Newest Luxury Villas Culture Trending In Hyderabad - Sakshi
Sakshi News home page

గేటెడ్‌ కమ్యూనిటీ కల్చర్‌: ఇల్లా.. హరి‘విల్లా’!

Published Sat, Feb 20 2021 2:59 AM | Last Updated on Sat, Feb 20 2021 4:21 PM

Villas Culture Trending In Hyderabad - Sakshi

ఊరి బయట ఉండాలి.. అంగట్లో అన్నీ ఉండాలి.. ఇప్పుడు నగరవాసులకు కావల్సిందిదే.. దాని కోసం ఖర్చుకూ వెనుకాడటం లేదు.. ఒక్కో విల్లాను అర ఎకరం, ఎకరం విస్తీర్ణంలోనూ నిర్మిస్తున్నారు. దానికి తగ్గట్లే శివార్లలో విల్లా కల్చర్‌ కొత్త సొబగులు అద్దుకుంటోంది.. మినీ నగరాల సృష్టికి నాంది పలుకుతోంది.. పుణే, ఢిల్లీ, ముంబై వంటి మెట్రోలకు దీటుగా బెంగళూర్, మేడ్చల్, శ్రీశైలం హైవేల మీద ఈ కల్చర్‌ జోరు స్పష్టంగా కనిపిస్తోంది.  

సాక్షి, హైదరాబాద్‌: గేటెడ్‌ కమ్యూనిటీ కల్చర్‌లో భాగంగా.. ఒకే ప్రాంగణంలో పదులు, వందల సంఖ్యలో ఇళ్లు లేదా ఫ్లాట్స్‌ ఉండటం, నివాసితులకు అవసరమైన విధంగా జిమ్స్, క్లబ్‌ హౌస్‌లు... వంటివాటిని నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే. అయితే, విల్లా కల్చర్‌ అంతకుమించిన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ విలాసాలకు ఆకాశమే హద్దు అన్నట్టుగా విస్తరిస్తోంది. పోష్‌ పీపుల్‌ తమ మోడ్రన్‌ లైఫ్‌ స్టైల్‌ సిగ్నేచర్‌గా దీన్ని మార్చుకుంటున్నారు. 

సుదూరమైనా.. ప్రశాంతంగా..
కాంక్రీట్‌ జంగిల్‌గా మహానగరం విస్తరిస్తుండటంతో హైదరాబాద్‌కు కనీసం 30 నుంచి 50 కి.మీ. దూరంలో నివసించడానికి కూడా సిటీజనులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. పచ్చని ప్రాంతాల్లో ప్రశాంతమైన పరిసరాలను కోరుకుంటున్నారు. జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్, టెన్నిస్, బ్యాడ్మింటన్, గోల్ఫ్, ఇతర స్పోర్ట్స్‌ప్లేస్‌లు, ఆహ్లాదాన్నిచ్చే పార్కులు, విందు వినోదాలకు క్లబ్‌హౌస్‌లు వంటి వసతులతో టౌన్‌షిప్స్‌ పుట్టుకొస్తున్నాయి. 

పట్టణం సాక్షిగా పల్లె ప్రేమ..
ఇంటి ముందు ఆడుకునే పిల్లలు, పచ్చని చెట్లు, పార్కుల్లో పిచ్చాపాటీ మాట్లాడుకునే పెద్దలు, నీటి కొలనులు, ఆధ్యాత్మికత పంచే ఆలయాలు... ఇలాంటి పల్లె వాతావరణం వైపు నగరవాసులు తిరిగి దృష్టి మళ్లిస్తున్నారు. పట్టణంలో ఉండే ఆధునిక వసతులు, పల్లెల్లోని పరిసరాల ప్రశాం తతను వీరు కోరుకుంటున్నారు. దీంతో విల్లాలు, అత్యాధునిక టౌన్‌షిప్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. 

