Cushman & Wakefield
-
షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ (దుకాణాలకు సంబంధించి స్థలం)కు డిమాండ్ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎనిమిది ప్రముఖ నగరాల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ 15 శాతం వృద్ధి చెంది 6.12 లక్షల చదరపు అడుగులకు చేరిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో డిమాండ్ 5.33 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఎనిమిది నగరాల్లోని ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 13.89 లక్షల చదరపు అడుగులుగా ఉందని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 13.31 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రేడ్ ఏ, బి షాపింగ్ మాల్స్, ప్రముఖ వీధుల్లోని రిటైల్ వసతుల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో అద్దెలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రధాన వీధుల్లో మరింత డిమాండ్.. రిటైల్ లీజింగ్‌లో ముఖ్యంగా ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ విభాగం తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నట్టు కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. కొత్త మాల్స్ పరిమితంగా ప్రారంభం కావడం, అధిక నాణ్యత కలిగిన వసతులకు డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రముఖ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై లీజుకు రిటైలర్లు ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్–జూన్ కాలంలో మొత్తం లీజింగ్‌లో 70 శాతం ప్రధాన వీధులకు సంబంధించే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గ్రేడ్ ఏ మాల్స్, ప్రధాన వీధుల్లోని (రహదారులపై) రిటైల్ స్పేస్‌కు బలమైన డిమాండ్ కొనసాగింది. దేశీయ రిటైల్ మార్కెట్ చైతన్యాన్ని ఇది తెలియజేస్తోంది. ప్రధాన వీధుల్లో అద్దెలు కూడా చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. గ్రేడ్ ఏ విభాగంలో త్వరలో రానున్న 45 లక్షల చదరపు అడుగుల స్పేస్‌తో మధ్య కాలానికి అద్దెల ధరలు స్థిరతపడతాయని అంచనా వేస్తున్నాం. ఇది డిమాండ్–సరఫరా పరస్థితులను మారుస్తుంది. అయితే, ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ లీజు కార్యకలాపాలు ఆరోగ్యకరంగా ఉంటాయన్నది మా అంచనా. లీజింగ్ పరిమాణంలో 53 శాతం వాటా ఆక్రమించే ప్రముఖ బ్రాండ్లు, ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ (ఎఫ్అండ్బీ) బలమైన పనితీరు చూపిస్తుండడం దేశంలో అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్ ప్రాధాన్యతను గుర్తు చేస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిటైల్ హెడ్ సౌరభ్ తెలిపారు. -
కో–వర్కింగ్, కో–లివింగ్లకు మంచి భవిష్యత్తు
న్యూఢిల్లీ: రాబోయే సంవత్సరాలలో కో–వర్కింగ్, కో–లివింగ్ ప్రాజెక్ట్‌లకు మంచి భవిష్యత్తు ఉంటుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. నరెడ్కో, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంయుక్తంగా ‘కోవిండ్ అనంతరం కో–వర్కింగ్ అండ్ కో–లివింగ్ వృద్ధి’ అనే అంశం మీద వెబినార్ నిర్వహించాయి. ఈ సందర్భంగా నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిరానందాని మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెద్ద సంస్థల నుంచి ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. గతంలో సొంత ప్రాంగణాలకు ప్రాధాన్యమిచ్చే చాలా కంపెనీలు కరోనా తర్వాతి నుంచి కో–వర్కింగ్ స్పేస్ కోసం వెతుకుతున్నారని చెప్పారు. కోవిడ్‌తో విద్యా సంస్థల మూసివేత, వర్క్ ఫ్రం హోమ్ కారణంగా కో–లివింగ్ విభాగం మీద ప్రభావం చూపించిందని తెలిపారు. కో–లివింగ్‌లో స్టూడెంట్ హౌసింగ్ రాబోయే రెండేళ్లలో విపరీతమైన వృద్ధిని చూడనుందని చెప్పారు. విద్యా సంస్థలు పెద్ద ఎత్తున హాస్టల్ గృహాలను నిర్మించవని.. విద్యార్థి గృహల నిర్వాహకులతో భాగస్వామ్యం చేసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా, సౌత్ఈస్ట్ ఏషియా ఎండీ అన్షుల్ జైన్ మాట్లాడుతూ.. గతంలో కంటే కో–వర్కింగ్ స్పేస్ ఆకర్షణీయంగా మారిందన్నారు. వర్క్ ఫ్రం హోమ్ విధానాలతో తాత్కాలిక కాలం పాటు ఈ విభాగం మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఈ రెండు రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కంపెనీలు మూలధన పెట్టుబడుల పొదుపు, సౌకర్యం, వ్యయాల తగ్గింపు వంటి కారణంగా కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ ఏర్పడుతుందని వివరించారు. -
తయారీ గమ్యాల్లో భారత్ టాప్–3
