రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు' | Chandrababu Govt handed over AP state treasury to private individuals | Sakshi
Sakshi News home page

రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'

Published Sun, Apr 27 2025 4:55 AM | Last Updated on Sun, Apr 27 2025 3:22 PM

Chandrababu Govt handed over AP state treasury to private individuals

భావితరాల ఖనిజ సంపదపై ప్రైవేట్‌ వారికి సర్వ హక్కులు

దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా అడ్డగోలు ఒప్పందం

ఏకంగా రాష్ట్ర ఖజానాను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెప్పిన బాబు సర్కార్‌ 

ఏకంగా 436 గనులపై పూర్తి హక్కులు ప్రైవేట్‌కు ధారాదత్తం  

గనుల్లో అక్రమాలను ప్రశ్నించకూడదు నిబంధనలు ఉల్లంఘించినా లీజు రద్దు చేయకూడదు 

నిర్ణీత సమయంలోపు డబ్బులు చెల్లించకుంటే గనులను వేరే వారికి వాళ్లే బదలాయించొచ్చు 

ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్థిక శాఖ ఐఏఎస్‌ అధికారి అత్యుత్సాహం 

అప్పు కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా అడ్డగోలు నిబంధనలు 

రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే శిక్ష తప్పదంటున్న విశ్లేషకులు

అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్‌ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను ప్రైవేట్‌ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.

తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్‌ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు.  

436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్‌ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్‌ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఆ గనుల్లో అక్రమ మైనింగ్‌ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. 

ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్‌ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్‌ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు.  

వివాదాలు వచ్చినా నిస్సహాయతే! 
ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. 

మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. 

నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియ లేకుండా మైనింగ్‌ లీజులు, మైనింగ్‌ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్‌ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్‌ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు.  

డీఎస్‌ఆర్‌ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? 
మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ (డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ ఎకౌంట్‌) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. 

ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్‌బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఏపీఎండీసీ భవిష్యత్‌ ఆదాయంపై అప్పులు  
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్‌ లోపల.. బడ్జెట్‌ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. 

ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. 

బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్‌ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం   

అప్పులు పుట్టకే ఎన్‌సీడీ బాండ్లు 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్‌ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్‌ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. 

ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చింది. అంటే.. డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి  ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రాజ్యాంగ ఉల్లంఘనే 
ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నేరుగా డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. 

అంటే.. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ), వేజ్‌ అండ్‌ మీన్స్‌ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు.  

ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే
గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన 
⇒ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. 
⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి  
⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు 
⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చు

బాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్‌ అధికారి అయిన ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్‌ కుమార్, మరో ఐఏఎస్‌ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్‌ కుమార్‌ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. 

తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్‌ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్‌ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్‌ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. 

సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్‌ బాస్‌ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement