
మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన
బాధితుల కష్టాలను స్వయంగా చూశా..
వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
ఈ విపత్తు కూడా కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లేనని వైఎస్ జగన్ ద్వజం
సాక్షి, అమరావతి: వరద బాధితుల కోసం వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఆయన నాయకులతో సమీక్షించారు. మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించినప్పుడు బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని చెప్పారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.
కూటమి ప్రభుత్వ «ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని.. అయినా తమపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వరద బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ తరఫున ఉడతా భక్తిగా కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు.
వరద బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ
విజయవాడలో వరద బాధితులకు వైఎస్సార్‌సీపీ తరఫున రూ.కోటి సాయం చేయబోతున్నామని, అందులో భాగంగా బుధవారం ఉదయం లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని, ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ తర్వాత స్థానిక అవసరాలు గుర్తించి, పార్టీ నుంచి సాయం అందిస్తామని, మొత్తం ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. మంగళవారం విజయవాడ బ్రాహ్మణవీధిలోని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ నేతలు వెలంపల్లి, సామినేని ఉదయభానులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
