దేశంలో పెరిగిపోతున్న ఘోస్ట్‌ మాల్స్‌.. ఏంటివి? | Sakshi
Sakshi News home page

దేశంలో పెరిగిపోతున్న ఘోస్ట్‌ మాల్స్‌.. ఏంటివి?

Published Wed, May 8 2024 7:42 AM

Ghost malls rising in India

దేశంలోని  ప్రధాన నగరాల్లో ఘోస్ట్ షాపింగ్ మాల్స్‌ పెరిగిపోతున్నాయి. 40 శాతం కంటే ఎక్కువగా ఖాళీలు ఉండే షాపింగ్‌ మాల్స్‌ను ఘోస్ట్‌ మాల్స్‌ అంటారు. అటువంటి మాల్స్ సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక, 'థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024' సూచిస్తోంది.

నివేదిక ప్రకారం.. ఘోస్ట్ షాపింగ్ మాల్స్ సంఖ్య 2023లో 64కి పెరిగింది. ఇది 2022లో 57గా ఉండేది.  ఇది రిటైల్ రంగంలో ఒడిదుడుకుల ధోరణిని ప్రతిబింబిస్తోంది. 2023లో మొత్తం 13.3 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజు విస్తీర్ణంలో 64 షాపింగ్ మాల్స్.. 'ఘోస్ట్ షాపింగ్ సెంటర్స్'గా వర్గీకరించినట్లు నివేదిక వెల్లడించింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే విస్తీర్ణంలో 58 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ఢిల్లీలో ఘోస్ట్‌ షాపింగ్‌ మాల్స్‌ సంఖ్య అత్యధికంగా ఉంది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఘోస్ట్ షాపింగ్ సెంటర్ స్టాక్‌లో 19 శాతం క్షీణత నమోదు కావడం విశేషం.

విలువపై ప్రభావం:
ఘోస్ట్ షాపింగ్ సెంటర్‌ల పెరుగుదల కారణంగా 2023లో దాదాపు రూ. 6,700 కోట్లు లేదా 798 మిలియన్ డాలర్ల విలువను కోల్పోవచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. ఇది రిటైల్ రంగంపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని సూచిస్తుంది. భూ యజమానులు, డెవలపర్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తోంది.

దుకాణదారులకు మెరుగైన రిటైల్ అనుభవం ప్రాముఖ్యతను నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ నొక్కి చెప్పారు. "గ్రేడ్ ఏ మాల్స్ ముఖ్యంగా రాణించాయి, బలమైన ఆక్యుపెన్సీ, ఫుట్ ట్రాఫిక్, కన్వర్షన్ రేట్లను సాధిస్తున్నాయి. తద్వారా తమ వినియోగదారులకు విలువను అందిస్తున్నాయి" అన్నారు.

మరోవైపు దేశవ్యప్తంగా 8 కొత్త రిటైల్ కేంద్రాలను చేర్చినప్పటికీ, 2023లో 16 షాపింగ్ కేంద్రాలు మూసివేయడంతో, టైర్1 నగరాల్లో మొత్తం షాపింగ్ కేంద్రాల సంఖ్య 263కి తగ్గింది. డెవలపర్లు నివాస లేదా వాణిజ్యపరమైన అభివృద్ధిని చేపట్టడం వంటి వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉండే, ఆదాయం లేని షాపింగ్ కేంద్రాలను కూల్చివేశారు. కొన్నింటిని శాశ్వతంగా మూసివేశారు.

 
Advertisement
 
Advertisement