
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా, టెక్నాలజీ దిగ్గజం ఎక్స్‌పీరియన్, హైదరాబాద్‌లోని తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ని (జీఐసీ) మరింతగా విస్తరించింది. గతానికన్నా రెట్టింపు ఆఫీస్ స్పేస్‌తో 85,000 చ.అ. విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటైనట్లు సంస్థ సీఈవో (టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఇన్నోవేషన్) అలెగ్జాండర్ లింట్నర్ తెలిపారు.
ప్రపంచ స్థాయి ప్రోడక్టులు రూపొందించేందుకు, నిరంతరాయంగా సర్వీసులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ప్రధానంగా ఫిన్‌టెక్, అనలిటిక్స్, మోసాల నివారణ వంటి అంశాలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ జీఐసీ ఎక్స్‌పీరియన్ ప్రపంచవ్యాప్త సాంకేతిక కార్యకలాపాలకు కీలకమైన నాడీ కేంద్రంగా రూపుదిద్దుకుంది. క్లౌడ్ మైగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పురోగతి, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ప్రాసెస్ ఆటోమేషన్లో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌లోని బలమైన ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకోవడం ద్వారా, ఎక్స్‌పీరియన్ ప్రపంచవ్యాప్తంగా స్కేలబుల్, డేటా ఆధారిత పరిష్కారాలను అందించే సామర్థ్యాన్ని పెంచుతోంది.