
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన ‘‘యువత పోరు’’(Yuvatha Poru) పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.
యువత పోరు పోస్టర్‌ను లాంఛ్ చేసిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) మీడియాతో మాట్లాడారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.

👉రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్‌ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఎక్కడికక్కడే మెమోరాండం సమర్పించబోతున్నాం. ఫీజు బకాయిలతో పాటు నిరుద్యోగ సమస్య, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలపైనా యువత పోరు ఉండనుంది.
👉నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది.
కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం నాణ్యమైన వైద్యం అందించాలని జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఐదు కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు. కానీ, చంద్రబాబు ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుందాం.
విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దాం. యువత పోరును పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం’’ అని వైఎస్సార్‌సీశ్రేణులను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు.
