న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగంలో భూముల క్రయవిక్రయాలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌లో భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ ప్రకారం.. 100 కంటే ఎక్కువ భూ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా సుమారు 1,700 ఎకరాలు చేతులు మారాయి. గతేడాది ఇదే కాలంలో 60 డీల్స్‌కుగాను 1,200 ఎకరాలు చేతులు మారాయి.
డీల్స్ సంఖ్య పరంగా ఈ ఏడాది 65 శాతం వృద్ధి నమోదైంది. ల్యాండ్ డీల్స్‌లో ఆరు ప్రధాన భారతీయ నగరాలు ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ల్యాండ్ డీల్స్‌లో రెసిడెన్షియల్ 61 శాతం, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 13 శాతం, ఆఫీస్ విభాగం 8 శాతం నమోదయ్యాయి. విభిన్న రకాల ఆస్తులకు సంబంధించి పెరిగిన భూ ఒప్పంద కార్యకలాపాలు బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నులను ప్రతిబింబిస్తున్నట్లు సీబీఆర్‌ఈ తెలియజేసింది.
ఇదీ చదవండి: ఆఫీస్ స్పేస్‌కు భలే గిరాకీ.. భారీగా పెరిగిన లీజింగ్
‘‘రెసిడెన్షియల్, ఆఫీస్, డేటా సెంటర్ల వంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలలో బలమైన వృద్ధిని చూస్తున్నాం. భారత రియల్ ఎస్టేట్ రంగం యొక్క దీర్ఘకాలిక అవకాశాలపై పెట్టుబడిదారులు మరింత నమ్మకంగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం. ఈ ఆశావాదం భారత్‌ను రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు వ్యూహాత్మక మార్కెట్‌గా నిలుపుతోంది. వివిధ మార్కెట్లలో బలమైన డిమాండ్, అనుకూల ఆర్థిక పరిస్థితులతో కలిపి వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. మార్కెట్ స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను నొక్కి చెప్పే వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ ఊపు కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని సీబీఆర్‌ఈ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment