ఈ సారి టార్గెట్ 2.05 లక్షల హెక్టార్లు
1.05 లక్షల హెక్టార్లలో వరి
37 వేల హెక్టార్లలో చెరకు
42 వేల హెక్టార్లలో మిల్లెట్స్
17 వేల హెక్టార్లలో అపరాలు
పంటల వివరాల సేకరణకు 17 నుంచి గ్రామ సభలు
గతేడాది రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించడం.. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయన్నవాతావరణ శాఖ తీపి కబురు నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు రైతులు ఉద్యుక్తులవుతున్నారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌పై మరో పక్క వ్యవసాయశాఖ కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. తొలుత గ్రామాల వారీగా వ్యవసాయ సమగ్ర స్వరూపంతో కూడిన ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించింది.ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడులు, విత్తనాలు,ఎరువులు, భూసార పరీక్షలు, వ్యవసాయ యాంత్రీకరణ తదితర వాటిపై ప్రత్యేకదృష్టి సారించాలని నిర్ణయించారు.
విశాఖపట్నం: రానున్న ఖరీఫ్‌లో కనీసం 2.06 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 1,99,813 హెక్టార్లు కాగా, గతేడాది 2,08,988 హెక్టార్లలో సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆచరణలోకొచ్చేసరికి 1.75 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. దాంట్లో ప్రధానంగా వరి 1.06 లక్షల హెక్టార్లకు 1.03 లక్షల హెక్టార్లు, చెరకు 35,573 హెక్టార్లకు 34వేల హెక్టార్లలో సాగుచేశారు. మిగిలిన పంటల మాటెలాగున్నా వరిలో మాత్రం ఊహించని దిగుబడి సాధించగలిగారు. ఎకరాకు 30కి పైగా బస్తాలతో 3.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధించారు. ఇదే ఉత్సాహంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో తొలకరి పంట (ఖరీఫ్)కు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది.
పంటల ప్రణాలిక ఇలా..
1.05 లక్షల హెక్టార్లకు తక్కువకాకుండా వరి, 37వేల హెక్టార్లలో చెరకు, 42 వేల హెక్టార్లలో మిల్లెట్స్ (చిరుధాన్యాలు) 17వేల హెక్టార్లలో అపరాలు సాగు చేయాలని నిర్ణయించారు. గతేడాది ఆరువేల హెక్టార్లలో మాత్రమే సాగు చేసిన పచ్చిరొట్టను ఈ ఏడాది15 వేల హెక్టార్లలో సాగుచేయాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ ఏడాది కనీసం 10 శాతం చెరుకు సాగు విస్తీర్ణంలో కనుపు సాగుకు అవసరమైన సహకారాన్ని రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది తొలిసారిగా 40 వేల హెక్టార్లకు సూక్ష్మ పోషకాలు అందించాలని టార్గెట్ పెట్టుకున్నారు. గతేడాది 27వేల హెక్టార్లకే ఇవ్వ గలిగారు. ఖరీఫ్‌లోగా 28,612 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 33వేల హెక్టార్లకు సరిపడా వరివిత్తనాలు, 150 క్వింటాళ్ల చోళ్లు, 450 క్వింటాళ్ల అపరాలు, 251 హెక్టార్లకు సరిపడా చెరుకు కనుపులు సిద్ధం చేస్తున్నారు. కాని ఇవి ఏమూలకు సరిపోవని రైతులంటున్నారు. కనీసం 50 శాతం విత్తనాలైనా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో రూ.840 కోట్లు రుణాలివ్వగా, ఈ ఏడాది రూ.1050 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.
గ్రామాల వారీగా కసరత్తు
గ్రామాల వారీగా పంటల వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహిస్తోంది. ఇందుకోసం మల్టీపర్పస్ ఎక్సెటెన్షన్ అధికారులకు ప్రత్యేకంగా టాబ్స్‌ను ఇస్తున్నారు. వీటి ద్వారా గ్రామాల వారీగా ఏఏ పంటలు ఏ మేరకు సాగవుతున్నాయి? వాటికి ఏ మేరకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అవసరమవుతాయి? వంటి అంశాలపై వివరాలు సేకరించనున్నారు.
ప్రధానమంత్రి పంటల బీమా పథకంపై ఈ సభల్లో రైతులకు అవగాహన కల్పించి కనీసం 50 శాతం మందిని ఈ పథకంలో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఈసారి ప్రకృతి సేద్యం.. సేంద్రీయ సేద్యం చేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు జేడీ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఇలా సేకరించిన వివరాలను నిర్ణీత ఫార్మెట్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు పరిస్థితిని బట్టే ఈసారి విత్తనాలు, ఎరువులు, యాంత్రీకరణ యూనిట్లు మంజూరవుతాయని ఆయన చెప్పారు.