జూన్ త్రైమాసికంలో 15 శాతం వృద్ధి
కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ (దుకాణాలకు సంబంధించి స్థలం)కు డిమాండ్ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎనిమిది ప్రముఖ నగరాల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ 15 శాతం వృద్ధి చెంది 6.12 లక్షల చదరపు అడుగులకు చేరిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో డిమాండ్ 5.33 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం.
ఇక ఈ ఎనిమిది నగరాల్లోని ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 13.89 లక్షల చదరపు అడుగులుగా ఉందని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 13.31 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గ్రేడ్ ఏ, బి షాపింగ్ మాల్స్, ప్రముఖ వీధుల్లోని రిటైల్ వసతుల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో అద్దెలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది.
ప్రధాన వీధుల్లో మరింత డిమాండ్..
రిటైల్ లీజింగ్‌లో ముఖ్యంగా ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ విభాగం తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నట్టు కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. కొత్త మాల్స్ పరిమితంగా ప్రారంభం కావడం, అధిక నాణ్యత కలిగిన వసతులకు డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రముఖ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై లీజుకు రిటైలర్లు ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్–జూన్ కాలంలో మొత్తం లీజింగ్‌లో 70 శాతం ప్రధాన వీధులకు సంబంధించే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గ్రేడ్ ఏ మాల్స్, ప్రధాన వీధుల్లోని (రహదారులపై) రిటైల్ స్పేస్‌కు బలమైన డిమాండ్ కొనసాగింది.
దేశీయ రిటైల్ మార్కెట్ చైతన్యాన్ని ఇది తెలియజేస్తోంది. ప్రధాన వీధుల్లో అద్దెలు కూడా చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. గ్రేడ్ ఏ విభాగంలో త్వరలో రానున్న 45 లక్షల చదరపు అడుగుల స్పేస్‌తో మధ్య కాలానికి అద్దెల ధరలు స్థిరతపడతాయని అంచనా వేస్తున్నాం. ఇది డిమాండ్–సరఫరా పరస్థితులను మారుస్తుంది. అయితే, ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ లీజు కార్యకలాపాలు ఆరోగ్యకరంగా ఉంటాయన్నది మా అంచనా. లీజింగ్ పరిమాణంలో 53 శాతం వాటా ఆక్రమించే ప్రముఖ బ్రాండ్లు, ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ (ఎఫ్‌అండ్‌బీ) బలమైన పనితీరు చూపిస్తుండడం దేశంలో అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్ ప్రాధాన్యతను గుర్తు చేస్తోంది’’అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిటైల్ హెడ్ సౌరభ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment