
రెండేళ్లలో కొత్తగా 19 ప్రీమియం మాల్స్
టాప్–8 నగరాల్లో అందుబాటులోకి కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రీమియం షాపింగ్ మాల్స్‌కు నగరాల్లో డిమాండ్ విస్తృతం అవుతోంది. దీనికి అనుగుణంగా వచ్చే రెండేళ్లలో (2026 చివరికి) హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో 19 ప్రీమియం షాపింగ్ మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ సంస్థ తాజాగా ఒక నివేదిక రూపంలో విడుదల చేసింది. 2025, 2026లో నిర్వహణలోకి రానున్న 19 గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం 123 లక్షల చదరపు అడుగులుగా ఉండనుంది.
ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌లో ఇవి రానున్నాయి. ఇందులోనూ 86 లక్షల చదరపు అడుగులు ఉన్నత శ్రేణికి నిదర్శనమైన గ్రేడ్ ఏ–ప్లస్ రూపంలో ఉండనుంది. నాణ్యమైన వసతుల వైపు కంపెనీల దృష్టి మళ్లిందనడానికి ఇది నిదర్శనమని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ నివేదిక పేర్కొంది. గ్రేడ్ ఏ–ప్లస్ మాల్స్‌ను సాధారణంగా ప్రముఖ డెవలపర్లు లేదా సంస్థాగత ఇన్వెస్టర్లు నిర్వహిస్తుంటారు. వీటిల్లో భర్తీ రేటు చాలా మెరుగ్గా (85 శాతానికి పైనే) ఉంటుంది.
వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా..
‘‘భారత రిటైల్ పరిశ్రమ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. వినియోగదారుల ఆకాంక్షలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఉన్నత శ్రేణి మాల్స్ మరిన్ని అందుబాటులోకి రావడం విస్తరణకే కాకుండా నాణ్యత, మెరుగైన అనుభవానికి పెరిగిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. ఉత్పత్తి ఎంత ముఖ్యమో, మెరుగైన బ్రాండ్ అనుభవానికీ నేడు కస్టమర్ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిటైల్ ఇండియా హెడ్ ఔసౌరభ్ షట్దాల్ తెలిపారు.
సౌందర్య, ఆరోగ్య సంరక్షణ, ఆహారం–పానీయాలు, క్రీడా వ్రస్తాల విభాగాలు రిటైల్ పరిశ్రమ తదుపరి దశను మార్చనున్నాయని చెప్పారు. డిజిటల్‌గా అనుసంధానమైన, భవిష్యత్‌కు అనుకూలమైన రిటైల్ నమూనాలు దేశ వినియోగదారుల ఆకాంక్షలను ప్రతిబింబించేవిగా పేర్కొన్నారు. దేశంలో గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం 2024 చివరికి 615 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు, ఇందులో గ్రేడ్ ఏ–ప్లస్ మాల్స్ విస్తీర్ణం ఇప్పటికే 63 శాతానికి చేరినట్టు (38.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ) ఈ నివేదిక వెల్లడించింది.