చెరకు చేదే | not support price to sugarcane | Sakshi
Sakshi News home page

చెరకు చేదే

Published Mon, Nov 10 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

not support price to sugarcane

నారాయణఖేడ్ రూరల్:  చెరకు రైతులకు ప్రతీఏడు చేదు పరిస్థితులే మిగులుతున్నాయి. తాము పండించిన పంటకు సరైన గిట్టుబాటుకు విక్రయించుకొనే పరిస్థితి చెరుకు రైతుకు లేకుండా పోతుంది. యాజమాన్యాలు నిర్ణయించిన ధరకే రైతులు పంటను అమ్మాల్సిన పరిస్థితి. ప్రతీ ఏడు పంటసాగుకు తీవ్ర ఇబ్బందులు, పెట్టుబడులు పెరిగిపోవడం పరిపాటిగా మారుతున్నా పంట విక్రయించే సరికి మద్దతు ధర లభించడంలేదు.

 రెండు మూడేళ్ళుగా ఒకే ధర ఉండడం రైతులకు ఆశనీపాతంగా మారుతోంది. ఈ ఏడు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు తోడు విపరీతమైన కరెంటు కోతలు. ఫలితం సాగుచేసిన చెరకు పంటకు సరిపడా నీరందడం లేదు. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ చెరకుకు మాత్రం గత ఏడాది ఇచ్చిన ధరనే ఇస్తామని కర్మాగార యాజమాన్యం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈనెల 9న క్రషింగ్‌ను ప్రారంభించింది.

రైతులు టన్నుకు రూ.3,500ల చొప్పున ధర చెల్లించాలని కోరుతున్నా యాజమాన్యం మాత్రం రూ.2,600లు చెల్లిస్తామని ప్రకటించింది. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి వద్ద ఉన్న గాయత్రి షుగర్స్ పరిధిలోకి వస్తారు.
 
కష్టానికి దక్కని ఫలితం
 మాగి గాయత్రి షుగర్స్ కర్మాగారం పరిధిలో మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, కల్హేర్, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, కంగ్టి  మండలాలు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, మద్నూర్, బిచ్కుందు మండలాల నుంచి చెరకు అగ్రిమెంట్ అయింది. ఈ కర్మాగారంలో కేవలం నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోనే 12వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకు కర్మాగారానికి వెళ్తుంది. అంటే సాగైన చెరకులో 90 శాతం ఈ కర్మాగారానికే అగ్రిమెంట్ అయింది.

నిజామాబాద్ జిల్లాలో కేవలం 3,500ల ఎకరాలలోపే చెరకు కర్మాగారానికి తరలుతుంది. కర్మాగారం నిర్ణయించిన ధర ప్రకారం ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. అందునా పె ట్టుబడులు కూడా అధికమయ్యాయని అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో చెరకు సాగుకు రూ.60 వేల నుంచి రూ.80వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలిపారు. దిగుబడులు మాత్రం 20 నుంచి 30 టన్నుల లోపే వస్తుందని తెలిపారు.

 ఈ లెక్కన కర్మాగారం ద్వారా టన్నుకు రూ.2,600ల చొప్పున చెల్లిస్తే కనీస పెట్టుబడే దక్కుతుందని రైతులు అంటున్నారు. రూ.3,500లు చెల్లించిన పక్షంలో తమకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఇది ఏడాది పంట కావడంతో యాజమాన్యం చెల్లించే ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ పెట్టుబడులను కూడా అప్పులు చేసి సాగు చేసినట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు.

 గతానికి.. నేటికీ భిన్నత్వం
 చెరకు సాగులో గతంలో లాభసాటిగా ఉండగా రాను రాను చెరకు సాగు రైతులకు గుదిబండలా మారుతుంది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం ఈ దుస్థితికి కారణమని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం రంగంలో చెరకు కర్మాగారాలు ఉన్నపుడు కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఎంపీ ధర ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రోత్సాహకాలను అందించేదని రైతులు పేర్కొం టున్నారు. దీంతో ప్రైవేట్ కంపెనీలూ ఇదే ధరను చెల్లించేవి.

ఫలితంగా రైతులకు గిట్టుబాటయ్యేది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం రైతులకు ఇబ్బందికరంగా తయారయింది. ఫలితంగా రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. ప్రతీఏటా చెరకు రైతులకు ధర విషయంలో ఇబ్బందులే ఏర్పడుతున్నాయి. క్రషింగ్ ప్రారంభ సమయం దగ్గర పడుతుండడం, రైతులు గిట్టుబాటు ధర చెల్లించాలని విన్నవించడం పరిపాటిగా మారుతోంది.
 
 పెట్టుబడుల్ని దృష్టిలో పెట్టుకోవాలి
 మెదక్ రూరల్: నిజాం దక్కన్ షుగర్(ఎన్‌డీఎస్‌ఎల్) ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరకు టన్ను ధర రూ. 3,500 చెల్లించాలి. రైతులు వరిని వదిలేసి చెరకు తోటలను కాపాడుకున్నారు. ప్రతి ఏడాది రసాయన ఎరువుల ధరలు పెరగడంతో పాటు కూలీల రేట్లు, రవాణా చార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. సాగుకు పె రుగుతున్న ఖర్చుల ను దృష్టిలో పెట్టుకొ ని గిట్టుబాటు ధర చెల్లించాలి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి రైతుల్ని ఆదుకోవాలి. క్రషింగ్‌ను సైతం సకాలంలో ప్రారంభించి రైతులు నష్టపోకుండా చొరవ చూపాలి.
 -టీపీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement