
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం, వేధింపుల కారణంగా కట్టుకున్న భర్తనే భార్య హత్య చేసిన ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, సదరు భార్యాభర్తలు ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన సాయిల్, కవిత ఇద్దరూ భార్యాభర్తలు. కొన్నేళ్లుగా వీరద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. భార్య, భర్త ఇద్దరికి కూడా వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అయితే, కొద్ది నెలలుగా వీరి మళ్లీ కలిసి ఒకటిగా ఉంటున్నారు. ఈ క్రమంలో సాయిల్ ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. భర్త వేధింపులు భరించలేక కవిత విసుగు చెందింది. దీంతో, భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. తన చెల్లెలు భర్తతో కలిసి.. సాయిలును హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. అనంతరం, తన భర్త సాయిల్‌కు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. అతడు మృతిచెందిన తర్వాత కూకట్‌పల్లిలో సాయిల్‌ను పూడ్చిపెట్టారు.
అయితే, సాయిల్ కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు భార్య కవితను ప్రశ్నించారు. ఈ క్రమంలో కవిత.. తన భర్త పని కోసం హైదరాబాద్‌కు వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. అయినప్పటికీ సాయిల్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు, గ్రామ సర్పంచ్‌కు కవితపై అనుమానం వచ్చింది. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కవితను విచారించగా.. హత్య విషయం బయటకు వచ్చింది. అనంతరం, సాయిల్ మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
