
ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.
సాక్షి, తూర్పుగోదావరి: ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం.. ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ప్రవీణ్ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని.. తూర్పుగోదావరి ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఈ నెల 24న ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1.29 గంటలకు చౌటుప్పల్ టోల్‌గేట్ దాటారు. విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయంపై ట్రాక్ చేస్తున్నాం. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11:40 గంటలకు చేరుకున్నారు. 11:42కు ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని అంశాలకు సంబంధించి సమాచారం వచ్చింది. చేతులు, ముఖంపై కొన్ని గాయాలు ఉన్నాయని తేలింది. పూర్తి వివరాలు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ప్రవీణ్ ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కారు ఢీ కొడితే మోటార్ సైకిల్ కింద పడిందా లేదా.. అన్న విషయాన్ని కూడా ట్రాన్స్‌పోర్టు అధికారులు పరిశీలిస్తున్నారు.’’ అని ఐజీ చెప్పారు.
జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని తెలిపారు. ‘‘అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్ కొంత స్థలం కొనుగోలు చేశారు. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమండ్రి వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్‌కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం’’ అని ఎస్పీ తెలిపారు.