ఏడు పట్టణాల్లో 38 శాతం అధికం
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస ఇళ్లకు (లగర్జీ) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. సెపె్టంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.4కోట్లకు పైగా విలువైన 12,630 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 9,165 యూనిట్లతో పోల్చి చూస్తే 38 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ విడుదల చేసింది.
ముఖ్యంగా హైదరాబాద్‌లో మాత్రం రూ.4కోట్లపైన ఖరీదైన ఇళ్ల విక్రయాలు 1,540 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కాస్త మెరుగ్గా 1,560 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం.
పట్టణాల వారీగా..
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 5,855 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది విక్రయాలు 3,410 యూనిట్లతో పోల్చితే 70 శాతం పెరిగాయి.
→ ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3,250 యూనిట్ల నుంచి 3,820 యూనిట్లకు పెరిగాయి.
→ బెంగళూరులో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 240 యూనిట్ల నుంచి 35 యూనిట్లకు
తగ్గిపోయాయి.
→ పుణెలో రెట్టింపునకు పైగా పెరిగి 810 యూనిట్ల మేర అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 330 యూనిట్లుగానే ఉన్నాయి.
→ చెన్నైలోనూ 130 యూనిట్ల నుంచి 185 యూనిట్లకు అమ్మకాలు వృద్ధి చెందాయి.
→ కోల్‌కతాలో రూ.4కోట్లకు పైన విలువ చేసే 380 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాంలో 240 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఆధునిక అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గు..
‘‘ప్రీమియం ఇళ్ల విభాగంలో డిమాండ్ పెరగడం చూస్తున్నాం. సంప్రదాయంగా మధ్యస్థ బడ్జెట్ ఇళ్ల మార్కెట్లు అయిన నోయిడా, బెంగళూరు, పుణె, చెన్నైలోనూ క్రమంగా లగ్జరీ ఇళ్ల వైపునకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. బంగళాల నుంచి ఆధునిక అపార్ట్‌మెంట్లు, పెంట్‌హౌస్‌ల వైపు మార్కెట్ మళ్లుతోంది. దీంతో లగ్జరీ ప్రాజెక్టుల్లో ప్రీమియం సౌకర్యాల కల్పన ఇతర ప్రాజెక్టులతో పోలి్చతే కీలక వైవిధ్యంగా మారింది’’అని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలు, ఆధునిక, సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లు అటు నివాసానికి, ఇటు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియం నివాస అనుభవం, ప్రపంచస్థాయి వసతులు మారిన కొనుగోలుదారుల ఆకాంక్షలను ప్రతిఫలిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment