
ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. ఏటీఎం విత్‌డ్రావల్ కొత్త ఛార్జీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని మించి చేసే ఏటీఎం లావాదేవాలపై ఛార్జీల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ రుసుములో ఏటీఎం కొనుగోలు, నిర్వహణ, ఇతర బ్యాంకుల కస్టమర్లకు సేవలను అందించడానికి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది.
సవరించిన ఏటీఎం ఛార్జీలు ఇవే..
మే 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తమ ఉచిత ఉపసంహరణ పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.2 అదనంగా రూ .23 చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో రూ .21 ఉండేది. దీన్ని 2022 నుంచి అమలు చేస్తున్నారు.
ఉచిత లావాదేవీలు
ఏటీఎం ఛార్జీల పెంపు ఉన్నప్పటికీ ఉచిత లావాదేవీ పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవు. సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు 5 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే.. మెట్రో గరాల్లో అయితే 3 లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో 5 లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సిఫారసుల మేరకు ఆర్బీఐ సవరణలో భాగంగా ఏటీఎం ఫీజులను పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, బ్యాంకులు ఈ పెంపునకు మొగ్గుచూపుతున్నాయి.
చిన్న బ్యాంకులపై ప్రభావం
లావాదేవీ రుసుముల పెరుగుదల చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాటికి తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు నగదు ఉపసంహరణ కోసం పెద్ద బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కస్టమర్లు అధిక ఛార్జీలను భరించాల్సి ఉంటుంది.