
చెరువులో ఆడుకుంటూ మునిగిన చిన్నారులు
వారిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి, మరోచిన్నారి మృత్యువాత
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
ములకలచెరువులో తీవ్ర విషాదం
కొన్ని క్షణాలకు ముందు పక్కనే భర్త.. ఆడుకుంటూ బిడ్డలు.. సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయతి్నంచిన భర్త కళ్ల ముందు కడతేరిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సరదాలతో నిండిన ఆ కుటుంబంలో ఇప్పుడు ఆమె ఒక్కతే మిగిలింది. ఇక ఒంటరిగానే బతకాలి. చిన్నారులు దేవుడితో సమానం అంటారు. ఆ దేవునికి అభం శుభం తెలియని పసిబిడ్డలపై జాలి కూడా కలగలేదేమో. వారితోపాటు తండ్రిని తీసుకెళ్లిపోయిన విషాద ఘటన మాటల్లో చెప్పలేనిది. బిడ్డల్లారా అప్పుడే నూరేళ్లు నిండాయా..దేవుడా ఏమిటీ ఘోరం అంటూ స్థానికుల కంటతడి పెట్టించిన విషాదకర ఘటన ఇది.
ములకలచెరువు: బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తున్న తల్లిని చూసి అమ్మా మేము వస్తామంటూ ఇద్దరు పిల్లలు వెంట వెళ్లారు. వీళ్లతో పాటు పొరుగింటి చిన్నారి కూడా వెళ్లింది. వీరు ముగ్గురు చెరువు నీటిలో ఆడుకుంటూ మునిగిపోతుంటే చూసిన తండ్రి కాపాడేందుకు నీళ్లలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని పెద్దచెరువులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... జగనన్న కాలనీలో ఈశ్వరమ్మ(34), మల్లే‹Ù(38) నివాసం ఉంటున్నారు. వీరికి లావణ్య(12) నందకిషోర్(09) సంతానం.
వీరి ఇంటి పక్కనే నందిత(11) అనే బాలిక ఉంటోంది. వీరు ముగ్గురు సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుక్కుంటున్న ఈశ్వరమ్మ, మల్లే‹Ùలు పిల్లలు ఆడుకుంటున్నారని వారి పనిలో నిమగ్నమయ్యారు. చెరువు కుంటలో ఆడుకుంటూ పిల్లలు మునిగిపోయారు. వీరి అరుపులు వినిపించకపోవడంతో పిల్లల కోసం మల్లేష్ కుంటలోకి దూకాడు.వారిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో ములకలచెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లేదుటే పిల్లలు, భర్త మునిగి చనిపోతుంటే వారిని కాపాడేవారి కోసం ఈశ్వరమ్మ గట్టిగా కేకలు వేసింది.అయితే సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పక్కనే ఉన్న రాజీవ్‌నగర్‌లోకి పరుగెత్తుకెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులు చెరువు వద్దకు పరుగుతీసి కాపాడేందుకు ప్రయతి్నంచారు. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది.
ఒంటరిగా మిగిలి...
ఈశ్వరమ్మ, మల్లేష్ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పిల్లలు లావణ్య ఆరోతరగతి, నందకిషోర్ ఐదోతరగతి చదువుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు సెలవులు కావడంతో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి వెంట వచ్చారు. చెరువులో నీటిని చూసి మురిసిపోయిన చిన్నారులు ఆడుకుంటూ మడుగులో పడి ఊపిరాడక చనిపోయారు. కాపాడేందుకు వెళ్లిన మల్లేష్ సైతం మునిగి చనిపోయాడు. భర్త పిల్లలు దూరం కావడంతో ఈశ్వరమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లెదుటే భర్త పిల్లలు చనిపోవడంతో అమె బోరున విలపించడం చూసి చూపరులు కంటతడిపెట్టారు.
తోడుగా వెళ్లి...
జగనన్న కాలనీలో ఉంటున్న మల్లే‹Ù, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.