
ఇది చంద్రబాబు ఏడాది పాలన విజన్
రూ.5,750 కోట్లు కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో గురువారం చేసిన రుణం
రూ.1.54 లక్షల కోట్లు పది నెలల్లోనే చంద్రబాబు చేసిన అప్పులు
రాష్ట్ర చరిత్రలో ఏడాదిలోనే ఇంత అప్పులు చేసిన ఘనత బాబుదే
గత ఆర్థిక ఏడాది కేంద్రం అనుమతికి మించి రూ.24,805 కోట్లు అదనంగా అప్పు
ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీల అమలు ఊసే లేదు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించడంలో తిరోగమనం.. అప్పులు చేయడంలో మాత్రం రికార్డు స్థాయిలో వృద్ధి..! అసలు అప్పుతోనే ఆర్థిక సంవత్సరం మొదలు..! ఏడాది పాలన పూర్తి కాకముందే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇది..! పది నెలల్లోనే ఏకంగా రూ.1,54,865 కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపారు. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఏడాదిలోపే ఇంత పెద్ద మొత్తం అప్పు చేసిన ఘనత రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు సారథ్యంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వానికే దక్కడం గమనార్హం.
అప్పు కావాలి మహాప్రభో..
కొత్త ఆర్థిక సంవత్సరం (2025–26) మంగళవారం మొదలైంది. అంతలోనే అప్పు కావాలి మహాప్రభో అంటూ చంద్రబాబు ప్రభుత్వం బయల్దేరింది. ఈ నెల 3న గురువారం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.5,750 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇప్పటివరకు బడ్జెట్‌లో చేసిన అప్పులే రూ.1,04,445 కోట్లకు చేరాయి.
» మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అనుమతించిన దానికి మించి చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. 2024–25లో ఆంధ్రప్రదేశ్‌కు ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.73,900 కోట్లు అప్పునకు కేంద్రం ఓకే చెప్పగా.. రూ.98,705 కోట్లు అప్పు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా బడ్జెట్‌లోనే రూ.24,805 కోట్లు ఎక్కువగా అప్పు చేసిందన్నమాట.
» మరోపక్క బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో ఏకంగా రూ.19,410 కోట్లు అప్పు చేశారు. రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
‘అప్పు’డు అనవసర గగ్గోలు.. ఇప్పుడు గప్‌చుప్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టాయి. ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగాయి. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతోందంటూ విషం చిమ్మాయి. ఇప్పుడు బడ్జెట్‌లోనే చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతికి మించి అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం లేదు.
హామీలు అటకమీదనే..
ఇంత పెద్దమొత్తంలో అప్పులు చేస్తున్నా సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు తాత్సారం చేస్తున్నారు. ఆస్తుల కల్పనకు గానీ సంక్షేమానికి గానీ పైసా వ్యయం చేయడం లేదు.
» సూపర్ సిక్స్‌లో మొదటిది అయిన యువతకు 20 లక్షల ఉద్యోగాలు
కల్పించే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీకి ఇప్పటివరకు దిక్కు లేదు.
» అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి అమలు చేయడం లేదు.
» ఒకపక్క ఎక్కువ అప్పులు తీసుకుంటూనే మరోపక్క సూపర్ సిక్స్ హామీలను చూస్తుంటే భయం వేస్తోందని, వాటి అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటంగమనార్హం.

బడ్జెట్ అప్పు
» ఏప్రిల్ 3వ తేదీ చేసిన అప్పు రూ.5,750కోట్లు
» మార్చి 24వ తేదీ చేసిన అప్పురూ.4,548కోట్లు
» మార్చి 4వ తేదీన చేసిన అప్పురూ.3,600కోట్లు
» ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కాగ్ గణాంకాలమేరకు అప్పురూ.90,557కోట్లు
» మొత్తంరూ.1,04,455 కోట్లు
బడ్జెటేతర అప్పు
మార్క్‌ఫెడ్‌రూ.6,700 కోట్లు
పౌర సరఫరాల సంస్థ రూ.2,000కోట్లు
ఏపీఐఐసీరూ.1,000కోట్లు
ఏపీఎండీసీ రూ.9,000కోట్లు
ఏపీ.పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌రూ.710 కోట్లు
మొత్తం రూ.19,410 కోట్లు
రాజధాని అప్పులు
హడ్కో రూ.11,000 కోట్లు
ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు రూ.15,000 కోట్లు
జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్యూ సంస్థరూ.5,000 కోట్లు
మొత్తం రూ.31,000 కోట్లు