వర్షాలు కురుస్తున్నా దిగుబడి సగమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసిన పంటలు పూర్తిస్థాయిలో చేతికి అందడం కష్టమేనని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వర్షాలు ఆలస్యమైనందున అవి చాలా చోట్ల ఎండిపోయాయని... ప్రస్తుత వర్షాలకు పూర్తిగా కోలుకోవడం అసాధ్యమని వ్యవసాయశాఖ నిర్ధారణకు వచ్చింది. వర్షాలు, పంటల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం సమీక్షించారు. వివిధ శాఖల అధికారులతో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డితోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొంతభాగం పంటల ఎదుగుదల ఉండదని తేల్చిన వ్యవసాయ శాఖ దీంతో పంటల దిగుబడి తగ్గుతుందని పేర్కొంది. ఖమ్మం, ఆదిలాబాద్‌లలో మాత్రమే పంటల పరిస్థితి ఆశాజనకంగా ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లోని పత్తి, మొక్కజొన్న ఎండిపోయిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పటికీ వేసిన పంటల దిగుబడి సగానికి తగ్గుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. అయితే ఈ వర్షాలు ముందస్తు రబీ పంటలకు ప్రయోజనకరంగా ఉంటాయని అంటున్నారు. పాడి పరిశ్రమకు, పశుగ్రాసానికి కొరత ఉండదని... భూగర్భ జలాలు పెరుగుతాయనే ఆశాభావంతో ప్రభుత్వం ఉంది. వారం రోజుల్లో మరో అల్పపీడనం ఉందని... దీంతో దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొన్నట్లు తెలిసింది.
నిజామాబాద్‌లో 13 సెంటీమీటర్ల వర్షం...
గత 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్‌లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. మక్‌లూర్‌లో 9, డిచ్‌పల్లి, వెంకటాపురం, ఏటూరునాగారం, నావీపేట్‌లలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.