సీతారామలో ఏదీ? | - | Sakshi
Sakshi News home page

సీతారామలో ఏదీ?

Published Thu, Apr 17 2025 12:31 AM | Last Updated on Thu, Apr 17 2025 12:31 AM

సీతారామలో ఏదీ?

సీతారామలో ఏదీ?

‘రాజీవ్‌’ స్ఫూర్తి..
ప్రారంభం కాని డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు
● నెలల తరబడి కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ● గతంలో శరవేగంగా పూర్తయిన రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ● ప్రాజెక్టు ఫలాలు ‘భద్రాద్రి’కీ అందించాలంటున్న రైతులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులు ఎక్కువ మంది భద్రాద్రి జిల్లాలో ఉంటే.. గరిష్ట ప్రయోజనాలు మాత్రం ఖమ్మం జిల్లాకే దక్కుతున్నాయనే విమర్శలున్నాయి. దీనికి తోడు ఈ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణ పనుల్లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది.

పూర్తి కాని టెండర్ల ప్రక్రియ..

జిల్లా పరిధిలో నిర్మించే డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల కోసం గతేడాది అక్టోబర్‌లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమై వేగంగా సాగుతోంది. మరోవైపు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణ పనులకు గతేడాది అక్టోబర్‌లోనే టెండర్లు పిలిచారు. అప్పటి నుంచి వివిధ కారణాలతో టెండర్ల గడువు పొడిగిస్తూ 2025 జనవరి వరకు లాగారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు చేపట్టే కంపెనీల ఎంపిక ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకు అగ్రిమెంట్లు జరగలేదు. దీంతో నిర్మాణ పనులు ఇంకా మొదలే కాలేదు. ఫలితంగా పనులకు అనువుగా ఉండే వేసవి సమయం వృథా అవుతుండగా.. అంచనా వ్యయం కూడా పెరుగుతోంది. 2024 జూలైలో ఇరిగేషన్‌ అధికారులు సమర్పించిన రిపోర్టులో జిల్లా పరిధిలోని నాలుగు ప్యాకేజీల నిర్మాణ అంచనా వ్యయం రూ.1,656 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ. 1,773 కోట్లకు చేరుకుంది.

‘రాజీవ్‌’ ఆదర్శంగా..

2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి రాగానే సీతారామ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. గోదావరి జలాలను తక్షణమే ఖమ్మం జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు అందించేందుకు రాజీవ్‌ లింక్‌ కెనాల్‌కు శ్రీకారం చుట్టడంతో పాటు సుమారు రూ.100 కోట్లు మంజూరు చేసింది. అధికారులు యుద్ధప్రాతిపదికన భూ సేకరణ చేపట్టారు. అటవీ శాఖ అనుమతులు సాధించారు. కాలువ నిర్మాణానికి అడ్డంకులు ఎదురైనప్పుడు జాతీయ రహదారుల సంస్థ, గ్యాస్‌ సరఫరా కంపెనీలతో చర్చలు జరిపారు. ప్రత్యేక అనుమతులపై విదేశాల నుంచి ఇంజనీర్లను రప్పించి పంప్‌హౌస్‌ల్లో మోటార్లను సిద్ధం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహించారు. వెరసి రికార్డు సమయంలో రాజీవ్‌ కెనాల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. అదే స్ఫూర్తితో భద్రాద్రి జిల్లాలో నిర్మించాల్సిన 1, 2, 7, 8 డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు కూడా చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అప్పుడే ప్రాజెక్టు నిర్వాసిత జిల్లాగా పేరున్న ‘భద్రాద్రి’కి కొంతైనా న్యాయం జరుగుతుందని అంటున్నారు.

రెండేళ్లలో పూర్తి చేస్తాం

సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు సంబంధించి మొత్తం ఎనిమిది ప్యాకేజీల పనులు చేపడుతున్నాం. ఇందులో జిల్లాకు సంబంధించిన నాలుగు ప్యాకేజీల టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో అగ్రిమెంట్లు చేసి పనులు ప్రారంభిస్తాం. రెండేళ్లలో డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం.

– రవికుమార్‌, నీటి పారుదలశాఖ డిప్యూటీ సీఈ

డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ ప్యాకేజీ వివరాలిలా..

ప్యాకేజీ కొత్త ఆయకట్టు నిర్మాణ వ్యయం లబ్ధిపొందే

(ఎకరాల్లో) (రూ. కోట్లలో) నియోజకవర్గాలు

1 41,813 రూ. 523 పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట

2 36,231 రూ. 262 కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట

7 63,310 రూ. 521 అశ్వారావుపేట

8 38,598 రూ. 467 అశ్వారావుపేట, సత్తుపల్లి

రైతులకు పైసా ప్రయోజనం లేదు..

సీతారామ ప్రాజెక్టులో ప్రధాన కాలువ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తయి రెండేళ్లు దాటినా ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు ప్రారంభించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు నయా పైసా ప్రయోజనం కలగలేదు. ఎట్టకేలకు 2024 ఆగస్టులో ఈ ప్రాజెక్టులోని మూడు పంపుహౌస్‌లను ప్రారంభించిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలో 1,49,952 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి తెచ్చేలా 1, 2, 7, 8 ప్యాకేజీల కింద డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత అయినా జిల్లా పొలాల్లోకి గోదావరి జలాలు ప్రవహించే రోజులు దగ్గర్లోకి వచ్చాయనే నమ్మకం కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement