
రూ.2.8 లక్షల కోట్ల కార్యకలాపాలు
ప్రత్యక్ష, పరోక్ష వినియోగం రూపంలో ప్రయోజనం
డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక
ముంబై: ప్రయాగ్‌రాజ్ వేదికగా నెల రోజులకు పైగా జరిగిన మహా కుంభమేళా కార్యక్రమం దేశ ఆర్థిక రంగానికి మంచి బూస్ట్ (బలం) ఇచ్చినట్టయిందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక పేర్కొంది. రూ.2.8 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు మహా కుంభమేళా సందర్భంగా జరిగినట్టు తెలిపింది. ప్రత్యక్ష, పరోక్ష వినియోగం రూపంలో ఈ మేరకు ఆర్థిక రంగానికి ఉత్పాదకత సమకూరినట్టు వివరించింది. డేటా ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు తెలిపింది.
మేళాకు హాజరైన వారు రవాణా, వసతి, ఆహారం, పర్యాటక సేవలు, స్థానిక కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్లు ప్రత్యక్షంగా ఆర్థిక వ్యవస్థకు సమకూరినట్టు నివేదికలో పేర్కొంది. పరోక్ష రూపంలో ఎయిర్‌లైన్స్, హోటల్స్ తదితర రంగాలకు రూ.80,000 కోట్ల వ్యాపారం లభించినట్టు వివరించింది. మహాకుంభ మేళా సందర్భంగా చోటుచేసుకున్న వ్యాపార లావాదేవీలు ఆర్థిక వ్యవస్థపై ఎంతో సానుకూల ప్రభావం చూపిస్తాయని తెలిపింది.
ఈ సందర్భంగా ఆదాయం సంపాదించుకున్న వర్గాలు ఇళ్లు, విద్య, ఆరోగ్యం, రోజువారీ అవసరాల కోసం చేసే ఖర్చులతో ఆర్థిక వ్యవస్థకు రూ.1.1 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది. మొత్తం రూ.2.8 లక్షల కోట్ల కార్యకలాపాల్లో రూ.2.3 లక్షల కోట్లు వినియోగ వ్యయంగాను, మిగిలిన రూ.50,000 కోట్లు మౌలిక సదుపాయాలపై చేసిన వ్యయాల రూపంలోను ఉన్నట్టు పేర్కొంది. మహా కుంభమేళా సందర్భంగా రూ.2 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకుని ఉండొచ్చని ఇప్పటికే పలు అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం.
రవాణా కోసమే రూ.37వేల కోట్లు
మొత్తం వినియోగ వ్యయంలో రవాణా కోసం చేసింది సగం మేర ఉంటుందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. రూ.37,000 కోట్లు రవాణా కోసం వ్యయం చేయగా, ఇందులో రూ.17,700 కోట్లు రైల్వేకు సమకూరినట్టు అంచనా వేసింది.
హెలీకాప్టర్ జాయ్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్, అమ్యూజ్‌మెంట్‌పార్క్ ప్రవేశాలు, యోగ తదితర వాటి కోసమే భక్తులు రూ.10,000 కోట్ల వరకు వ్యయం చేసినట్టు వివరించింది. 2 లక్షల మంది రిటైల్ వర్తకులు కుంభమేళా సందర్భంగా రూ.7,000 కోట్ల వ్యాపారం నిర్వహించినట్టు తెలిపింది. ఆహార సేవలకు రూ.6,500 కోట్లు సమకూరినట్టు పేర్కొంది. టీ స్టాళ్ల యజమానులు ఒక్కొక్కరు రోజుకు రూ. 30,000 సంపాదించుకున్నారని వెల్లడించింది.