జీఏపీ సర్టిఫికేషన్‌పై పొలంబడి శిక్షణ ఇస్తున్న ఎఫ్‌ఏవో అధికారులు
సాక్షి, అమరావతి: రసాయన అవశేషాలు లేని పంటల ధ్రువీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించే రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (జీఏపీ) సర్టిఫికేషన్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులను తీర్చిదిద్దేందుకు 2019లో శ్రీకారం చుట్టిన వైఎస్సార్ పొలం బడులను ప్రామాణికంగా తీసుకుని జీఏపీ సర్టిఫికేషన్ జారీ చేయనుంది.
సేంద్రియ ధ్రువీకరణ కోసం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీ ఎస్‌వోపీసీఏ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, జీఏపీ సర్టిఫికేషన్ కోసం క్వాలిటీ కంట్రోల్ కమిషన్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) నుంచి, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) నుంచి గుర్తింపు రానుంది.
ఎఫ్‌ఏవో ద్వారా శిక్షణ
వైఎస్సార్ పొలం బడుల్లో మూడేళ్లుగా శిక్షణ పొందుతున్న రైతులకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)తో కలిసి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. అక్టోబర్‌లో రాష్ట్ర , జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, ఈ నెల 10వ తేదీ నుంచి నెలాఖరు వరకు క్లస్టర్ పరిధిలో గుర్తించిన రైతులు, ఆర్బీకేల్లో పనిచేస్తున్న వీఏఏలకు శిక్షణ ఇవ్వనున్నారు.
చివరగా డిసెంబర్‌లో డివిజన్ స్థాయిలో నాన్‌క్లస్టర్ పరిధిలోని వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఎలకు పొలం బడుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రబీలో అత్యుత్తమ యాజమాన్య పద్ధతులను పాటించిన రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్‌లో జీఏపీ సర్టిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సర్టిఫికెట్‌తో రైతులు వారి ఉత్పత్తులను అమెరికా, యూరోపియన్ దేశాల్లోని అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ధరకు అమ్ముకునే అవకాశం కలుగుతుంది.
రబీలో 7,991 పొలం బడులు
కాగా, 2022–23 సీజన్‌లో 17 వేల పొలం బడుల ద్వారా 5.10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గడచిన ఖరీఫ్ సీజన్‌లో 8,509 పొలం బడుల ద్వారా 2.55 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా, ప్రస్తుత రబీ సీజన్‌లో 7,991 పొలం బడుల ద్వారా 2.4 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా వరిలో 2,828, అపరాల్లో 2,720, వేరుశనగలో 1,220, మొక్కజొన్నలో 834, నువ్వులులో 223, చిరుధాన్యాల్లో 142, పొద్దుతిరుగుడులో 24 పొలం బడులు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment