
రెడ్‌బుక్ సాక్షిగా ‘సిట్’ బృందం బరితెగింపు.. కొడుకు అబద్ధపు సాక్ష్యం కోసం తండ్రి కిడ్నాప్
అర్ధరాత్రి తిరుపతిలో ఇంటిపై దాడి చేసి అరాచకం.. హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
మరోచోట కుమారుడిని వేధించేందుకు తండ్రికి నోటీసులు
న్యాయవాదిని బయటే ఉంచి ఒంటరిగా 8 గంటలపాటు విచారణ
తాము చెప్పినట్లు వినకపోతే మరిన్ని కేసులు పెడతామని హెచ్చరిక
కుటుంబ సభ్యులందరినీ వేధిస్తామని తీవ్రంగా బెదిరించిన సిట్ చీఫ్
మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో ‘సిట్’ లీలలు
సాక్షి, అమరావతి: కిడ్నాపర్ల నుంచి రక్షించాల్సిన పోలీసులే కిడ్నాపులకు పాల్పడితే.. వేధించేందుకు సాక్షి తండ్రిని అపహరిస్తే.. కుమారుడిని బెదిరించేందుకు తండ్రికి నోటీసులు ఇస్తే.. అది కచ్చితంగా చంద్రబాబు మార్కు పోలీసు జులుం అని చెప్పొచ్చు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ బృందం ఇంతగా బరితెగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేతిలో కిరాయి మూకగా మారి.. చట్ట నిబంధనలతో పని లేదని, రెడ్‌బుక్కే తమ రాజ్యాంగమని తేల్చి చెబుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ అరాచకం సృష్టిస్తోంది.
లేని అక్రమాలను నిరూపించేందుకు అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడమే ఏకైక మార్గమని భావిస్తోంది. అందుకోసం కొందర్ని సాక్షులుగా పేర్కొంటూ అబద్ధపు సాక్ష్యాలు చెప్పాలని వేధిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన కిరణ్ రెడ్డి అనే యువకుడిని సిట్ బృందం కొన్ని రోజులుగా బెంబేలెత్తిస్తోంది. తాను అబద్ధపు సాక్ష్యం చెప్పనని ఆ యువకుడు స్పష్టం చేయడంతో సిట్ పోలీసులు సందిగ్దంలో పడ్డారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు. సివిల్ దుస్తుల్లో వెళ్లి కిరణ్ నివాసంపై అర్ధరాత్రి దండెత్తారు.
ఆయన ఇంట్లో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో కిరణ్ ఇంట్లో లేడు. దాంతో ఆయన తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం రెడ్డిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. తాను పోలీసు కానిస్టేబుల్‌గా పని చేశానని, నిబంధనలకు విరుద్ధంగా తనను ఎలా తీసుకువెళ్తారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినా సిట్ అధికారులు ఏమాత్రం పట్టించుకో లేదు. ఈ కేసులో తన కుమారుడిని సాక్షిగా పేర్కొంటూ.. తనను బలవంతంగా తీసుకెళ్లడం ఏమిటని ఆయన ఎంతగా వాదించినా ఫలితం లేకపోయింది.
60 ఏళ్లు పైబడిన వృద్ధుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాథేయపడినా వినిపించుకో లేదు. అర్ధరాత్రి వేళ ఆయన్ని సిట్ బృందం కిడ్నాప్ చేసింది. ఈ వ్యవహారంపై సుబ్రమణ్యంరెడ్డి బంధువు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. తన మామను పోలీసులు కిడ్నాప్ చేశారని, ఆయన్ను వెంటనే ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
సుబ్రమణ్యం రెడ్డి ఎక్కడ ఉన్నా న్యాయస్థానంలో హాజరయ్యేందుకు అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. మరోవైపు కిరణ్ కూడా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను కూడా పోలీసులే అపహరించుకుపోయి ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
కొడుకు మీద కేసు.. తండ్రికి నోటీసులా?
అక్రమ కేసు అయినా సరే.. ఎవరి మీద కేసు పెడితే వారిని విచారణకు పిలవడం అన్నది దర్యాప్తు ప్రాథమిక సూత్రం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అరాచకానికి తెగబడుతోంది. వైఎస్సార్‌సీసీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో అప్పటి ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన్ని నిందితుడిగా చేర్చారో.. సాక్షిగా చేర్చారో అన్నది స్పష్టత ఇవ్వకుండా వేధింపులకు దిగుతోంది.
ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని విచారించాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం విచారణకు రాలేనని, సమయం కావాలని కోరారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆయనతో సిట్ అధికారులు సంప్రదించాలి. తగిన రీతిలో చట్టబద్ధంగా విచారించాలి. కానీ చంద్రబాబు జమానాలో పోలీసులు తమకు రెడ్‌బుక్కే రూల్ బుక్ అని పేట్రేగిపోతూ రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు రావాలని ఆయనకు సైతం నోటీసులు ఇచ్చారు.
ఏ ప్రాతిపదికన ఆయనకు నోటీసులు ఇస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిందితులో, సాక్షులో అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తాం.. విచారణకు పిలుస్తాం.. అని ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసుతో సంబంధం లేని వారిని వేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్రరెడ్డి తన న్యాయవాదితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు.
కానీ కార్యాలయం ప్రధాన గేటు వద్దే ఆ న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. ఉపేంద్ర రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించారు. పలు దఫాలుగా రాత్రి 7.30 గంటల వరకు విచారించారు. ఉద్దేశ పూర్వకంగా ఏకంగా 8 గంటలపాటు సిట్ అధికారులు ఆయన్ను ఒత్తిడికి గురిచేశారు. ఈ కేసుతోగానీ, అందుకు సంబంధించిన కంపెనీలతోగానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా అంత సుదీర్ఘ సమయం కార్యాలయంలోనే ఉంచడం సిట్ అధికారుల వేధింపులకు తార్కాణం.
మేం చెప్పినట్లు వినాల్సిందే
విచారణలో ఉపేంద్ర రెడ్డిని విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్‌బాబు తీవ్ర స్థాయిలో బెదిరించారు. తాము చెప్పినట్లు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే కుమారుడు రాజ్ కసిరెడ్డినే కాకుండా యావత్ కుటుంబ సభ్యులందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు. తమ మాట వినకపోతే మును ముందు మరింతగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని చెప్పారు.
21న హాజరుకండి
తీవ్రంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనం
ఏం నేరం చేశారో చెప్పకుండా.. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో తెలియచేయకుండా 60 ఏళ్ల వృద్ధుడిని తిరుపతి నుంచి విజయవాడకు తీసుకొచ్చి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్బంధించిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21న స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆ వృద్ధుడిని ఆదేశించింది. కోర్టు ముందు హాజరయ్యేందుకు వీలుగా ఈ నెల 20, 21వ తేదీల్లో ఏ అధికారి ముందు గానీ, దర్యాప్తు అధికారి ముందు గానీ హాజరు కానవసరం లేదని స్పష్టం చేసింది.
వృద్ధుడిని ఇంటి నుంచి తీసుకెళ్తుండటానికి సంబంధించి పిటిషనర్ సమర్పించిన ఫొటోల్లోని పోలీసులు ఎవరో గుర్తించి, ఆ వివరాలను తమ ముందుంచాలని సిట్ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
60 ఏళ్లు పైబడిన వృద్ధుడు, మాజీ పోలీసు అయిన టి.బాల సుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారని, ఆయన ఆచూకీ తెలియడం లేదని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలని బంధువు మేకా వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణు తేజ వాదనలు వినిపించారు.