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా తయారీకి అత్యంత అనువైన 48 దేశాల జాబితాలో భారత్ మూడో ర్యాంకు దక్కించుకుంది. వ్యయాలు, నిర్వహణ పరిస్థితులపరంగా మిగతా దేశాలకు దీటుగా భారత్ పోటీనిస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ (సీఅండ్‌డబ్ల్యూ) రూపొందించిన గ్లోబల్ తయారీ రిస్క్ సూచీ (ఎంఆర్ఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చైనా, అమెరికా ఈ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. భారత్ ఒక ర్యాంకు ఎగబాకి మూడో స్థానానికి చేరింది. నిర్వహణ పరిస్థితులు, వ్యయాలపరమైన అంశాల్లో పోటీ కోణంలో భారత్ అంతర్జాతీయ తయారీ హబ్‌గా ఎదుగుతోందని నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో భారత్ టాప్ 3 ర్యాంకు దక్కించుకోవడం మరింతగా ఊతమివ్వగలదని సీఅండ్డబ్ల్యూఎండీ (భారత్, ఆగ్నేయాసియా) అన్షుల్ జైన్ తెలిపారు. కరోనా ప్రభావాలను పక్కనపెట్టి వ్యయాలపరమైన పోటీ, సులభతర నిర్వహణ అంశాల్లో చైనా అగ్రస్థానంలో, అమెరికా ద్వితీయ స్థానంలో, భారత్ తృతీయ స్థానంలో ఉంది. ఇక కేవలం వ్యయాలను పరిగణనలోకి తీసుకున్నా కూడా చైనా, వియత్నాంల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. కానీ రిస్కుల అంశాన్ని తీసుకుంటే 30వ ర్యాంకు దక్కించుకుంది. రాజకీయ, ఆర్థికపరమైన రిస్కులు తక్కువగా ఉన్న దేశాలకు మెరుగైన ర్యాంకులు లభించాయి. సుమారు 20 అంశాల ప్రాతిపదికన సీఅండ్‌డబ్ల్యూ వార్షికంగా గ్లోబల్ ఎంఆర్ఐ రూపొందిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన ఎంఆర్ఐలో అంతర్జాతీయంగా తయారీ రంగంపై కరోనా వైరస్ ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. డిజిటల్ ఆవిష్కరణలకు కేంద్రం: నాస్కామ్ న్యూఢిల్లీ: భారత్ డిజిటల్ ఆవిష్కరణల కేంద్రంగా అవతరించే సామర్థ్యాలున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్ అన్నారు. ఇందుకోసం నైపుణ్యం, విధాన కార్యాచరణ, విశ్వాస కల్పనపై దృష్టి పెట్టాలని విధానకర్తలకు సూచించారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మూడు విభాగాల్లో సామర్థ్యాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించాలని, హైపర్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఈ విభాగాలు ఎంతో కీలకమైనవిగా పేర్కొన్నారు. డిజిటల్ నైపుణ్యాల్లో భారత్‌కు కచ్చితమైన అనుకూలతలు ఉన్నాయంటూ.. సరైన విధానాన్ని రూపొందించడం అవసరమని చెప్పారు. -
మరో మూడు కంపెనీల్లో వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిరామిక్ రంగంలో ఉన్న సొమానీ సిరామిక్స్ 2014-15లో మరో మూడు కంపెనీల్లో వాటా తీసుకోనుంది. ఒక్కో కంపెనీలో 26 లేదా 51 శాతం వాటా చేజిక్కించుకోనుంది. తయారు చేసే ఉత్పత్తులు, ఆ కంపెనీ పనితనం ఆధారంగా వాటా నిర్ణయించనుంది. వాటా కొనుగోలుకుగాను రూ.150 కోట్ల దాకా వెచ్చించనుంది. గత ఆరు నెలల్లో రూ.120 కోట్లు వెచ్చించి వివిధ కంపెనీల్లో వాటా దక్కించుకుంది. 2 సొంత ప్లాంట్లు, 6 భాగస్వామ్య, 9 థర్డ్ పార్టీ ప్లాంట్లతో కలిపి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 43 మిలియన్ మీటర్లు. 2015 మార్చి నాటికి ఇది 50 మిలియన్ మీటర్లకు చేరుకోనుందని సొమానీ సిరామిక్స్ జాయింట్ ఎండీ అభిషేక్ సొమానీ తెలిపారు. డిస్ప్లే సెంటర్‌ను ప్రారంభించేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. గ్యాస్ లేకనే విరమించాం.. ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ కేటాయింపులు లేకనే ప్లాంటు ఏర్పాటు ఆలోచనను విరమించామని అభిషేక్ వెల్లడించారు. గ్యాస్ కేటాయించిన మరుసటి రోజే ప్లాంటు నెలకొల్పుతామని పేర్కొన్నారు. గ్యాస్ కష్టాలు ఇక్కడ మూడు నాలుగేళ్లుంటాయని చెప్పారు. మార్కెట్ తీరు.. టైల్స్ పరిశ్రమ భారత్‌లో రూ.20-22 వేల కోట్లుంది. వృద్ధి రేటు 12 శాతముంది. మొత్తం పరిశ్రమలో 50 శాతం వాటా వ్యవస్థీకృత రంగానిది. ఈ రంగంలో ఉన్న సొమానీ సిరామిక్స్కు 13.5 శాతం మార్కెట్ వాటా ఉంది. వృద్ధి రేటు 24 శాతం నమోదు చేస్తోంది. న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు గతేడాది 65 శాతం తగ్గి 120 కోట్ల డాలర్లకు చేరాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ (సీ అండ్ డబ్ల్యు) తెలిపింది. పెట్టుబడులపరంగా ఆసియా పసిఫిక్‌లో భారత్ పదో స్థానంలో కొనసాగుతోందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో సంస్థ పేర్కొంది. ‘2013లో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో రియల్టీ రంగంలో పెట్టుబడులు 48,700 కోట్ల డాలర్లకు చేరాయి. చైనా 35,800 కోట్ల డాలర్ల పెట్టుబడులతో అగ్రస్థానంలో ఉంది. జపాన్ (4,460 కోట్ల డాలర్లు) రెండో స్థానంలో నిలిచింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించడమే రియల్టీలో ప్రస్తుత పరిస్థితికి కారణమని సీ అండ్ డబ్ల్యు ఎగ్జిక్యూటివ్ ఎండీ సంజయ్ దత్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ చెక్కుచెదరలేదనీ, ఈ రంగం భవిష్యత్తు ఆశాజనంగా ఉందనీ చెప్పారు. వచ్చే ఏడాది నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లు గణనీయంగా పుంజుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.