మరో మూడు కంపెనీల్లో వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిరామిక్ రంగంలో ఉన్న సొమానీ సిరామిక్స్ 2014-15లో మరో మూడు కంపెనీల్లో వాటా తీసుకోనుంది. ఒక్కో కంపెనీలో 26 లేదా 51 శాతం వాటా చేజిక్కించుకోనుంది. తయారు చేసే ఉత్పత్తులు, ఆ కంపెనీ పనితనం ఆధారంగా వాటా నిర్ణయించనుంది. వాటా కొనుగోలుకుగాను రూ.150 కోట్ల దాకా వెచ్చించనుంది. గత ఆరు నెలల్లో రూ.120 కోట్లు వెచ్చించి వివిధ కంపెనీల్లో వాటా దక్కించుకుంది. 2 సొంత ప్లాంట్లు, 6 భాగస్వామ్య, 9 థర్డ్ పార్టీ ప్లాంట్లతో కలిపి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 43 మిలియన్ మీటర్లు. 2015 మార్చి నాటికి ఇది 50 మిలియన్ మీటర్లకు చేరుకోనుందని సొమానీ సిరామిక్స్ జాయింట్ ఎండీ అభిషేక్ సొమానీ తెలిపారు. డిస్‌ప్లే సెంటర్‌ను ప్రారంభించేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
గ్యాస్ లేకనే విరమించాం..
ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ కేటాయింపులు లేకనే ప్లాంటు ఏర్పాటు ఆలోచనను విరమించామని అభిషేక్ వెల్లడించారు. గ్యాస్ కేటాయించిన మరుసటి రోజే ప్లాంటు నెలకొల్పుతామని పేర్కొన్నారు. గ్యాస్ కష్టాలు ఇక్కడ మూడు నాలుగేళ్లుంటాయని చెప్పారు.
మార్కెట్ తీరు..
టైల్స్ పరిశ్రమ భారత్‌లో రూ.20-22 వేల కోట్లుంది. వృద్ధి రేటు 12 శాతముంది. మొత్తం పరిశ్రమలో 50 శాతం వాటా వ్యవస్థీకృత రంగానిది. ఈ రంగంలో ఉన్న సొమానీ సిరామిక్స్‌కు 13.5 శాతం మార్కెట్ వాటా ఉంది. వృద్ధి రేటు 24 శాతం నమోదు చేస్తోంది.
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు గతేడాది 65 శాతం తగ్గి 120 కోట్ల డాలర్లకు చేరాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మాన్ అండ్ వేక్‌ఫీల్డ్ (సీ అండ్ డబ్ల్యు) తెలిపింది. పెట్టుబడులపరంగా ఆసియా పసిఫిక్‌లో భారత్ పదో స్థానంలో కొనసాగుతోందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో సంస్థ పేర్కొంది.
‘2013లో ఆసియా పసిఫిక్ రీజియన్లో రియల్టీ రంగంలో పెట్టుబడులు 48,700 కోట్ల డాలర్లకు చేరాయి. చైనా 35,800 కోట్ల డాలర్ల పెట్టుబడులతో అగ్రస్థానంలో ఉంది. జపాన్ (4,460 కోట్ల డాలర్లు) రెండో స్థానంలో నిలిచింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించడమే రియల్టీలో ప్రస్తుత పరిస్థితికి కారణమని సీ అండ్ డబ్ల్యు ఎగ్జిక్యూటివ్ ఎండీ సంజయ్ దత్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ చెక్కుచెదరలేదనీ, ఈ రంగం భవిష్యత్తు ఆశాజనంగా ఉందనీ చెప్పారు. వచ్చే ఏడాది నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్లు గణనీయంగా పుంజుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.