Luxury housing sales: దేశంలో ఇళ్ల కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. ఖరీదు ఎక్కువైనా విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా పెద్దపెద్ద నగరాల్లో ఈ ధోరణి ఇటీవల మరింత పెరిగింది. ఈ క్రమంలో రూ.4 కోట్లు, అంతకంటే విలువైన లగ్జరీ నివాసాల అమ్మకాలు దాదాపు రెట్టింపైనట్లు రియల్‌ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్‌ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ (CBRE South Asia Pvt.Ltd) ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది.
ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా టాప్ ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 97 శాతం పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 4,700 లగ్జరీ నివాసాలు అమ్ముడుపోగా ఈ ఏడాది వాటి సంఖ్య దాదాపు రెట్టింపై 9,200లకు చేరింది.
మూడు నగరాల్లోనే 90 శాతం
ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ అమ్మకాలలో మొదటి మూడు మార్కెట్లుగా ఉద్భవించాయి. మొత్తం టాప్ ఏడు నగరాల్లో జరిగిన అమ్మకాలలో దాదాపు 90 శాతం ఈ మూడు నగరాల్లోనే నమోదయ్యాయి. వీటిలో దాదాపు 37 శాతం వాటాతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ టాప్‌లో ఉండగా ముంబయి, హైదరాబాద్, పుణె వరుసగా 35 శాతం, 18 శాతం, 4 శాతం వాటాతో ముందంజలో ఉన్నాయి.
ఈ తొమ్మిది నెలల్లో నమోదైన పటిష్టమైన అమ్మకాల ఆధారంగా ఈ పండుగల సీజన్‌లో హౌసింగ్ మార్కెట్ మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్ కొత్త రికార్డును నెలకొల్పుతుందని, మొత్తం గృహాల విక్రయాలు 150,000 యూనిట్లను దాటతాయని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment