వెంటాడిన వర్షాభావం
- ఖరీఫ్, రబీ దెబ్బతీసిన వరుణుడు
- ఈ ఏడాది 42 శాతం తక్కువగా వర్షపాతం నమోదు
- గుమ్మగట్ట, రాప్తాడు నియోజక వర్గంలో మరీ ఘోరం
అనంతపురం అగ్రికల్చర్ : వరుణుడు మొహం చాటేయడంతో మునుపెన్నడూ లేనంతగా ఈ సారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ‘అనంత’ను వెంటాడాయి. అటు నైరుతీ ఇటు ఈశాన్యం రెండు సీజన్లలో రుతుపవనాలు చేతులెత్తేయడంతో ఖరీఫ్, రబీ పంటలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. నెలల కొద్దీ వర్షం జాడ లేకపోవడంతో వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) అధికంగా నమోదయ్యాయి. 22 లక్షల ఎకరాల్లో సాగైన ఖరీఫ్, రబీ పంటల నుంచి కనీసం పెట్టుబడుల్లో సగం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడులు, దిగుబడుల రూపంలో జిల్లా రైతులకు రూ.5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఫలితంగా రైతులు, కూలీలు, పేద వర్గాలు పొట్ట చేతబూని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా కుప్పలు తెప్పలుగా అప్పులు మిగిలిపోవడంతో తీర్చేదారి లేక బలవణ్మరణాలకు పాల్పడుతున్నారు.
వెంటాడిన వర్షాభావం : ఈ స్థాయి కరువు పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణం వర్షాలు. అసలే అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లాలో వార్షిక వర్షపాతం కేవలం 553 మి.మీ. అది కూడా కురవకపోవడంతో కరువు దరువేస్తోంది. గత జూన్ నుంచి ఇప్పటి వరకు 505.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సివుండగా కేవలం 293.7 మి.మీ కురిసింది. అంటే 42 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. అందులో కీలకమైన ఖరీఫ్‌కు సంబంధించి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 338.4 మి.మీ గానూ 24 శాతం తక్కువగా 257.3 మి.మీ కురిసింది. అది కూడా జూన్, జూలైలో మాత్రమే వర్షం పడగా, ఆగస్టు, సెప్టెంబర్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలన్నీ నాశనమయ్యాయి.
రైతుల ఆశలన్నీ ఆగస్టు, సెప్టెంబర్ వర్షాలు నేలకూల్చాయి. రబీలోనైనా గట్టెక్కుదామనుకున్న రైతులు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రబీకి సంబంధించి 155.3 మి.మీ గానూ 82.9 శాతం తక్కువగా కేవలం 26.5 మి.మీ వర్షం పడింది. దీంతో ఆదిలోనే రబీ గల్లంతైంది. ఇలా రెండు సీజన్లు రైతులను వరుణుడు నిలువునా మోసం చేయడంతో కోలుకోలేనంత కష్టాలు మూటగట్టుకున్నాడు. జిల్లాలో నెలకొన్న వర్షాభావం వల్ల ఖరీఫ్, రబీ పంటలతో పాటు 10 లక్షల సంఖ్యలో ఉన్న పశుసంపద, 45 లక్షలున్న జీవాలకు గడ్డి, నీటి కొరత ఏర్పడింది. అలాగే 30 వేల ఎకరాల్లో ఉన్న మల్బరీ, 1.71 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటలు ఎండుముఖం పట్టాయి. అధికారికంగా ఇప్పటికే 7 వేల ఎకరాల్లో పట్టు, 5 వేల ఎకరాల్లో పండ్లతోటలు ఎండిపోవడంతో రైతులకు రూ.కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టం మరింత పెరిగే సూచనలు స్పష్టంగా గోచరిస్తుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
గుమ్మగట్టలో 78 శాతం తక్కువగా వర్షం : ఈ సారి జిల్లా అంతటా 42 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కాగా.. అందులో గుమ్మగట్ట మండలంలో మరీ దారుణంగా 78 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. గుమ్మగట్టలో 460.9 మి.మీ వర్షం పడాల్సి ఉండగా కేవలం 90.1 మి.మీ నమోదైంది. రామగిరి 65 శాతం, రాప్తాడు 63 శాతం, కనగానపల్లి 60 శాతం, అమరాపురం 60 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. అలాగే బుక్కపట్నం, బెళుగుప్ప 59 శాతం, రొళ్ల 58 శాతం, హిందూపురం 55 శాతం, కదిరి 54 శాతం, నల్లచెరువు, తనకల్లు 53 శాతం, పుట్టపర్తి, బొమ్మనహాల్ 52 శాతం, అమడగూరు, పరిగి 51 శాతం, అలాగే బ్రహ్మసముద్రం, విడపనకల్, యాడికి, పెద్దపప్పూరు, పామిడి, గార్లదిన్నె, ఉరవకొండ, రాయదుర్గం, కుందుర్పి, కళ్యాణదుర్గం, అనంతపురం, నార్పల, బత్తలపల్లి, గాండ్లపెంట, ఓడీ చెరువు, కొత్తచెరువు, పెనుకొండ, రొద్దం, చిలమత్తూరు మండలాల్లో 40 నుంచి 50 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా కేవలం ఆత్మకూరు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా 62 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
నెల వారీ వర్షపాతం వివరాలిలా...