ధాన్యం.. దైన్యం | Rabi broke down in drought season | Sakshi
Sakshi News home page

ధాన్యం.. దైన్యం

Published Sat, May 28 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

ధాన్యం.. దైన్యం

ధాన్యం.. దైన్యం

రబీ డీలా
దిగుబడులు లేక కొనుగోలు కేంద్రాలు వెలవెల
గతేడాది కొనుగోళ్లు 96 వేల మెట్రిక్ టన్నులు
ఈసారి కేవలం 34 వేల మెట్రిక్ టన్నులే
కరువు తీవ్రతకు దర్పణం మెతుకుసీమలోనే ఈ దుస్థితి

కరువు కాటేసింది... దిగుబడులు లేక రైతన్న చతికిల పడ్డాడు. ఉత్పత్తులు రాక మార్కెట్లు డీలాపడ్డాయి. ఒకప్పుడు వరి ధాన్యం దిగుబడులతో మెతుకుసీమగా ఖ్యాతిగడించిన మెదక్ జిల్లాలో నేడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరుస కరువులతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. బోరు బావుల ఆధారంగా సాగు చేసే ‘వరి’కి గడ్డురోజులొచ్చాయి. ఈ క్రమంలో ఏటా వరి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. మరోవైపు అకాల వర్షాలు ఏటా చేతికొచ్చే దశలో పంటను దెబ్బతీస్తూ.. కొద్దిపాటి ఉత్పత్తులు కూడా అందకుండా చేస్తున్నాయి. గతేడాది రబీ సీజన్‌లో జిల్లాలో 96 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వస్తే.... ఈసారి రబీలో కేవలం 34 వేల మెట్రిక్ టన్నులకే పరిమితం కావడం జిల్లాలోని కరువు పరిస్థితికి అద్దం పడుతుంది.

గజ్వేల్: జిల్లాలో 2015-16 రబీలో వరి 48,476 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గాను 22,662 హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చింది. వరుస కరువు, వర్షాభావంతో భూగర్భ జలమట్టం భారీగా పడిపోవడంతో వరికి శాపంగా మారింది. వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. మరోవైపు చేతికందే దశలో అకాల వర్షాలు, వడగళ్లు రైతును మరింత కుంగదీశాయి. ఫలితంగా ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. నిజానికి 22,662 హెక్టార్లలో పంట సక్రమంగా పండితే సుమారు 15 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు వచ్చేవి. కానీ నేడు జిల్లాలో ఇప్పటివరకు 3.4 లక్షల క్వింటాళ్లు (34 వేల మెట్రిక్ టన్నులు) మాత్రమే కేంద్రాల్లో నిర్వాహకులు కొనుగోలు చేశారు.

ఈసారి 44 ఐకేపీ, 53 సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఐకేపీ కేంద్రాల్లో 3843 మంది రైతులు, సహకార సంఘాల కేంద్రాల్లో 7,120 మంది రైతులు తమ ఉత్పత్తులను  అమ్ముకున్నారు. ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1,450, ‘బీ’ గ్రేడ్ రకానికి రూ.1,410 మద్దతు ధరగా చెల్లిస్తున్నది. గతేడాది 37 వేల హెక్టార్లలో వరి సాగైంది. ఐకేపీ ద్వారా 70, సహకార సంఘాల ద్వారా 58 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 35శాతం కూడా ఉత్పత్తులు రాకపోవడం జిల్లాలో నెలకొన్న దయనీయ పరిస్థితులను చాటుతోంది.

గజ్వేల్ యార్డులో గతేడాది..
గజ్వేల్ మార్కెట్ యార్డులో గతేడాది ఏర్పాటు చేసిన సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో 30 వేల క్వింటాళ్లకుపైగా వడ్లను కొనుగోలు చేస్తే ఈసారి 7 వేల క్వింటాళ్లకే పరిమితమైంది. యార్డులో పెద్దగా సందడిలేదు.

నిష్ర్కమించిన ప్రభుత్వ సంస్థలు..
జిల్లాలో వరి ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. రాబోవు రోజుల్లో ఈ పంట కనుమరుగవుతుందేమోనన్న ఆందోళన నెలకొంది. చేతికందే కొద్దిపాటి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందడ ం కూడా పోతోంది. తూకాల్లో మోసాలు కూడా శాపంగా మారుతుంది. గతంలో జిల్లాలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో గజ్వేల్, సిద్దిపేట, తొగుట, మెదక్ తదితర చోట్ల ఎనిమిదివరకు కొనుగోలు కేంద్రాలను నాలుగేళ్ల క్రితం వరకు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఆ కేంద్రాలను పూర్తిగా ఎత్తేశారు. కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సొసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు.

 ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమవుతోంది. గతంలో సివిల్ సప్లయ్, ఎఫ్‌సీఐ కేంద్రాల్లో కచ్చితత్వం ఉండేది. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలి తాలు రావడం లేదనే అభిప్రాయం నెలకొం ది. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5 శాతం కమీషన్ ఇస్తున్నారు. ఈ సంస్థలకు మార్కెట్ యార్డులున్న చోట మార్కెటింగ్ శాఖ అధికారులు సమకూరుస్తుండగా మిగితాచోట్ల ఆ సంస్థలే సమకూర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాల కల్పన  భారంగా మారుతున్నది. ఈ విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నారు.

కాలం కలిసి రాక లాసైన..
నేను నాలుగెకరాల్లో వరి సాగు చేసిన. రెండు బోర్లున్నయ్. రెండేండ్ల సంది వానలు సరిగాలేక బోర్లలో నీళ్లు రాలేదు. వచ్చిన కొద్దిపాటి నీళ్లు వరికి సరిపోలే. పంట ఎంతో నష్టపోయిన. చేతికందే దశలో వడగండ్ల వాన మరింత నష్టం చేసింది. కాలం కలిసొస్తే నాకు వంద కింటాళ్ల ఒడ్లు వచ్చేవి. కానీ... 50 కింటాళ్లు మాత్రమే ఒచ్చినయ్. పెట్టుబడి కూడా సక్కగ ఎళ్లలేదు. మాకష్టమంతా మట్టిల పోయింది. వరుసగా నష్టాలే ఒస్తున్నయ్. తలుసుకుంటే దుఃఖమొస్తుంది.      - ఆకుల సుధాకర్, రైతు, జాలిగామ, మం: గజ్వేల్

పంట కరాబైంది..
నేను మూడెకరాల పొలంలో వరి ఏసిన. బోర్లు సక్కగ పొయ్యలె. పంట చేతికొచ్చే టైంల రాళ్లవాన పడ్డది. పంటంతా కరాబైపోయింది. కొద్దిపంటనే చేతికొచ్చింది. పెట్టుబడి రాక కష్టంగా ఉంది. ఏం జేయాలె. మా బాధలు ఎవలకు జెప్పుకోవాలే..? 
- తలకొక్కుల మల్లేశం, రైతు, పాములపర్తి, మం: వర్గల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement