
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా తయారీకి అత్యంత అనువైన 48 దేశాల జాబితాలో భారత్ మూడో ర్యాంకు దక్కించుకుంది. వ్యయాలు, నిర్వహణ పరిస్థితులపరంగా మిగతా దేశాలకు దీటుగా భారత్ పోటీనిస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ (సీఅండ్‌డబ్ల్యూ) రూపొందించిన గ్లోబల్ తయారీ రిస్క్ సూచీ (ఎంఆర్‌ఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చైనా, అమెరికా ఈ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. భారత్ ఒక ర్యాంకు ఎగబాకి మూడో స్థానానికి చేరింది. నిర్వహణ పరిస్థితులు, వ్యయాలపరమైన అంశాల్లో పోటీ కోణంలో భారత్ అంతర్జాతీయ తయారీ హబ్‌గా ఎదుగుతోందని నివేదిక పేర్కొంది.
కరోనా వైరస్ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో భారత్ టాప్ 3 ర్యాంకు దక్కించుకోవడం మరింతగా ఊతమివ్వగలదని సీఅండ్‌డబ్ల్యూఎండీ (భారత్, ఆగ్నేయాసియా) అన్షుల్ జైన్ తెలిపారు. కరోనా ప్రభావాలను పక్కనపెట్టి వ్యయాలపరమైన పోటీ, సులభతర నిర్వహణ అంశాల్లో చైనా అగ్రస్థానంలో, అమెరికా ద్వితీయ స్థానంలో, భారత్ తృతీయ స్థానంలో ఉంది. ఇక కేవలం వ్యయాలను పరిగణనలోకి తీసుకున్నా కూడా చైనా, వియత్నాంల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. కానీ రిస్కుల అంశాన్ని తీసుకుంటే 30వ ర్యాంకు దక్కించుకుంది. రాజకీయ, ఆర్థికపరమైన రిస్కులు తక్కువగా ఉన్న దేశాలకు మెరుగైన ర్యాంకులు లభించాయి. సుమారు 20 అంశాల ప్రాతిపదికన సీఅండ్‌డబ్ల్యూ వార్షికంగా గ్లోబల్ ఎంఆర్‌ఐ రూపొందిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన ఎంఆర్‌ఐలో అంతర్జాతీయంగా తయారీ రంగంపై కరోనా వైరస్ ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.
డిజిటల్ ఆవిష్కరణలకు కేంద్రం: నాస్కామ్
న్యూఢిల్లీ: భారత్ డిజిటల్ ఆవిష్కరణల కేంద్రంగా అవతరించే సామర్థ్యాలున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్‌జాని ఘోష్ అన్నారు. ఇందుకోసం నైపుణ్యం, విధాన కార్యాచరణ, విశ్వాస కల్పనపై దృష్టి పెట్టాలని విధానకర్తలకు సూచించారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మూడు విభాగాల్లో సామర్థ్యాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించాలని, హైపర్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఈ విభాగాలు ఎంతో కీలకమైనవిగా పేర్కొన్నారు. డిజిటల్ నైపుణ్యాల్లో భారత్‌కు కచ్చితమైన అనుకూలతలు ఉన్నాయంటూ.. సరైన విధానాన్ని రూపొందించడం అవసరమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment