అబ్బో.. అబ్బూరి బ్రదర్స్‌! | Abburi Brothers Fraud in Name of Spring Valley Villas in Hyderabad | Sakshi
Sakshi News home page

అబ్బో.. అబ్బూరి బ్రదర్స్‌!

Published Mon, Apr 28 2025 5:13 AM | Last Updated on Mon, Apr 28 2025 5:13 AM

Abburi Brothers Fraud in Name of Spring Valley Villas in Hyderabad

ఓ ఆవారా కంపెనీకి రూ.3 వేల కోట్ల భూములా?

ఏపీ ప్రభుత్వం నిర్వాకాలపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ

హైదరాబాద్‌లో ‘స్ప్రింగ్‌ వ్యాలీ’ విల్లాల పేరుతో అబ్బూరి సోదరుల కుచ్చుటోపీ

కష్టార్జితాన్ని ధారపోసి మోసపోయిన బాధితుల లబోదిబో 

తమలా మరెవరూ మోసపోవద్దంటూ ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌ ఫోరంలో హెచ్చరిక  

అబ్బూరి సతీష్, అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ.. అబ్బూరి ఫ్యామిలీ చేతిలో మా కష్టార్జితాన్ని పోసి పూర్తిగా మోసపోయాం. మాలా మీరెవరూ మోసపోవద్దు. వీళ్లు పెద్ద మోసగాళ్లు. నీతి, నిజాయితీ అన్నదే లేదు. ఇక్కడ మమ్మల్ని మోసం చేసినట్లే పెద్ద వెంచర్‌ పేరుతో వైజాగ్‌లో వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి.    – హైదరాబాద్‌లో ఉర్సా బాధితుల ఆక్రోశం 

సాక్షి, అమరావతి: మోసాలే లక్ష్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టిన అబ్బూరి బద్రర్స్‌ హైదరాబాద్‌లో విల్లాల పేరుతో అనేక మందికి కుచ్చుటోపీ పెట్టారు! తాజాగా ఉర్సా ముసుగులో విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు! ఈ బాగోతం బయట పడటంతో ముసుగు దొంగల వెనక ఉన్న ముఖ్యనేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. ఈ నేపథ్యంలో ఓ ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.  

అబ్బూరీ.. ఇది నిజం కాదా? 
ఉర్సా క్లస్టర్స్‌లో ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న సతీష్‌ అబ్బూరి ఫ్యామిలీ ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ’ పేరుతో పలు డొల్ల కంపెనీలను నెలకొల్పి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఉంటున్నామని.. ఎన్నారైలమని.. తమ నెట్‌వర్త్‌ రూ.వందల కోట్లంటూ అబ్బూరి బ్రదర్స్‌ హైదరాబాద్‌లో విల్లాలు కడతామని ప్రచారం చేసుకుని కష్టార్జితాన్ని ధారపోసిన వారికి కుచ్చుటోపీ పెట్టారు. ముగ్గురు అన్నదమ్ముల్లో వెంకట్‌ అబ్బూరి, సతీష్‌ అబ్బూరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా హైదరాబాద్‌లో రామకృష్ణ అబ్బూరి పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించారు.

అమెరికాలో ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ఎల్‌సీ పేరుతో సతీష్‌ అబ్బూరి కంపెనీ నమోదు అయిన విషయాన్ని కేశినేని నాని సాక్ష్యాలతో సహా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేయడం తెలిసిందే. దీనికి అనుబంధంగా ఇండియాలో ఏర్పాటైన కంపెనీలో అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి లతతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), ఆయన భార్య కేశినేని జానకిలక్ష్మి డైరెక్టర్లుగా వ్యవహరించారు. కేశినేని చిన్ని వైదొలగిన తర్వాత జానకిలక్ష్మి డైరెక్టర్‌గా కొనసాగారు. అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్‌ ఎల్‌ఎల్‌సీకి అనుబంధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ఇండియాలో ఏర్పాటు చేశారు.  

అంతా కలసి పంగనామం.. 
హైదరాబాద్‌లోని నిజాంపేట, బాచుపల్లి, గాజులరామారం, ఎల్బీనగర్‌ వద్ద ‘స్ప్రింగ్‌ వ్యాలీ’ పేరుతో విలాసవంతమైన విల్లాలు నిరి్మస్తున్నట్లు సతీష్‌ అబ్బూరి ఫ్యామిలీ భారీగా ప్రచారం చేసింది. ఆ తర్వాత కోట్లాది రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వందలాది మంది తమ కష్టార్జితాన్ని వీరి వద్ద ఇన్వెస్ట్‌ చేసి దారుణంగా మోసపోయారు. కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో రామకృష్ణ ఫ్యామిలి రెండేళ్లు కనపడకుండా పారిపోయినట్లు ఓ బాధితుడు పేర్కొన్నారు. బాధితులు అంతా కలసి ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌లో ఒక ఫోరం ఏర్పాటు చేసుకుని అబ్బూరి ఫ్యామిలీ చేతిలో ఎలా మోసపోయారో ప్రపంచానికి చాటి చెప్పారు. తమలా మరెవరూ మోసపోవద్దని హెచ్చరించారు.

ఎట్టకేలకు అమెరికాలో పని చేస్తున్న సతీష్‌ అబ్బూరి ఒరాకిల్‌ కంపెనీ చిరునామా, ఫోన్‌ నంబరు వివరాలను సేకరించి అక్కడున్న వారు ఎవరైనా సాయం చేయాలంటూ ప్రాథేయపడ్డారు. దీన్ని బట్టి బాధితులు ఎంత నరకం అనుభవించారో ఊహించవచ్చు. ఆ ముగ్గురు సోదరులు తమ వెనుక పెద్ద శక్తులున్నాయని, తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్నారని ఓ బాధితుడు వాపోయాడు. ‘మోసగాళ్లయిన వీళ్లు వైజాగ్‌లో వెంచర్‌ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాలా మీరు మోసపోకండి..’ అంటూ పలువురు బాధితులు గతంలోనే హెచ్చరించారు. 

అదే మోసగాళ్లు ఇప్పుడు ఉర్సా పేరుతో మళ్లీ విచ్చేస్తున్నారంటూ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ’తో తనకు సంబంధం లేదని సతీష్‌ అబ్బూరి జూమ్‌ మీటింగ్‌లో పేర్కొన్నాడు. ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌లో బాధితుల వాయిస్‌లున్న పేజీలను డేటాబేస్‌ నుంచి పూర్తిగా తొలగించేశారు. ఒకపక్క బాధితులను బెదిరిస్తూ.. మరోపక్క వెబ్‌సైట్‌లో పేజీలను డిలీట్‌ చేయించటాన్ని బట్టి దొంగెవరో ప్రత్యేకించి చెప్పాలా..? అని బాధితులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement