనాల్సిన అవసరం లేని రైతుకు ఒక్కో ఆవుకు రూ. వెయ్యి వరకు దాణా ఖర్చవుతుంది అంటారాయన. గో ఆధారిత వ్యవసాయాన్ని పట్టుదలగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న రైతులకు తన పొలం దగ్గర ఒక రోజు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆలోచనా విధానం మారాలి రైతుల ఆలోచనా విధానం మారాలి. మన తాతలు, తండ్రులు, మనకు సారవంతమైన భూమిని ఇచ్చారు. మనం మన తర్వాతి తరాలకు భూమిని సారవంతంగా ఉంచి అప్పగించాలంటే గో ఆధారిత వ్యవసాయం చేయాలి. ఈ వ్యవసాయంలో భూమి సారవంతమవుతుంది. ఆరోగ్యదాయకమైన ధాన్యం పండించుకోవచ్చు. ఆస్పత్రి మెట్లెక్కే అవసరం రాదు. ఇంటిల్లి పాదీ సుఖంగా ఉండవచ్చు, ఇంట్లో ఒక దేశీయ ఆవు ఉంటే అదే మహాభాగ్యమని రైతులోకం గుర్తించాలి. సేంద్రియ కర్బనం పెరగడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. ప్రతి నీటి చుక్కను పట్టుకొనే గుణం భూమికి ఉంటుంది. 20 శాతం నీరు ఆదా అవుతుంది. వర్షాలు తగ్గినా ఇబ్బంది ఉండదు. పూర్వీకులు భూమిని తల్లిగా చూసేవారు, మనం వ్యాపార వస్తువుగా చూస్తున్నాం, మనం పూర్వీకుల బాట పట్టాలి. ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. సంఘటితమై స్వాభిమానం చాటాలి. - భూపతిరాజు రామకృష్ణంరాజు(94404 87864), గో ఆధారిత వ్యవసాయదారుడు, నాచుగుంట, ఉంగుటూరు మండలం, ప. గో. జిల్లా -
పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి
సూర్యాపేటరూరల్, న్యూస్‌లైన్, అన్నం పెట్టే రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. పంట చేతికందే సమయంలోనూ ప్రకృతి సహకరించకపోవ డం, పండించిన పంట సకాలంలో అమ్ముకోలేక పోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రతి యేటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. 30 నుంచి 40 శాతం వరకు పెరిగిన ధరలు రెండేళ్లలో ఎరువులు, పురుగు మందుల ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెరి గాయి. అంతకు ముందు రూ.500 ఉన్న డీఏపీ బస్తా ధర ఇప్పుడు రూ.1200కు చేరింది. యూరియా బస్తా రూ.250 నుంచి రూ. 280కి చేరింది. ట్రాక్టర్‌తో దుక్కులు దున్నడం ఎకరాకు గతంలో రూ. 800 ఉండగా ప్రస్తుతం రూ. 1200 వరకు వసూలు చేస్తున్నారు. వరి నాటు కు ఎకరాకు రూ.1200 ఉండగా ప్రస్తు తం రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. కలుపు తీయడం చీడపీడల నివారణ చర్యల కోసం కూలీకి రూ.100 నుంచి రూ.150కి పెరిగింది. వరి కోతకు కూలీ లు సకాలంలో దొరక పోవడంతో వరిప ంట నూర్పిడికి వరికొత మిషన్ల మీద పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. గతం లో రూ.1200లు ఉండగా ప్రస్తుతం రూ. 1800 వసూలు చేస్తున్నారు. ఇంత పెట్టుబడి పెట్టినా దిగుబడి ఎకరాకు25 నుంచి 30 బస్తాలు మించడం లేదు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ‘ఏ’ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1345, సా ధారణ రకం రూ.1310 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుం ది. ఈ ధర చొప్పున 25 బస్తాల వడ్లు విక్రయిస్తే రైతకు వచ్చేది రూ.20 వేలే. వ్యవసాయదారుడు ఎకరాపై పెట్టిన పెట్టుబడి రూ15 వేలు. ఈ లెక్కన చూస్తే రైతులకు మిగిలేది కన్నీళ్లే. సాయం అందించని పాలకులు వ్యవసాయ సంక్షోభం నివారణకు స్వామినాథన్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. సాగు ఖర్చుపై అదనంగా 50 శాతం పెంచి మద్దతు ధర నిర్ణయించాలని సూచించింది. అయినా, దీనిని ఎవరూ అమలు చేయడం లేదు. ఇటీవ ల వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర నిర్ణయ కమిటీ రెండు, మూడేళ్ల వరకు వరికి మద్దతు ధర పెంచే అవకాశం లేదని ఓ ప్రకటనలో స్పష్టం చేసిం ది. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర సరిపోవడం లేదని, నూతనంగా ఏర్పడే ప్రభుత్వం అయినా స్పం దించి మద్దతు ధర పెంచి ఆదుకుంటే బాగుంటుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. -