లంకంత ఇల్లు.. అడుగడుగునా థ్రిల్లు..
ఒకప్పుడు ఎకరా, అర ఎకరా స్థలంలో ప్లాట్లు వేసి విక్రయించేవారు. ఈ విల్లా కల్చర్‌ పుణ్యమాని ఇప్పుడు అదే విస్తీర్ణంలో లంకంత ఇల్లు కడుతు న్నారు. నిజానికి వాటిని ఇళ్లు అనడం కన్నా చిన్న పాటి ఊర్లు అనొచ్చేమో... వేలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన మాన్షన్‌లు, వాటికి నలువైపులా రోడ్లు, స్విమ్మింగ్‌పూల్, సెంట్ర లైజ్డ్‌ బయోగ్యాస్‌ సరఫరా, 2 కి.మీ. వాకింగ్‌ ట్రాక్, స్పా, బ్యూటీ సెలూన్, జిమ్నాసియమ్, టెన్నిస్, స్క్వాష్, బ్యాడ్మింటన్, స్నూకర్, బాస్కెట్‌ బాల్, పార్టీ లాన్, టీ కార్నర్, బాంక్వెట్స్, హోమ్‌ థియే టర్, గెస్ట్‌ రూమ్స్, లాంజ్, ఎలివేటర్‌ సౌక ర్యం, కనీసం 4 నుంచి 5 కార్లు పట్టేలా పార్కింగ్‌ప్లేస్‌ ఇలాంటి ఒక చిన్న అల్ట్రామోడ్రన్‌ సిటీకి అవ సర మైన సౌకర్యాలన్నీ ఒక విల్లాలోనే ఏర్పాటు చేస్తుండ డంతో ఇవి సిటీలోని రిచ్‌ పీపుల్‌ని ఆకర్షిస్తున్నాయి. 

మోడ్రన్‌ టౌన్‌... మెరుపుల క్రౌన్‌..
ఎంట్రన్స్‌ ప్లాజా పేరిట దాదాపు 3 నుంచి 5 ఎకరాల దాకా స్థలాలు కేటాయించడం అంటేనే.. ఈ మోడ్రన్‌ సిటీస్‌ లుక్‌ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇక లోపలకి వెళితే.. కనీసం 60 నుంచి 100 అడుగులలో వెడల్పాటి రోడ్లు, సైక్లింగ్‌ ట్రాక్స్, రహదారులకు ఇరువైపులా పచ్చని చెట్లు, నలు చెరగులా కొలువైన శిల్పాకృతులు, డ్రిప్‌ వాటర్‌ ఇరిగేషన్‌ సిస్టమ్, నిర్ణీత దూరంలో పార్కులు, నాలుగైదెకరాల స్థలంలో గోల్ఫ్‌ కోర్టు దాదాపు 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌ హౌస్‌... వంటివాటిని చూస్తే... ఆహా ఇది ఏ విదేశీ నగరమో కదా అన్నంత అనుభూతి కలిగేలా విల్లాసం ఉట్టిపడేలా చేస్తున్నారు.  

ఇలాంటి మోడ్రన్‌ విల్లా కమ్యూనిటీస్‌లో ఒక విల్లా స్వంతం చేసుకోవాలన్నా... దాదాపుగా రూ. 20 నుంచి 25 కోట్ల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. అయినప్పటికీ నగరానికి చెందిన పేజ్‌ త్రీ పీపుల్, సినిమా రంగ ప్రముఖులు, సంపన్న వ్యాపారులు వెనుకాడడం లేదు. కాంక్రీట్‌ జంగిల్‌లో కోట్లు ఖర్చు చేసి ఫ్లాట్స్, బిల్డింగులతో పోలిస్తే ఇదే మేలు అనుకుంటూ కొందరు... సిటీ నుంచి వేర్వేరు ఊర్లకు వెళ్లి రిలాక్స్‌ అయ్యే బదులు ఇదే బెటర్‌ అంటూ మరికొందరు.. ఖరీదుకు వెనుకాడటంలేదు.

వారంలోపే సేల్‌..
రియల్‌ బూమ్‌ కారణంగా గాని, విభిన్న వ్యాపారాల ద్వారా గానీ పెద్ద మొత్తంలో ఆర్థికంగా పెద్ద స్థాయికి చేరినవారు ఈ తరహా విల్లాలవైపు చూస్తున్నారు. ఒకప్పుడు స్టేటస్‌ కోసం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ వంటి ప్రాంతాల్లో కొనుగోలు చేయాలని అనుకునేవారు. అయితే, ఇప్పుడు అక్కడ ఉండేవారు కూడా శివారు ప్రాంతాలవైపే దృష్టి మళ్లించారు. దీంతో కనీసం రూ.20 కోట్లు ఖరీదైన విల్లాలు కూడా కేవలం వారంలోనే వెంచర్‌ మొత్తం అమ్ముడవుతున్న పరిస్థితులున్నాయి. ఇలాంటి కొన్ని వెంచర్లలో అయితే సదరు కొనుగోలు దారుని స్థితిగతులను ఇంటర్వ్యూ చేసిగానీ విల్లా విక్రయించడం లేదంటే డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
– కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చైర్మన్, కేఎల్‌ఆర్‌ ప్రాపర్టీస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement