
మాడుగుల(అనకాపల్లి జిల్లా): ఎన్నికలకు ముందు హామీలకు హామీలు కురిపించి అధికారం వచ్చిన తర్వాత వాటిని గాలికొదిలేస్తోంది ఏపీ ప్రభుత్వం. హామీలను అమలు చేయకపోవడంపై ఏపీ ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. తాజాగా అనకాపల్లి జిల్లాలోని ఏడు గ్రామాల గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గ్రామాలకు చెందిన గిరిజనులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు.

తమకు రోడ్లేవి అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనిలో భాగంగా 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు ఏడు గ్రామాల ప్రజలు. రోడ్డు కోసం మాడుగల ఎంపీడీవో కార్యాలయం ముందు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో వినతిపత్రం సమర్పించారు గిరిజనులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా తమ రోడ్డు గురించి ఇప్పటివరకూ పట్టించుకోలేదని మండిపడుతున్నారు.

. వర్షాలు పడితే వాగులు, వంకలు దాటాల్సి వస్తుందని, గర్భిణీలకు హాస్పిటల్ కు డోలీలు కట్టి తీసుకెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు స్థానికులు కాకపోవడం వలన తమ సమస్యలను పట్టించుకునే వారే లేరంటున్నారు.