
గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఇందులో విశాఖ వాసి చంద్రమౌళి, కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు ఉన్నారు. చంద్రమౌళి ఎస్‌బీఐ రిటైర్డ్ ఎంప్లాయి కాగా, మధుసూదన్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెఈలో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నారు. ఈ ఇద్దరి మృతిని ధృవీకరించిన కేంద్ర హోం శాఖ.. ప్రత్యేక విమానంలో మృతదేహాలను స్వస్థలాలకు పంపించింది.
ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్.. పర్యాటకులను దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను కేంద్రం ప్రభుత్వం ఆదుకుని ఆండగా నిలవాలని వైఎస్ జగన్ కోరుతున్నారు.