రైతుకు దిగుబడి దిగులు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు వేగంగా అభివృద్ధి చెందినా రైతులు మాత్రం దిగులుతోనే ఉన్నారు. అతివృష్టి వల్ల పసుపు, మొక్కజొన్న, సోయా పంటల దిగుబడి తగ్గిపోనుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం గడచిన జూలై వరకు 168 మిల్లీమీటర్లు కాగా 215 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణానికి మించి 47 మిల్లీ మీటర్ల వర్షం అధికంగా కురిసింది. అనేక చోట్ల వర్షం నీటి నిల్వతో పంట పొలాలు మురిగిపోయాయి. పసుపు పంటకు దుంపకుళ్లు సోకుతుండగా, మొక్కజొన్న, సోయా పంటలకు నీరెక్కి దిగుబడి తగ్గడానికి అవకాశం ఏర్పడింది. వరి పంటకు మాత్రం వర్షం మేలు చేసింది. వరి పంటకు నీటిని పారించాల్సిన పనిలేకుండా పోయింది. జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పసుపు, 70 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 80 వేల ఎకరాలకు పైగా సోయా పంటలను రైతులు సాగుచేస్తున్నారు. సోయా, మొక్కజొన్న పంటలకు తక్కువ పరిమాణంలోనే అవసరం అయితే నీరు ఎక్కువగా పంట పొలాల్లో నిలిచి ఉంటోంది. దీంతో దిగుబడి 30 నుంచి 40 శాతం తగ్గనుందని రైతులు చెబుతున్నారు. పసుపు పంటకు దుంపకుళ్లు సోకి దిగుబడి తగ్గనుంది. గత సంవత్సరం వర్షాలు తక్కువగా కురియడంతో పంటల సాగుకు నీరు అందించడం కష్టం అయ్యింది. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా తయారయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక చోట్ల పంటలు నీట మునుగుతున్నా పంట నష్టంపై అంచనా వేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. బీమా నిబంధనలు ఒక్కో పంటకు ఒక విధంగా ఉండటంతో పరిహారం అందే అవకాశం కనిపించడంలేదు. పసుపు పంటకు రుణం తీసుకున్న రైతు నుంచి రూ.లక్ష రుణానికి రూ.6 వేల ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుంటున్నారు. సోయా, మొక్కజొన్న పంటలకు ప్రీమియం తక్కువగానే ఉంటుంది. వాణిజ్య బ్యాంకులలో ఖచ్చితంగా పంటల బీమాకు ప్రీమియం వసూలు చేస్తున్నా రు. సహకార బ్యాంకులలో మాత్రం బీమాపై ఎలాంటి ఒత్తిడి లేదు. పంటల బీమా నిబంధనలు రైతులకు మేలు చేసేవిధంగా లేవని అందువల్ల రైతు ఇష్టాఇష్టాలతోనే బీమా చేసేందుకు అవకాశం కల్పించాలని రైతు నాయకులు డిమాం డ్ చేస్తున్నారు. జిల్లాలో అనావృష్టి, అతివృష్టిల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం అందిన దాఖలాలు లేవు. అందువల్ల పంటల బీమా రైతు ఇష్ట ప్రకారం చేసే అవకాశం కల్పిం చాలని నాయకులు గతంలో కోరారు. అయితే వాణిజ్య బ్యాం కులు మాత్రం పంటల బీమాను తప్పనిసరి చేశాయి. ఈసారి అతివృష్టి వల్ల పంటల దిగుబడి తగ్గిపోనుండటంతో దీనిపై అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. అనేక చోట్ల నీట మునిగిన పంటలకు బీమా పరి హారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నీటి మునిగిన ఆశలు గాంధారి : అధిక వర్షాలకు గాంధారి మండలంలో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం కలుగుతోంది. పంట భూముల్లో నీటి నిల్వల ఏర్పడి మొక్కజొన్న పైర్లు ఎర్రబారి పోయాయి. ఫలితంగా పైర్లు పెరగలేదు. దీంతో కనీసం పెట్టుబడులకు సరిపోను దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 13,168 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. భూమి దుక్కి దున్నడం, విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు తదితర ఖర్చులు మొత్తం ఎకరానికి రూ.12 నుంచి 15 వేలు పెట్టుబడి పెట్టామని రైతులు పేర్కొంటున్నారు.