
సుభష్‌నగర్: గుంతలో పడిన బంతిని తీసే క్రమంలో పైనుంచి లిఫ్టు పడి ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందిన ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరారం డివిజన్ శ్రీకృష్ణనగర్‌లోని శ్రీ సాయి మణికంఠ రెసిడెన్సీ మొదటి అంతస్తులో నివసించే అక్బర్ పటేల్ (39) ఆర్‌ఎంపీ. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పిల్లలు ఆడుతుండగా బంతి లిఫ్ట్ గుంతలో పడిపోయింది. బంతిని తీసేందుకు అక్బర్ పటేల్ లిఫ్ట్ గుంతలో తలపెట్టి తీస్తుండగా ఈ క్రమంలో ఒక్కసారిగా లిఫ్టు అతనిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్బర్ పటేల్ స్వస్థలం కర్ణాటకలోని గుల్బర్గా. 15 ఏళ్లుగా స్థానికంగా ఆర్‌ఎంపీగా పని చేస్తున్నాడు. అక్బర్ పటేల్‌కు భార్య బిస్మిల్లా పటేల్, 7 ఏళ్ల లోపు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అక్బర్ మృతికి బిల్డర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు అపార్ట్‌మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని
డిమాండ్ చేశారు.
అనంతరం సూరారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత రాత్రి 8.40 గంటలకు సూరారం చౌరస్తాలో గంట పాటు ధర్నాకు దిగగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. అటు గండిమైసమ్మ చౌరస్తా, ఇటు ఐడీపీఎల్ వరకు భారీ ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సదరు బిల్డర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత కుటుంబానికి కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మద్దతు పలికారు.