ఆవున్న చోటే అన్నముంది! | Where rice is the cow! | Sakshi
Sakshi News home page

ఆవున్న చోటే అన్నముంది!

Published Sun, Jul 13 2014 11:48 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఆవున్న చోటే అన్నముంది! - Sakshi

ఆవున్న చోటే అన్నముంది!

ప్రతి ఏటా దాళ్వాకు విరామం!
 
ఆరు ఆవులతో 28 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం.. భూమికి
విశ్రాంతి కోసం దాళ్వా వరి సాగుకు ప్రతి ఏటా సెలవు!
సార్వాలో మాత్రమే వరి సాగు.. వినియోగదారులకు నేరుగా ముడి బియ్యం అమ్మకం ద్వారా ఎకరానికి రూ. 40 వేల నికరాదాయం
ఒక్కో దేశీ ఆవు ద్వారా రూ. 40 వేల సాగు ఖర్చులు ఆదా!  
 
‘వ్యవసాయం పరమ లక్ష్యం అధికంగా పంట దిగుబడులు నూర్చడం కాదు.. మంచి మనసు గల మనుషులున్న సమాజాన్ని నిర్మించడం..’ అంటాడు సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా. నాచుగుంటలోని భూపతిరాజు రామకృష్ణంరాజు(65) వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే ఈ మాటలకు అర్థం ఏమిటో కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. భూమిని తల్లిగా కొలిచే రైతుగా గత ఏడేళ్లుగా వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన గోఆధారిత వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ.. మొదట్లో జీవామృతం వాడినా.. ఇప్పుడు ఏ ఎరువూ వేయకుండా ఎకరానికి 29 బస్తాల విష రహిత ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. 5-10 ఏళ్లు జీవామృతం వాడిన పొలంలో ఏ ఎరువూ వేయకుండానే పంటలు పండించొచ్చని రుజువు చేశారు. తను చేయడమే కాకుండా తోటి రైతులకు జ్ఞానాన్ని పంచి.. పచ్చని బతుకు దారి చూపుతున్నారు. ‘పిచ్చి రాజు.. పిచ్చి పంట..’ అని ఎగతాళి చేసిన రైతులే ఇప్పుడు అనుసరిస్తున్నారు!
 
 అత్యాశకు పోయి రసాయనిక వ్యవసాయంతో భూమిని సర్వనాశనం చేసుకోవడం రైతు తనకు తాను ద్రోహం చేసుకోవడమేనని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు భూపతిరాజు రామకృష్ణంరాజు(65) ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రకృతిని ఉపయోగించుకుంటూనే ప్రకృతి పరిరక్షణకు దోహదపడే రీతిలో రైతు జీవన విధానం, పంటల విధానం ఉండాలంటారాయన. ఉంగుటూరు మండలం నాచుగుంటలోని శ్రీగోపాలకృష్ణ గోశాలకు డా. సుంకపల్లి పర్వతరావు 28 ఎకరాలను దానం ఇచ్చారు. ఆ భూమిని లీజుకు తీసుకొని రామకృష్ణంరాజు సాగు చేస్తున్నారు.

పచ్చని పంటలతో మనిషికి ఆయువునిచ్చే భూమిని వ్యాపార వస్తువుగా కాకుండా తల్లిగా చూడడం ఆయన ప్రత్యేకత. సార్వా వరి పంట కోసిన తర్వాత వెంటనే దాళ్వా వేయకుండా.. మినుమో, పిల్లిపెసరో, అలసందో చల్లుతారు. అయిన కాడికి కాయలు కోసుకున్నాక పశువులకు మేపుతారు. ఆనక ఆవులతో పొలంలో మందగడతారు. తొలకరి వర్షాలు కురిశాక దమ్ము చేసి నాటేస్తారు.. నలభయ్యేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న రామకృష్ణంరాజు 2007 నుంచి పంటల సాగు తీరును పూర్తిగా మార్చుకున్నారు.

ఎగతాళి చేసిన వారే..!

