
ముంబై: ప్రైవేటు రంగ యస్ బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలకు కేటాయింపులు (ప్రొవిజన్లు) గణనీయంగా తగ్గడంతో మార్చి క్వార్టర్‌లో నికర లాభం 63% వృద్ధితో రూ.738 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.9,355 కోట్లకు చేరింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ. 9,016 కోట్లుగా ఉంది.
తాజా క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 5.7% పెరిగి రూ.2,276 కోట్లకు చేరింది. బ్యాంక్ డిపాజిట్ వృద్ధి 6.8%గా ఉంది. వడ్డీయేతర ఆదాయం 10.9% పెరిగి రూ.1,739 కోట్లకు చేరింది. మొత్తం ప్రొవిజన్లు 32.5% తగ్గి రూ.318 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండి బకాయిల నిష్పత్తి 1.6% తగ్గి రూ.3,935 కోట్లకు పరిమితమైంది. నికర మొండిబకాయిలు 0.3 శాతం క్షీణించాయి. రుణ డిపాజిట్ నిష్పత్తి 88% నుంచి 86.5 శాతానికి దిగివ చ్చింది. క్యాపిటల్ అడెక్వసీ 15.6 శాతానికి చేరింది.
‘‘స్థూల ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల దృష్ట్యా రుణ వృద్ధి 12–15 శాతం లక్ష్యంగా పెట్టుకున్నాము. రుణ వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి అధికంగా ఉంటుంది. సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేటు 2% తగ్గించడంతో మూడు శాతానికి పరిమితమైంది. దీని ప్రభావం కాసా(కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్)పై ఉండదు. క్రిడెట్ కార్డుల పోర్ట్‌ఫోలియోలో ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. రాబోయే 2–3 త్రైమాసికాల్లో క్రెడిట్ వ్యయం దిగివస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 37 బ్రాంచులు ఏర్పాటు చేశాము. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి కొత్తగా 80 శాఖలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాము’’ అని యస్ బ్యాంకు ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.