
సీఐఐ–సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడి
రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెట్టుబడుల పట్ల సంస్థాగత ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రంగం 2022–24 మధ్యకాలంలో (మూడేళ్లలో) 26.7 బిలియన్ డాలర్ల (రూ.2.29 లక్షల కోట్లు) ఈక్విటీ పెట్టుబడులను అందుకున్నట్టు సీఐఐ–సీబీఆర్‌ఈ సంయుక్త నివేదిక తెలిపింది. ఇందులో పావు శాతం అంటే 6.7 బిలియన్ డాలర్లను (రూ.57,600 కోట్లు సుమారు) ముంబై నగరం ఆకర్షించడం గమనార్హం.
ముంబైతోపాటు ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు ఈ మూడు నగరాల నుంచి మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడులు 16.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోకి 2022–24 మధ్య వచ్చిన పెట్టుబడుల్లో 62 శాతాన్ని ఈ మూడు నగరాలు దక్కించుకున్నాయి. పెట్టుబడి శ్రేణికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రధానంగా ఈ నగరాల్లో కేంద్రీకృతమై ఉండడం, బలమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరుల లభ్యత, రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా సంఘటితంగా మారుతుండడం ఈ మూడు నగరాలకు అనుకూలిస్తున్నట్టు ఈ నివేదిక వివరించింది.
అభివృద్ధిపైనే అధికంగా..
ల్యాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు 2022–24 మధ్య 44 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించినట్టు, ఆ తర్వాత ఆఫీస్ నిర్మాణ ఆస్తుల్లోకి 32 శాతం వచ్చినట్లు సీఐఐ–సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. ఇక గత మూడేళ్లలో 10 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులు (3 బిలియన్ డాలర్లు) టైర్–2 పట్టణ రియల్ ఎస్టేట్‌లోకి వచ్చినట్టు తెలిపింది. ‘భారత రియల్ ఎస్టేట్ రంగం కొత్త వృద్ధి పథంలోకి అడుగు పెట్టింంది. బలమైన మూలధన పెట్టుబడులు, అభివృద్ధికి భూముల లభ్యత ఇందుకు మద్దతునిస్తున్నాయి’ అని సీబీఆర్‌ఈ భారత ఛైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
ఆఫీస్ అసెట్స్, నివాస గృహ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు బలమైన సెంటిమెంట్ ఉండడం అన్నది స్థిరమైన వినియోగ డిమాండ్‌కు నిదర్శనంగా అన్షుమన్ పేర్కొన్నారు. దేశ రియల్ ఏస్టేట్ రంగం మరింత సంస్థాగతంగా మారుతున్నట్టు సీఐఐ పశ్చిమ ప్రాంత ఛైర్మన్ రిషి కుమార్ బగ్లా తెలిపారు. దీంతో ఈ రంగం మరింత పారదర్శకతతో, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటున్నట్టు చెప్పారు. ఈ రంగం మరింత సంస్థాగతంగా, నియంత్రితంగా మారితే అప్పుడు అంతర్జాతీయ ఫండ్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వస్తాయన్నారు.