తొలుత 9.5 ఎకరాల్లో జీవామృతంతో వ్యవసాయాన్ని ప్రారంభించి.. క్రమంగా 28 ఎకరాలను ఈ పద్ధతిలోనే రసాయనిక ఎరువులు, పురుగుమందులను కొంచెం కూడా వాడకుండా సాగు చేస్తున్నారు. తొలుత జీవామృతంతో సాగు చేసిన 9.5 ఎకరాల్లో నాలుగేళ్లుగా అసలు జీవామృతం కూడా వాడడం లేదని, కేవలం ఆవులతో మందగట్టడం తప్ప ఇంకేమీ చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయనను పిచ్చి రాజు గారు, పిచ్చి వ్యవసాయం. ఇది అయ్యేదా పొయ్యేదా.. అని ఎగతాళి చేసిన రైతులే ఇప్పుడాయనను అనుసరిస్తున్నారు.
 రామకృష్ణంరాజు స్వగ్రామం తణుకు మండలం తేతలి గ్రామం. పూర్వీకుల దగ్గర నుంచి వ్యవసాయ కుబుంబం. 1970లో వ్యవసాయం చేపట్టి.. పరిమితంగా రసాయనిక ఎరువులు వాడుతూ సేద్యం చేశారు. సాంద్ర వ్యవసాయ పద్ధతి అమల్లో ఉన్న జిల్లాలో ఇతర రైతులు విరివిగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు దట్టిస్తూ.. తెరపి లేకుండా పంటల మీద పంటలు వేయడం పట్ల అసంతృప్తి చెందుతుండే వారు. ఆ దశలో మధ్యప్రదేశ్ చిత్రకూట్‌లోని దీనదయాళ్ సంస్థ, నాగపూర్‌లో మరో సంస్థను సందర్శించినప్పుడు ప్రకృతి వ్యవసాయం విలువ ఆయనకు అవగతమైంది. ఆ విధంగా ఏడేళ్ల క్రితం ప్రకృతిసిద్ధమైన పద్ధతుల్లో వ్యవసాయం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేసిన తొలి ఎకరానికి ఏడాది 20 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. క్రమంగా 29 బస్తాలకు పెరిగింది. ఒక్క ఆవు మూత్రం, పేడలతో జీవామృతం తదితర కషాయాలను తయారు చేసుకుంటూ తక్కువ ఖర్చుతో 4, 5 ఎకరాలను సాగు చేయవచ్చని నిరూపించారు. ఇతర రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7,8 వేలు ఖర్చు పెడుతున్నారు. ఇరుగు పొరుగు రైతుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆయనను అనుసరిస్తున్నారు. గద్దె వెంకటరత్నం అనే రైతు 10 ఎకరాల్లో, మరో రైతు 4 ఎకరాల్లో గోఆధారిత వ్యవసాయం చేయనారంభించారు. మరో 20 మంది రైతులు అరెకరం, ఎకరంలో ఈ పద్ధతిలో సాగు చేస్తూ ధాన్యాన్ని సొంతానికి వాడుకుంటున్నారు.

నాట్లు వేయటం.. కలుపుతీయటం.. పంట కోయటం!

అనేక ఏళ్లుగా జీవామృతం వేసి పంటలు పండిస్తున్నందున భూమి పూర్తిగా సారవంతమైంది. నాట్లేయటం, కలుపు తీయడం, పంట కోసుకోవడం తప్ప ఏ ఎరువులూ వేయాల్సిన అవసరం లేనేలేదని రామకృష్ణం రాజు తెలిపారు. కోత కోసిన తర్వాత పిల్లిపెసర వంటి గింజలు చల్లితే.. ఆవులు తినగా మిగిలిన పంట పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఎరువులు, జీవామృతం వేయకుండానే తదుపరి ఖరీఫ్‌లో వరి పంటను సాగు చేయవచ్చని ఆయన రుజువు చేశారు. ఏ భూమిలోనైనా వరుసగా ప్రకృతి వ్యవసాయం చేస్తే వానపాములు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, భూమిలో సేంద్రియ కర్బనం కొరత తీరుతుందని, 5 నుంచి 10 ఏళ్లలో ఇదే ఫలితం వస్తుందని ఆయన గంటాపథంగా చెబుతున్నారు.

ఈ సాగు పద్ధతి గురించి ఆ నోటా ఈ నోటా విన్న రైతులు అనేక జిల్లాల నుంచి వచ్చి శిక్షణ పొందుతూ ఉంటారు. ఏడాదికి 400 నుంచి 500 మంది రైతులు శిక్షణ పొందుతుండగా, వీరిలో 60 % మంది ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని రామకృష్ణంరాజు తెలిపారు.

 - యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, ప. గో. జిల్లా
 ఫొటోలు: ఎస్ కే రియాజ్
 
ఎకరాకు రూ. 40 వేల నికరాదాయం

గత ఖరీఫ్‌లో అరెకరంలో చెరకు, 27.5 ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఎకరాకు 15 వేలు ఖర్చు చేశారు. అవిపోను రూ. 40 వేల నికరాదాయం సంపాదించారు. ఇతర రైతులు రెండు పంటలు పండించి ధాన్యం అమ్ముకొని సంపాదించే మొత్తాన్ని. తాను ఒక పంటలో పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి సంపాదిస్తున్నానని రామకృష్ణంరాజు తెలిపారు. పండించిన ధాన్యాన్ని నిల్వ చేసి, మరపట్టించి ముడి బియ్యాన్ని కిలో రూ. 52 చొప్పున నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. పీఎల్ -1100, బీపీటీ -5204 రకాల బియ్యం సుమారు 55 వేల కిలోలను రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలతో పాటు చెన్నై, బెంగళూరు, బళ్లారి, కోయంబత్తూరు, పుణే వంటి ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్టు ద్వారా పంపిస్తున్నారు. ఈ బియ్యాన్ని సుమారు 500 కుటుంబాలు వాడుతున్నాయి. ఆరోగ్యదాయకమైన ఈ బియ్యాన్ని జనానికి అలవాటు చేయడానికి తనకు మూడేళ్లు పట్టిందని, వీటి విలువ తెలిసిన తర్వాత వాళ్లే పది మందికి చెబుతున్నారని రామకృష్ణంరాజు వివరించారు. ‘పెద్ద రైతులు, చిన్న. సన్నకారు రైతులు ఎవరికైనా ఈ వ్యవసాయం సాధ్యమే. కాకపోతే ఓపిక ఉండాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్ముకోగలగాలి..’ అంటారాయన.
 
ఆవుతో 40 వేలు ఆదా!

రామకృష్ణంరాజు వ్యవసాయ క్షేత్రంలో ఆరు దేశవాళీ ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే మూత్రం, పేడతో ఇక్కడ  28 ఎకరాల వ్యవసాయం సాగుతోంది. ఒక ఆవు మూత్రం, పేడతో తయారుచేసిన జీవామృతం తదితరాలతో 4,5 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. అంటే ఆ 4,5 ఎకరాల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు మిగిలినట్టే కదా. ఒక ఆవు ద్వారా రూ. 40 వేలకుపైగా వ్యవసాయ ఖర్చు తగ్గుతుంది. ఏటా రెండు పంటలు వేసే వాళ్లకు ఇంతకు రెట్టింపు మిగిలినట్టే. దేశవాళీ ఆవు లీటరు పాలిచ్చినా.. అవి అమృతతుల్యమైనవి. ఆవు ఉన్న ఇంట్లో పిల్లలు, పెద్దలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. అంతేకాదు.. ఆవు మూత్రంతో అర్క్, చర్మవ్యాధుల నివారణకు లేపనం కూడా తయారు చేసి అమ్ముతున్నారు. గడ్డి కొనాల్సిన అవసరం లేని రైతుకు ఒక్కో ఆవుకు రూ. వెయ్యి వరకు దాణా ఖర్చవుతుంది అంటారాయన.  గో ఆధారిత వ్యవసాయాన్ని పట్టుదలగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న రైతులకు తన పొలం దగ్గర ఒక రోజు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
 
ఆలోచనా విధానం మారాలి

రైతుల ఆలోచనా విధానం మారాలి. మన తాతలు, తండ్రులు, మనకు సారవంతమైన భూమిని ఇచ్చారు. మనం మన తర్వాతి తరాలకు భూమిని సారవంతంగా ఉంచి అప్పగించాలంటే గో ఆధారిత వ్యవసాయం చేయాలి. ఈ వ్యవసాయంలో భూమి సారవంతమవుతుంది. ఆరోగ్యదాయకమైన ధాన్యం పండించుకోవచ్చు. ఆస్పత్రి మెట్లెక్కే అవసరం రాదు. ఇంటిల్లి పాదీ సుఖంగా ఉండవచ్చు, ఇంట్లో ఒక దేశీయ ఆవు ఉంటే అదే మహాభాగ్యమని రైతులోకం గుర్తించాలి. సేంద్రియ కర్బనం పెరగడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. ప్రతి నీటి చుక్కను పట్టుకొనే గుణం భూమికి ఉంటుంది. 20 శాతం నీరు ఆదా అవుతుంది. వర్షాలు తగ్గినా ఇబ్బంది ఉండదు. పూర్వీకులు భూమిని తల్లిగా చూసేవారు, మనం వ్యాపార వస్తువుగా చూస్తున్నాం, మనం పూర్వీకుల బాట పట్టాలి. ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. సంఘటితమై స్వాభిమానం చాటాలి.

- భూపతిరాజు రామకృష్ణంరాజు(94404 87864),
గో ఆధారిత వ్యవసాయదారుడు, నాచుగుంట,
ఉంగుటూరు మండలం, ప. గో. జిల్లా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement