రైతుకు దిగుబడి దిగులు | Rain has farmers worried over yield | Sakshi
Sakshi News home page

రైతుకు దిగుబడి దిగులు

Published Sun, Aug 18 2013 7:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Rain has farmers worried over yield

 మోర్తాడ్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు వేగంగా అభివృద్ధి చెందినా రైతులు మాత్రం దిగులుతోనే ఉన్నారు. అతివృష్టి వల్ల పసుపు, మొక్కజొన్న, సోయా పంటల దిగుబడి తగ్గిపోనుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం గడచిన జూలై వరకు 168 మిల్లీమీటర్లు కాగా 215 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణానికి మించి 47 మిల్లీ మీటర్ల  వర్షం అధికంగా కురిసింది. అనేక చోట్ల వర్షం నీటి నిల్వతో పంట పొలాలు మురిగిపోయాయి. పసుపు పంటకు దుంపకుళ్లు సోకుతుండగా, మొక్కజొన్న, సోయా పంటలకు నీరెక్కి దిగుబడి తగ్గడానికి అవకాశం ఏర్పడింది. వరి పంటకు మాత్రం వర్షం మేలు చేసింది. వరి పంటకు నీటిని పారించాల్సిన పనిలేకుండా పోయింది. జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పసుపు, 70 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 80 వేల ఎకరాలకు పైగా సోయా పంటలను రైతులు సాగుచేస్తున్నారు. సోయా, మొక్కజొన్న పంటలకు తక్కువ పరిమాణంలోనే అవసరం అయితే నీరు ఎక్కువగా పంట పొలాల్లో నిలిచి ఉంటోంది. దీంతో దిగుబడి 30 నుంచి 40 శాతం తగ్గనుందని రైతులు చెబుతున్నారు.
 
 పసుపు పంటకు దుంపకుళ్లు సోకి దిగుబడి తగ్గనుంది. గత సంవత్సరం వర్షాలు తక్కువగా కురియడంతో పంటల సాగుకు నీరు అందించడం కష్టం అయ్యింది. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా తయారయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక చోట్ల పంటలు నీట మునుగుతున్నా పంట నష్టంపై అంచనా వేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. బీమా నిబంధనలు ఒక్కో పంటకు ఒక విధంగా ఉండటంతో పరిహారం అందే అవకాశం కనిపించడంలేదు. పసుపు పంటకు రుణం తీసుకున్న రైతు నుంచి రూ.లక్ష రుణానికి రూ.6 వేల ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుంటున్నారు. సోయా, మొక్కజొన్న పంటలకు ప్రీమియం తక్కువగానే ఉంటుంది. వాణిజ్య బ్యాంకులలో ఖచ్చితంగా పంటల బీమాకు ప్రీమియం వసూలు చేస్తున్నా రు. సహకార బ్యాంకులలో మాత్రం బీమాపై ఎలాంటి ఒత్తిడి లేదు. పంటల బీమా నిబంధనలు రైతులకు మేలు చేసేవిధంగా లేవని అందువల్ల రైతు ఇష్టాఇష్టాలతోనే బీమా చేసేందుకు అవకాశం కల్పించాలని రైతు నాయకులు డిమాం డ్ చేస్తున్నారు.
 
 జిల్లాలో అనావృష్టి, అతివృష్టిల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం అందిన దాఖలాలు లేవు. అందువల్ల పంటల బీమా రైతు ఇష్ట ప్రకారం చేసే అవకాశం కల్పిం చాలని నాయకులు గతంలో కోరారు. అయితే వాణిజ్య బ్యాం కులు మాత్రం పంటల బీమాను తప్పనిసరి చేశాయి. ఈసారి అతివృష్టి వల్ల పంటల దిగుబడి తగ్గిపోనుండటంతో దీనిపై అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. అనేక చోట్ల నీట మునిగిన పంటలకు బీమా పరి హారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
 
 నీటి మునిగిన ఆశలు
 గాంధారి : అధిక వర్షాలకు గాంధారి మండలంలో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం కలుగుతోంది. పంట భూముల్లో నీటి నిల్వల ఏర్పడి మొక్కజొన్న పైర్లు ఎర్రబారి పోయాయి. ఫలితంగా పైర్లు పెరగలేదు. దీంతో కనీసం పెట్టుబడులకు సరిపోను దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 13,168 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. భూమి దుక్కి దున్నడం, విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు తదితర ఖర్చులు మొత్తం ఎకరానికి రూ.12 నుంచి 15 వేలు పెట్టుబడి పెట్టామని రైతులు పేర్కొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement