
12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం
పెద్ద మనుషులతో రూ. లక్ష సెటిల్‌మెంట్..రూ. 20వేల అడ్వాన్స్
విషయం వెలుగుచూడడంతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
సీఎం సొంత నియోజకవర్గంలో దారుణ ఘటన
సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం..శుభం తెలియని 12 ఏళ్ల బాలికను చెరబట్టాడు టీడీపీకి చెందిన ఓ కామాంధుడు. అలాంటి వాడిని శిక్షించాల్సిన కుటుంబ సభ్యులు వెనకేసుకొచ్చారు. ఏదో చిన్న తప్పు జరిగిపోయింది..ఇక్కడితో వదిలేద్దామని బాధిత బాలిక తండ్రిని బెదిరించి బలవంతంగా ఒప్పించారు. ఆ బాలిక శీలానికి విలువ కట్టారు. రూ. లక్ష అపరాధంగా చెల్లించేందుకు నిర్ధారిస్తూ ..అడ్వాన్స్ గా రూ. 20వేలు చెల్లించారు. ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది ఎక్కడో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే.
వివరాల్లోకి వెళితే..
10 మంది సంతానమున్న ఓ తండ్రి పొట్టకూటి కోసం కుటుంబాన్ని తీసుకుని సమీపంలోని వేరే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఓ రైతు దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా పిల్లలు గొర్రెలు, ఆవులు మేపుతున్నారు. వారిలో పన్నెండేళ్ల బాలిక బుధవారం (ఏప్రిల్ 2) అడవిలోకి వెళ్లింది. ఆమెను గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆర్ రమేశ్ అనుసరించాడు.
నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధ భరించలేని ఆ బాలిక కేకలు వేస్తూ పరుగులు తీసింది. గమనించిన ఓ వ్యక్తి బాధితురాలని ఏమైందని ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని తెలియజేసింది. ఆ వ్యక్తి రమేశ్‌ను మందలించి పిడిగుద్దులు కురిపించాడు.
రూ. లక్షకు ఒప్పందం..రూ. 20వేల అడ్వాన్స్
నిందితుడి కుటుంబ సభ్యులు ఈ విషయం బయటికి పొక్కకుండా పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి బాలిక తండ్రితో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. లక్ష ఇస్తామని, ఎవరితోనూ చెప్పవద్దంటూ అడ్వాన్స్‌గా రూ. 20వేలు ముట్టజెప్పారు. అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు విచారణ చేపట్టి రమేశ్ లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారించారు.
బాధిత బాలిక కుటుంబ సభ్యులను కుప్పం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు రమేశ్ పరారయ్యాడు. కాగా ఫేస్‌బుక్ ఖాతాలో టీడీపీ నాయకులతో దిగిన ఫొటోలు, బ్యానర్లను రాత్రికి రాత్రే తొలగించాడు.